అవినీతికి రాచబాట | Corruption thoroughfare | Sakshi
Sakshi News home page

అవినీతికి రాచబాట

Published Mon, Sep 29 2014 2:08 AM | Last Updated on Sat, Sep 2 2017 2:04 PM

అవినీతికి రాచబాట

అవినీతికి రాచబాట

అనంతపురం మెడికల్ :
 రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతికి రాచబాట వేశారు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ విధానాన్ని అనుకూలంగా మార్చుకుని యాడికి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం(ఎస్‌ఆర్‌ఓ)లో అక్రమాలకు తెరలేపారు. అనంతపురం జిల్లా రిజిస్ట్రేషన్ (డీఆర్) పరిధిలోనివే కాకుండా హిందూపురం జిల్లా రిజిస్ట్రేషన్ (డీఆర్)  పరిధిలోని ఎస్‌ఆర్ కార్యాలయాలకు చెందిన డాక్యుమెంట్లను కూడా యాడికిలో రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. వేరే ఎస్‌ఆర్‌ఓలలో రిజిస్ట్రార్ కానివి, అభ్యంతరం ఉన్న వాటిని ఇక్కడ చేసినట్లు తెలిసింది. అంతే కాకుండా ఇతర ఎస్‌ఆర్‌లకు సంబంధించి అసైన్డ్ (08) భూములను కూడా రిజిస్ట్రేషన్ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఒక్క ఆగస్టు నెలలోనే ఇతర ఎస్‌ఆర్‌ఓలకు సంబంధించిన 123 డాక్యుమెంట్లు యాడికి ఎస్‌ఆర్‌ఓలో రిజిస్ట్రేషన్ అయ్యాయంటే పరిస్థితి ఏమిటనేది అర్థమవుతోంది. ఆగస్టు నాలుగో తేదీ ఒక్క రోజునే గుంతకల్లు ఎస్‌ఆర్‌ఓ సంబంధించి (1223 నుంచి 1248) 27 డాక్యుమెంట్లు, 16వ తేదీన (1353) ఒక డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ జరిగింది. తాడిపత్రి ఎస్‌ఆర్‌ఓకి సంబంధించి ఆగస్టు నెలలో వివిధ తేదీల్లో 41 డాక్యుమెంట్లు యాడికి ఎస్‌ఆర్‌ఓలో రిజిస్ట్రేషన్ అయ్యాయి. అనంతపురం రిజిస్ట్రేషన్ ఆఫీస్ (ఆర్‌ఓ)కు సంబంధించి 20 డాక్యుమెంట్లు, గుంతకల్లు ఎస్‌ఆర్‌ఓకి సంబంధించి 28 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ జరిగాయి. ఈ నెలలో కూడా యాడికి ఎస్‌ఆర్‌ఓలో ఇతర ఎస్‌ఆర్‌ఓలకు సంబంధించిన డాక్యుమెంట్లు భారీగా రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు తెలిసింది.
 హిందూపురం ఆర్‌ఓ పరిధిలోనివి కూడా... అనంతపురం జిల్లా రిజిస్ట్రేషన్ శాఖ పరిధిలోకి యాడికి ఎస్‌ఆర్‌ఓ వస్తుంది. దీని పరిధిలోని ఎస్‌ఆర్‌ఓలకు సంబంధించిన డాక్యుమెంట్లు అన్నీ సక్రమంగా ఉంటే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇక హిందూపురం జిల్లా రిజిస్ట్రేషన్ పరిధిలోని ఎస్‌ఆర్‌ఓలకు సంబంధించిన వాటిని యాడికిలో రిజిస్ట్రేషన్ చేయకూడదు. అయితే ఇక్కడ హిందూపురం ఆర్‌ఓ పరిధిలోని ఎస్‌ఆర్‌ఓకు సంబంధించిన డాక్యుమెంట్లు కూడా రిజిస్ట్రేషన్ జరిగింది. హిందూపురం జిల్లా రిజిస్ట్రేషన్ పరిధిలోని హిందూపురం ఆర్‌ఓకు సంబంధించి ఆగస్టు 16వ తేదీన (1355) ఒక డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్‌ర్ అయ్యింది. చిలమత్తూరు ఎస్‌ఆర్‌ఓకు సంబంధించి 7వ తే దీన (1271) ఒక డాక్యుమెంట్, 8న (1284) ఒక డాక్యుమెంట్, 20న (1372, 1374చ 1375) మూడు డాక్యుమెంట్లు, 22న (1402) ఒక డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ జరిగింది. చెన్నేకొత్తపల్లి ఎస్‌ఆర్‌ఓకి సంబంధించి 7న (1276)న ఒక డాక్యుమెంట్ రిజిష్టర్ అయ్యింది. పెనుకొండ ఎస్‌ఆర్‌ఓకి సంబంధించి 4వ తేదీన (1250, 1251) రెండు డాక్యుమెంట్లు, 9న (1300) ఒక డాక్యుమెంట్, 30న (1448) ఒక డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అయ్యాయి.
 అసైన్డ్ భూములు రిజిస్ట్రేషన్
 జిల్లాలో అసైన్డ్ (08) భూములను యాడికి ఎస్‌ఆర్‌ఓలో రిజిస్ట్రేషన్ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇతర ఎస్‌ఆర్‌ఓల పరిధిలోని 08 భూములకు ఎన్‌ఓసీ (నో అబ్జెక్షన్ సర్టిఫికెట్) లేకపోవడంతో ఆయా ఎస్‌ఆర్‌ఓలో రిజిస్ట్రేషన్ చేయలేదని తెలిసింది. అలాంటి వాటిని యాడికి ఎస్‌ఆర్‌ఓలో చేసినట్లు ఆ శాఖ సిబ్బంది నుంచే ఆరోపణలు వినవస్తున్నాయి.
 నా దృష్టికి వచ్చింది.. విచారణ చేస్తాము
 యాడికి ఎస్‌ఆర్‌ఓలో జిల్లాలోని ఇతర ఎస్‌ఆర్‌ఓల పరిధిలోని డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు నా దృష్టికి వచ్చింది. వివరాలు పంపించాలని ఇప్పటికే ఆదేశించారు. ఈ ఎస్‌ఆర్‌ఓలో జరిగిన రిజిస్ట్రేషన్లపై పూర్తి స్థాయిలో విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటాము.                            
 - కె.అబ్రహం, రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ


 

Advertisement
Advertisement