పైలట్ శిక్షణ.. పోలియో చికిత్స! | Breakthrough in Tanishq burglary case: One held, says he wanted to 'expose' security loopholes | Sakshi
Sakshi News home page

పైలట్ శిక్షణ.. పోలియో చికిత్స!

Published Tue, Jan 28 2014 3:05 AM | Last Updated on Sat, Sep 2 2017 3:04 AM

పైలట్ శిక్షణ.. పోలియో చికిత్స!

పైలట్ శిక్షణ.. పోలియో చికిత్స!

ఈ అవసరాల కోసమే తనిష్క్‌లో భారీ చోరీ
గుంటూరుకు చెందిన సమీప బంధువులే దొంగలు
సొత్తుతో ఒకరి లొంగుబాటు... మరొకరు పరారీ
రూ. 5.75 కోట్ల విలువైన 15.5 కేజీల పసిడి రికవరీ

 
 సాక్షి, సిటీబ్యూరో/గుంటూరు:
పైలట్ కావాలన్న కోరిక ఒకరికి.. ఇబ్బంది పెడుతున్న పోలియోకు చికిత్స పొందాలన్న తపన మరొకరికి..! ఇద్దరూ సమీప బంధువులు. ఈ రెండు అవసరాలు తీరాలంటే వారికి కనీసం రూ. 30 లక్షలు కావాలి. తాపీ మేస్త్రీలుగా పనిచేస్తున్న తమకు అంతమొత్తం సంపాదించాలంటే బంగారు ఆభరణాల దుకాణంలో దొంగతనం చేయడమే సరైన మార్గమనిపించింది. అంతే, ముందుగా రెక్కీ నిర్వహించి ఆ తరువాత పకడ్బందీగా.. ఈ శనివారం తెల్లవారుజామున నగరంలోని పంజాగుట్టలో ఉన్న తనిష్క్ జ్యువెలరీ దుకాణాన్ని కొల్లగొట్టారు. అయితే, ఆ మరునాడు మీడియాలో వచ్చిన వార్తలు, పోలీసుల ప్రకటనలు చూసి భయపడిపోయారు. ఒకరు పారిపోగా.. మరొకరు పోలీసులకు లొంగిపోయాడు. పూర్తి వివరాలు..
 
 -   గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గం, ఈపూరు గ్రామానికి చెందిన భూమన కిరణ్ కుమార్(24) ఇంటర్మీడియెట్ మధ్యలో ఆపేశాడు. బతుకుతెరువు కోసం నగరానికి వలసవచ్చి అనేక ఉద్యోగాల కోసం ప్రయత్నించి విఫలమయ్యాడు. చివరకు రసూల్‌పుర ప్రాంతంలో ఓ గదిలో అద్దెకుంటూ తాపీ మేస్త్రీగా పని చేస్తున్నాడు. కిరణ్ సమీప బంధువు గంటినపాటి ఆనంద్ కూడా ఆ గదిలోనే ఉంటూ తాపీ పనే చేస్తున్నాడు. కిరణ్ మరోపక్క కొన్ని చిన్నాచితక పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేస్తున్నాడు.
 -    కిరణ్‌కు శిక్షణ తీసుకుని పైలట్ వృత్తిలో స్థిరపడాలనే ఆశ ఉంది. ఆనంద్ ఎడమకాలుకు పోలియో  ఉండటంతో దానికి వైద్యం చేయించుకుని తానూ అందరిలాగే తిరగాలని ఆశించేవాడు. ఆ అవసరాలకు దాదాపు రూ. 30 లక్షలు ఖర్చవుతుందని తెలియడంతో.. వాటికోసం వారిద్దరూ బంగారం షాపులో దొంగతనం చేయాలనుకున్నారు.
 -    రసూల్‌పురకు దగ్గర కావడంతో పంజగుట్టను టార్గెట్‌గా ఎంచుకుని నెల రోజులుగా అక్కడున్న నాలుగు బంగారం దుకాణాల వద్ద రెక్కీ నిర్వహించారు. తనిష్క్ బంగారం దుకాణానికి, దాని వెనుక ఉన్న కమర్షియల్/రెసిడెన్షియల్ కాంప్లెక్స్ ప్రహరీ గోడకు మధ్య అడుగున్నర సందు ఉండటం గమనించి.. అదే సరైన లక్ష్యమనుకున్నారు.
 -    తనిష్క్ జ్యువెలరీ షోరూమ్ నడుస్తున్న భవనం 1997-98ల్లో నిర్మించారు. 2009లో మరమ్మతుల సందర్భంగా వెనుక వైపున్న ఓ కిటికీని ఇటుకలతో మూసేశారు. దీనికి లోపలి వైపు మాత్రమే సిమెంట్‌తో ప్లాస్టరింగ్ చేయడంతో బయటకు (సందులోకి) ఇటుకలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వీటిని గమనించిన నిందితులు తేలిగ్గా లోపలకు ప్రవేశించవచ్చని నిర్ణయించుకున్నారు. ఇద్దరూ తాపీ మేస్త్రీలే అయినప్పటికీ... గోడల్ని పగులకొట్టి కరెంటు పైపులు, వాటర్ పైపులు వేయడంలో అనుభవం ఉండడంతో ఆ ప్రాంతంలో రంధ్రం చేయడం తేలికని గుర్తించారు. ఒకటి రెండుసార్లు షోరూమ్ పని చేస్తున్న వేళల్లో కస్టమర్లుగా వెళ్లి అక్కడి పరిస్థితులు గమనించారు. సెక్యూరిటీ గార్డులు సైతం అప్రమత్తంగా లేరని గుర్తించారు.
 
