నాలుగు గంటల పాటు గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ ముట్టడి
ఎక్కడి ఆటోలు అక్కడే
పౌరసరఫరాల శాఖాధికారి హామీతో విరమణ
ఇబ్బందులను పరిష్కరించకుంటే 29న నగర బంద్ : శంకర్
నాలుగు గంటల నిరసనతో భారీగా ట్రాఫిక్ జామ్
చిట్టినగర్ : నగరంలో సీఎన్‌జీ ఆటో కార్మికుల నిరసన సోమవారం తీవ్ర రూపం దాల్చింది. ఆటో సంఘాల కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో కార్మికులు భాగ్యనగర్ గ్యాస్ కంపెనీని ముట్టడించారు. తెల్లవారుజామున 6 గంటలకే ఆటో కార్మికులు చేరుకుని ఫిల్లింగ్ స్టేషన్‌లో కార్యకలాపాలు నిలిపివేయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆందోళన విరమించాలంటూ పలుమార్లు విజ్ఞప్తి చేశారు. చివరకు కొత్తపేట సీఐ వెంకటేశ్వర్లు రంగంలోకి దిగి ఆటో సంఘాల జేఏసీ కన్వీనర్ దోనేపూడి శంకర్‌తో పాటు ైవె ఎస్సార్ సీపీ టీయూ నేత విశ్వనాథ రవితో మాట్లాడారు. వీరు స్పష్టమైన హామీ కోసం పట్టుబట్టారు. పరిస్థితి చేయి దాటుతున్న నేపథ్యంలో పోలీసులు సబ్ కలెక్టర్‌కు విషయం తెలపడంతో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి కోమలి పద్మను ఘటనా స్థలానికి పంపారు. గురువారం నాటికి పరిస్థితి చక్కబడి నగరంలోని సీఎన్‌జీ బంకులకు 59 క్యూబిక్ మీటర్ల గ్యాస్ సరఫరా అవుతుందని ఆమె హామీ ఇచ్చారు. దీనిపై ఆటో సంఘాల జేఏసీ కన్వీనర్ దోనేపూడి శంకర్ మాట్లాడుతూ నగరంలో ఫిల్లింగ్ స్టేషన్ల సంఖ్యను 10కి పెంచడంతో పాటు గ్యాస్ సరఫరాలో చోటుచేసుకున్న సమస్యలను పరిష్కరించకుంటే 29వ తేదీ నగర బంద్ చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నగర ప్రధాన కార్యదర్శి ఆసుల రంగనాయకులు, వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ జిల్లా, అర్బన్ నాయకులు ఎం. శివరామకృష్ణ, విశ్వనాథ రవి, ఐఎఫ్‌టీయూ ప్రసాద్ ప్రసంగించారు.
వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ మద్దతు
ఉదయం 6 నుంచి 1 గంట వరకు కొనసాగిన ఆందోళనకు వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ జిల్లా, అర్బన్ నాయకులు మద్దతు తెలిపారు. జిల్లా కన్వీనర్ మాదు శివరామకృష్ణ, అర్బన్ కన్వీనర్ విశ్వనాథ రవిలు ఆందోళనలో భాగస్వాములయ్యారు.
బారులు తీరిన వాహనాలు
ఆందోళనతో కొత్తూరు తాడేపల్లి రోడ్డుకు ఇరువైపులా లారీలు, ఆటోలు బారులు తీరాయి. ద్విచక్ర వాహనాలను సైతం అనుమతించకపోవడంతో ఆటో డ్రైవర్లపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆటోలు దొరక్క ఇబ్బందులు
ఆటో కార్మికుల ఆందోళన కారణంగా నగరంలో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. పండగ సీజన్ కావడంతో కొనుగోలుదారులతో పాటు చిరుద్యోగులు సమయానికి బస్సులు రాక, ఆటోలు దొరక్క అనేక ఇబ్బందులకు గురయ్యారు. ఇదే అదునుగా కొంత మంది డీజిల్ ఆటోడ్రైవర్లు చెలరేగిపోయారు.
తాళ్లతో ఆటోలు లాగుతూ ప్రదర్శన
భవానీపురం : సీఎన్‌జీ సక్రమంగా అందించి తమ ఉపాధిని కాపాడాలంటూ ఆటో కార్మికులు ఫిల్లింగ్ స్టేషన్ నుంచి ఆటోలకు తాళ్లు కట్టి జాతీయ రహదారిపై ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో నారపాక శేఖర్, ఎ. వెంకటేశ్వరరెడ్డి, ఎస్‌డి. సందాని, షేక్ గాలిబ్, ఎస్‌కె. మస్తాన్, ఆటో కార్మికులు పాల్గొన్నారు.
సీఎన్‌జీ ఆటో కార్మికుల ఆందోళన
Published Tue, Dec 23 2014 1:29 AM | Last Updated on Sat, Sep 2 2017 6:35 PM
Advertisement
Advertisement