ఏలూరు (మెట్రో) : రెవెన్యూ శాఖ అవినీతికి మారుపేరుగా మారుతోంది. కొంతమంది అధికారులు, సిబ్బంది చేతి వాటానికి పూర్తిగా శాఖకే అవినీతి మచ్చ ఏర్పడుతోంది. ఇటీవల జరిగిన ఉదంతం ఇందుకు సాక్షిగా నిలుస్తోంది. పాలకోడేరు మండలం మోగల్లు గ్రామానికి చెందిన మల్లిపూడి ధనరాజుకు గ్రామంలో 791బై1 సర్వే నంబరులో ఎకరం 40 సెంట్ల భూమి ఉంది. అయితే అదే భూమికి సంబంధించి అల్లూరి నరసింహరాజు పేరుతోనూ పట్టాదారు పాస్ పుస్తకాలను రెవెన్యూ సిబ్బంది మంజూరు చేశారు. కేవలం గ్రామ కార్యదర్శి చేతిరాతతో మరొకరి పేరుమీద పట్టాదారు పాస్ పుస్తకాన్ని మంజూరు చేశారు.
ఈ నకిలీ పాస్ పుస్తకాలు, టైటిల్‌డీడ్‌ల జారీపై భూ యజమాని మల్లిపూడి ధనరాజు ఫిర్యాదు చేసినా యంత్రాంగం పట్టించుకోలేదు. దీనిపై భీమవరం కోర్టుల్లో సివిల్ కేసులు సైతం ఉన్నాయి. ఈ కేసులు పెండింగ్‌లో ఉండగానే ఆ స్థలంపై మరొకరికి విక్రయాలను సైతం చేసేశారు. వాస్తవానికి కేసులు న్యాయస్థానంలో ఉండగా ఎటువంటి క్రయవిక్రయాలు చేయకూడదు. కానీ నరసింహరాజు పేరుతో ఉన్నవాటిని భీమవరం జాయింట్ సబ్‌రిజిస్ట్రార్ వద్ద సాంబ్రాని వెంకట లక్ష్మీనారిమణికి రిజిస్ట్రేషన్ చేశారు.
ఇదిలా ఉండగా అప్పటి నుండి వీటిని అసలు వాటిగానే చెలామణి చేస్తున్నా సంబంధిత రెవెన్యూ విభాగం మాత్రం చర్యలు తీసుకోవడంలో మాత్రం వెనకాడుతోంది. ఇటీవల నరసాపురం ఆర్డీవో దీనిపై పాలకోడేరు తహసిల్దార్ ధనరాజును, నరశింహరాజును విచారించి వాస్తవాలను తెలుసుకుని నరశింహరాజు పేరుతో ఉన్న పాసుపుస్తకాలు నకిలీవని తేల్చారు. నకిలీ పాస్ పుస్తకాలు ఉన్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్డీవో ఆదేశించినా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఒక గ్రామ కార్యదర్శి రాతపూర్వకంగా పాస్ పుస్తకాలు జారీచేయడం, అవినీతికి పాల్పడటం వంటి చర్యలు చేస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తున్నప్పటికీ రాజకీయ ఒత్తిళ్లకు అవినీతి అధికారులపై చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు వెనుకాడుతున్నారనడానికి ఈ ఘటనే ఉదాహరణ.
రెవెన్యూలో అవినీతి భాగోతం
Published Fri, Aug 28 2015 1:12 AM | Last Updated on Sun, Sep 3 2017 8:14 AM
Advertisement