 -    నిజానికి బుధవారం రాత్రే వారు తమ పని ప్రారంభించారు. ఆ రోజు అర్ధరాత్రి పాత కిటికీ దగ్గరకు చేరుకున్న ఇరువురూ స్క్రూడ్రైవర్, స్పానర్ తదితరాలను వినియోగించి ఇటుకల మధ్య ఉన్న సిమెంట్‌ను కొద్దికొద్దిగా తొలగించారు. కొన్ని ఇటుకల్ని పక్కకు తీసి వెనుక ప్లాస్టరింగ్ కనిపించడంతో పని ఆపేసి ఇటుకల్ని వాటి స్థానంలో పెట్టేశారు. ఎవరికీ అనుమానం రాకూడదనే ఉద్దేశంతో ఒకరోజు గ్యాప్ ఇచ్చారు. తిరిగి శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత షోరూమ్ వద్దకు వచ్చిన ఇద్దరూ ఇటుకల్ని తొలగించి బ్యాటరీ సాయంతో పని చేసే చిన్న డ్రిల్లింగ్ మిషన్ సాయంతో లోపలి సిమెంట్‌ను తొలగించారు. కిరణ్ బయటే ఉండిపోగా... ఆనంద్ ఆ రంధ్రంలో నుంచి లోపలకు వెళ్లాడు. కిరణ్ నుంచి స్క్రూడ్రైవర్ తీసుకుని అనువైన కౌంటర్ల తాళాల్ని పగులకొడుతూ సొత్తును కిరణ్‌కు అందించాడు. ముఖానికి, చేతికి తొడుగులు ధరించారు. కారం పొడి కూడా తీసుకెళ్లారు.
 -   వాస్తవానికి ఇద్దరూ మొదట తమ అవసరాలు తీరడానికి రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల విలువైన సొత్తునే ఎత్తుకుపోవాలని భావించారు. అయితే లోపలకు వెళ్లిన ఆనంద్ అక్కడి బంగారాన్ని చూసి అందినకాడికి బయట ఉన్న కిరణ్‌కు అందించాడు. దాదాపు గంటకు పైగా ఈ చోరీ చేసిన తరవాత ఇద్దరూ కలిసి అదే సందులో నుంచి బయటకు వచ్చి పంజగుట్ట చౌరస్తా వరకు వెళ్లారు. అక్కడ ఆటో తీసుకుని తిరిగి షోరూమ్ మీదుగానే రసూల్‌పురలో ఉన్న తమ రూమ్‌కు వెళ్లిపోయారు.
 -    మరునాడు మీడియాలో హంగామా, పోలీసుల ప్రకటనలు చూశాక వారిలో భయం మొదలైంది. ఆనంద్ రెండు బంగారు గాజుల్ని తీసుకుని పారిపోగా... కిరణ్ ఓ ఉంగరాన్ని అమ్మి రూ.8,640 క్యాష్ చేసుకున్నాడు. మిగిలిన సొత్తు గదిలోనే బ్యాగ్‌లో ఉంచేశారు. ఆనంద్ పారిపోవడంతో పూర్తిగా భయపడిపోయిన కిరణ్ ఓ వార్తాచానెల్‌ను ఆశ్రయించి కొత్త నాటకానికి తెరలేపాడు.
 సమాజం కుళ్లిపోయిందని..!
 -    ఆ చానెల్‌తో మాట్లాడిన కిరణ్ సమాజం కుళ్లిపోయిందని, రాజకీయాలు అవినీతి మయమైపోయాయని, మనుషుల్ని మేల్కొలపడంతో పాటు సెక్యూరిటీ విధానాల్లో ఉన్న లోపాల్నీ ఎత్తిచూపడానికే ఈ చోరీ చేశానంటూ ఘనంగా ప్రకటించాడు. తానొక్కడినే దొంగతనం చేశానని, పోలీసుల్ని తప్పుదోవ పట్టించడానికే అవిటివాడిలా నటించానంటూ నమ్మబలికి ఆనంద్‌ను రక్షించే ప్రయత్నం చేశాడు. పోలీసులకూ అదే కథ చెప్పడంతో.. వారు కిరణ్‌ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయం బయటపడింది. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు రూ.5.75 కోట్ల విలువైన 15.5 కేజీల బంగారం, రూ.8,640 నగదు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న ఆనంద్ కోసం గాలిస్తున్నారు.
-    లొంగిపోకపోయినా..  ఒకటి రెండు రోజుల్లో నిందితులు దొరికేవారేనని పోలీసులు చెప్పారు.  దర్యాప్తు ఒక కొలిక్కి వచ్చిందని, లొంగిపోకముందే కిరణ్‌ను ప్రధాన అనుమానితుడిగా గుర్తించామని ఒక పోలీసు అధికారి తెలిపారు.
 
