ఒంగోలు, న్యూస్‌లైన్: ‘అపరిచితుడు సినిమా చూసో....అన్నా హజారే..కేజ్రీవాల్‌లను టీవీలో చూసో చప్పట్లు కొడితే అవినీతిపోదని’ మెప్మా ఎండీ అనితా రామచంద్ర అన్నారు. ప్రతి ఒక్కరూ అవినీతికి దూరంగా ఉంటూ పేదవాడి దారిద్య్రాన్ని పారదోలేందుకు దృష్టిసారిస్తే అవినీతి దానంతటదే పోతుందని పేర్కొన్నారు. స్థానిక మెప్మా కార్యాలయంలో ఆదివారం సాయంత్రం మెప్మా ఇన్‌చార్జ్ పీడీ పద్మజ, ఒంగోలు నగర కమిషనర్ విజయలక్ష్మి, రాష్ట్ర స్పెషలిస్టు రాజశేఖరరెడ్డి, జిల్లా స్పెషలిస్టు టీ.హరిప్రసాద్‌రెడ్డి తదితరులతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సామాజిక పెన్షన్లలో సైతం చాలామంది సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు వినిపించినపుడు గుండె తరుక్కుపోతుందన్నారు. వృద్ధాప్యంలో వచ్చే రెండు వందల కోసం వారు పడే తపన సాధారణమైంది కాదని, అటువంటి వారిపట్ల దయ, ప్రేమతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.
పలువురు సీవో(కమ్యూనిటీ ఆర్గనైజర్లు)లు ఇంకా పొదుపు సంఘాల్లో ఉండడం సరైన విధానం కాదన్నారు. సీవోలకు ప్రస్తుతం *8 వేలు జీతం ఇస్తున్నందున వారు పొదుపు గ్రూపుల్లో ఉండడం వల్ల వాటిలో ఉండే పేద మహిళల అభివృద్ధికి ఆటంకంగా మారుతుందన్నారు. ఇప్పటి వరకు పొదుపు గ్రూపుల్లో ఉన్నవారు కొత్తగా ఎటువంటి రుణాలు గ్రూపుల ద్వారా తీసుకోవద్దని, ఎవరైనా ఇంకా తీసుకుంటుంటే మాత్రం వారిని ఉద్యోగం నుంచి తొలగించడంతోపాటు క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. ప్రస్తుతం ఒంగోలు కార్పొరేషన్, చీరాల, మార్కాపురం మున్సిపాల్టీలలో ఈ ఏడాది స్వయం సహాయక సంఘాలకు రుణాలు మంజూరు చేయించడంలో బాగా వెనుకబడి ఉన్నాయన్నారు.
ఈ నెలాఖరుకల్లా ఎట్టి పరిస్థితుల్లో రూ 6 కోట్ల రుణాలు పంపిణీ చేయాలని, అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. స్వయం సహాయక సంఘాలు తీసుకున్న మొత్తంలో అసలు ఎంతో నిర్థారించి అందులో వాయిదాను నిర్ణయించాలన్నారు. వాయిదాను మాత్రమే చెల్లించాలి తప్ప ఎట్టి పరిస్థితులలోనూ అధిక మొత్తం జమపడనీయకుండా మెప్మా సిబ్బంది చర్యలు తీసుకోవాలన్నారు. ఏ గ్రూపు అయినా అధిక మొత్తం వాయిదా కింద చెల్లిస్తే వారికి వడ్డీ లేని రుణం అందదన్నారు. తప్పనిసరిగా కచ్చితమైన ఇన్‌స్టాల్‌మెంట్ మాత్రమే చెల్లించేలా చర్యలు చేపట్టాలన్నారు. స్వయం సహాయక సంఘాలు చెల్లించాల్సిన వడ్డీని మెప్మానే నేరుగా బ్యాంకు అకౌంట్‌కు జమ చేస్తుందని గుర్తుంచుకోవాలన్నారు.
ఈ విషయంలో వెంటనే స్వయం సహాయక సంఘాలను అప్రమత్తం చేయాలని సూచించారు. కొత్తగా నగర పంచాయతీలుగా మారిన చీమకుర్తి, అద్దంకి, గిద్దలూరు, కనిగిరిలలోని సాఫ్ట్‌వేర్‌కు సంబంధించి పలు సమస్యలు ఉన్నట్లు తెలుస్తోందని అటువంటి వాటికి సంబంధించి వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు. లేని పక్షంలో సాంకేతిక సిబ్బందిపై కూడా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా మెప్మా ఎండీ అనితా రామచంద్ర పేర్కొన్నారు. సమావేశంలో సమైక్య సంఘాల అధ్యక్షులతో కూడా ఎండీ మాట్లాడారు.
చప్పట్లు కొడితే అవినీతి పోదు
Published Mon, Jan 6 2014 4:03 AM | Last Updated on Sat, Sep 2 2017 2:19 AM
Advertisement
Advertisement