
‘తనిష్క్’ చోరీ కేసులో రెండో నిందితుడు ఆనంద్
‘తనిష్క్’ చోరీ కేసులో రెండో నిందితుడు.. రహస్యంగా విచారణ
సాక్షి, గుంటూరు/హైదరాబాద్: తనిష్క్ షోరూమ్‌లో దోపిడీకి పాల్పడిన రెండో నిందితుడు గంటినపాటి ఆనంద్ కూడా పోలీసులకు చిక్కాడు. హైదరాబాద్ పశ్చిమ మండల పోలీసులు మంగళవారం రాత్రి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. షోరూమ్ సీసీ కెమెరాల్లో చిక్కింది ఆనంద్ అని నిర్ధారించిన పోలీసులు అతడిని రహస్య ప్రదేశానికి తరలించి వివిధ కోణాల్లో ప్రశ్నిస్తున్నారు. దోపిడీ తర్వాత రెండు బంగారు గాజు లతో హైదరాబాద్ నుంచి పారిపోయిన ఆనంద్ సోమవారం రాత్రి విజయవాడకు చేరుకున్నాడు.
అక్కడ్నుంచి వినుకొండ, ఈపూరులో ఉంటున్న బంధువులకు ఫోన్ చేయడంతో వారే పోలీసులకు సమాచారం ఇచ్చి పట్టించినట్టు తెలిసింది. మరోవైపు ఈ కేసులో ఇప్పటికే అరెస్టు చేసిన కిరణ్‌ను పంజాగుట్ట పోలీసులు మంగళవారం చంచల్‌గూడ జైలుకు తరలించారు. గుంటూరు జిల్లా ఈపూరుకే చెందిన ఆనంద్.. కిరణ్‌కు బంధువు కావడం గమనార్హం. గతంలో మూడుసార్లు అక్కడ చిన్నచిన్న చోరీలు చేయడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అయితే ఫిర్యాదుదారులు రాజీ పడటంతో కేసులు నమోదు కాలేదని తెలిసింది. కిరణ్ కొద్దిరోజుల క్రితం ఆనంద్‌ను హైదరాబాద్ తీసుకువచ్చి తన గదిలోనే ఉంచుకుంటున్నాడు. తనిష్క్ షోరూమ్‌కు 2009లో కొన్ని మరమ్మతులు చేశారు. ఈ పనుల కాంట్రాక్టు చేపట్టిన కాంట్రాక్టర్ కృష్ణ కూడా గుం టూరు జిల్లా వాసి, నిందితులు కూడా అదే ప్రాంతానికి చెందిన వారే కావడంతో పోలీసులు అనుమానిస్తున్నారు. భవనం వెనుక ఇటుకలతో మూసివేసిన కిటికీ ఉన్నట్లు కాంట్రాక్టర్ ద్వారా వీరికి తెలిసిందా అన్న కోణంలో విచారణ చేస్తున్నారు. తామిద్దరమే చోరీలో పాల్గొన్నట్టు ఆనంద్ వెల్లడించినట్లు సమాచారం. కాగా, ఆనంద్ పారిపోవడంతో భయపడిన కిరణ్ బంగారాన్ని విక్రయిం చడం తేలిక కాదని నిర్ణయించుకున్నాడు. ఆదివారం రెండు ఉంగరాలను విక్రయించడానికి సాయంత్రం వరకు ప్రయత్నించాడు. ఏ దుకాణంలోకి వెళ్లినా దొరికిపోతాననే భయంతో రోడ్డుపై కనిపించే వారికి అమ్మేందుకు యత్నించాడు. చివరికి రూ.40 వేలు ఖరీదు చేసే ఉంగరాన్ని గుర్తుతెలియని వ్యక్తికి రూ.12 వేలకు విక్రయించినట్టు తెలిసింది.