
చోరీ సొత్తు అమ్మలేక లొంగిపోయారు
హైదరాబాద్: తనిష్క్ షోరూమ్‌లో దోపిడీకి పాల్పడిన రెండో నిందితుడు గంటినపాటి ఆనంద్ను పోలీసులు ఈ సాయంత్రం మీడియా ముందు ప్రవేశపెట్టారు. మొదటి నిందితుడు భూమన కిరణ్ కుమార్ను ఇంతకుముందే లొంగిపోయాడు. వీరిద్దరూ పథకం ప్రకారం దోపిడీ చేశారని పోలీసులు తెలిపారు.
మూడుసార్లు రెక్కీ నిర్వహించి దొంగతనానికి పథకం నిర్వహించారని చెప్పారు. కిరణ్ ప్రణాళిక రచించగా ఆనంద్ అమలు చేశాడని వెల్లడించారు. స్కూ డ్రైవర్పై చేతి రుమాలు పెట్టి సుత్తితో కొట్టి గోడ బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించారని తెలిపారు. కిరణ్ బయట కాపలాగా ఉండగా ఆనంద్ దుకాణం లోపలకు వెళ్లి దొంగతనం చేశాడని చెప్పారు. మూడు బ్యాగుల్లో నగలు ఎత్తుకు పోయారని చెప్పారు. అయితే సంఘటనా స్థలంలో ఆధారాలు లభ్యం కాకుండా జాగ్రత్త పడ్డారని వెల్లడించారు. ఐరీష్ కనబడకుండా కళ్లద్దాలు, తల వెంట్రుకలు ఘటనా స్థలంలో పడకుండా జెల్ రాసుకున్నారని చెప్పారు. పోలీసు కుక్కలు గుర్తు పట్టకుండా కారప్పొడి చల్లారని తెలిపారు.
చోరీ సొత్తు అమ్మడానికి, తాకట్టు పెట్టడానికి చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో భయపడిపోయి కిరణ్ కుమార్ లొంగిపోయాడని తెలిపారు. దీన్ని కప్పిపుచ్చుకోవడానికి కట్టుకథ అల్లాడని పేర్కొన్నారు. వేరే వాళ్ల ప్రమేయం ప్రత్యక్షంగాని, పరోక్షంగాని కనబడలేదన్నారు.