 మానసికస్థితి సరిగ్గా ఉండని ఆనంద్..
 తనిష్క్ షోరూం దోపిడీలో కిరణ్‌తో పాటు పాల్గొన్న ఆనంద్ ఈపూరు నుంచి పది రోజుల క్రితమే కూలిపనికి హైదరాబాద్ వెళ్లాడు. మూడోతరగతితో చదువు ఆపేసిన ఆనంద్ చిన్నప్పట్నుంచి ఆవారాగా తిరుగుతుండే వాడని గ్రామస్తులు చెప్పారు. ఒక్కోసారి మానసిక పరిస్థితి బాగోలేక రోజులతరబడి ఎవరికీ చెప్పకుండా దూర ప్రాంతాలకు వెళ్లిపోతుండేవాడన్నారు.
 
 ఆడిటింగ్ తరవాత అసలు మొత్తం
 ‘చోరీ వెలుగులోకి వచ్చిన రోజు సంస్థ జనరల్ మేనేజర్ మణికందన్ ప్లెయిన్ గోల్డ్ ఆర్నమెంట్స్ 18 కిలోలు (విలువ సుమారు రూ.7.2 కోట్లు), కలర్ స్టోన్స్, ముత్యాలు పొదిగిన ఆభరణాలు 12 కిలోలు (విలువ సుమారు రూ.12 కోట్లు) పోయాయని ఫిర్యాదు చేశారు. ఆ తరవాత పూర్తి ఆడిట్ నిర్వహించి చోరీ అయిన సొత్తు రూ.5.98 కోట్ల విలువైన 15.57 కేజీలు మాత్రమే అని తెలిపారు. ఈ కేసులో ఒక నిందితుడిని అరెస్టు చేశాం. మరొకరి కోసం గాలిస్తూ వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. వివిధ సంస్థల్లో ఉన్న సెక్యూరిటీ లోపాలపై పోలీసులు కేవలం సలహాలు మాత్రమే ఇవ్వగలరు తప్ప ఆదేశాలు జారీ చేయలేరు. నిర్లక్ష్యంపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఏ చట్టంలోనూ పేర్కొనలేదు’    

- అనురాగ్ శర్మ, హైదరాబాద్ పోలీసు కమిషనర్
 
 రాజకీయాల్లోకి వెళ్తాననేవాడు
 ‘నా కొడుకు దొంగతనం చేశాడన్న విషయం నమ్మలేకపోతున్నాను. ఆయన వెనుక ఎవరి ప్రోద్బలమో ఉండిఉంటుంది. సంచలనం కోసం నాబిడ్డ దొంగగా ఎలా మారతాడు?’ అని ఈపూరు గ్రామం ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్న కిరణ్ తల్లి అన్నపూర్ణమ్మ ప్రశ్నించారు. ఐదుగురు అన్నదమ్ముల్లో నాల్గోవాడైన కిరణ్ తండ్రి మర ణించిన దగ్గర్నుంచి రాజకీయాల పట్ల ఆసక్తి చూపుతూ.. ఎప్పటికైనా తాను రాజకీయ నాయకుడిని అవుతాననేవాడని తెలిపారు. గ్రామంలో ఉండగా కిరణ్ తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేశాడని గ్రామస్తులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement