సాక్షి, అమరావతి: ఈ ఏడాది దసరా పండగ వ్యాపారుల అంచనాలను చేరుకోలేకపోయింది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, దుస్తులు, బంగారం అమ్మకాలు అనుకున్నంతగా లేక వ్యాపారులు దిగాలు పడుతున్నారు. కార్లు, ద్విచక్ర వాహనాల అమ్మకాల్లో మాత్రం వృద్ధి నమోదు కావడం గమనార్హం. గత ఏడాదితో పోలిస్తే అమ్మకాలు సుమారు 30 శాతం వరకు తగ్గాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇంకా పండగ బోనస్ రాకపోవడం, ప్రీ జీఎస్‌టీ అమ్మకాలు ఇప్పుడు దసరాపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని సోని సెంటర్ ప్రతినిధి తెలిపారు. రైల్వే ఉద్యోగులకు బోనస్ ప్రకటించినప్పటికీ అది ఇంకా వారి ఖాతాల్లో జమ కాలేదన్నారు. అదే విధంగా జీఎస్‌టీ అమలుకు ముందు పన్ను రేట్లు పెరుగుతాయంటూ చాలా సంస్థలు ‘ప్రీ జీఎస్‌టీ సేల్’ పేరిట అమ్మకాలు చేయడం కూడా పండుగ అమ్మకాలు తగ్గడానికి కారణంగా చెబుతున్నారు. గతేడాదితో పోలిస్తే అమ్మకాలు తగ్గినా, ఇప్పుడిప్పుడే మార్కెట్ సెంటిమెంట్ పెరుగుతోందని వ్యాపారులు అంటున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలలు వ్యాపారం బాగా దెబ్బతినగా, రెండు నెలల నుంచి అమ్మకాలు పెరుగుతుండటంతో వ్యాపారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఆఫర్ల జోరు..
వినియోగదారులను ఆకర్షించడానికి రిటైల్ సంస్థలు భారీగా ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. మొత్తం మీద చూస్తే మార్కెట్ కొద్దిగా మందగమనంలో ఉన్నప్పటికీ తాము ప్రవేశ పెట్టిన స్ప్రాచ్ కార్డు ఆఫర్‌కు మంచి ఆదరణ లభిస్తోందని సోనో విజన్ ఎండి భాస్కరమూర్తి తెలిపారు. గతేడాది దసరా – దీపావళికి రూ.200 కోట్ల అమ్మకాలు జరిగాయని, ఈ ఏడాది 30 శాతం వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. జీఎస్‌టీ వల్ల ఎల్‌ఈడీ టీవీల ధరలు బాగా తగ్గితే, రిఫ్రిజిరేటర్ల ధరలు మాత్రం 1.5 శాతం వరకు పెరిగాయి. జీఎస్‌టీ తర్వాత లక్ష రూపాయల కంటే అధిక విలువ కలిగిన ఓఎల్‌ఈడీ టీవీల ధరలు 30 శాతం వరకు తగ్గగా, రూ.50 వేల నుంచి లక్ష రూపాయల లోపు టీవీల ధరలు 20 శాతం వరకు తగ్గాయి. 30 అంగుళాల కంటే పెద్ద టీవీలను కొనడానికే ప్రస్తుతం వినియోగదారులు ఆసక్తి చూపిస్తున్నట్లు సోనీ ప్రతినిధి తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరగడానికి తోడు జీఎస్‌టీలో పన్ను రేట్లు పెరగడం అమ్మకాలపై ప్రభావం చూపిందని జ్యూవెలరీ వర్తకులు పేర్కొంటున్నారు. గతేడాదితో పోలిస్తే అమ్మకాలు 20 నుంచి 30 శాతం వరకు తగ్గినట్లు వీరు పేర్కొన్నారు. తెలంగాణలో దసరాకు అమ్మకాలు బాగుంటాయని, ఇక్కడ సంక్రాంతికి డిమాండ్ ఉంటుందని.. అయినా గతేడాదితో పోలిస్తే అమ్మకాలు తగ్గినట్లు ప్రముఖ రిటైల్ సంస్థ ప్రతినిధి వివరించారు.
దూసుకుపోతున్న ఆటో మొబైల్
కొంత కాలంగా స్థిరంగా ఉన్న ఆటోమొబైల్ అమ్మకాలు ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నాయి. రెండు నెలల నుంచి ద్విచక్ర వాహనాలు, కార్ల అమ్మకాలు పెరుగుతున్నట్లు డీలర్లు పేర్కొంటున్నారు. ఈసారి దసరా–దీపావళికి రాష్ట్రం మొత్తం మీద సుమారు 3,500 కార్లను విక్రయించగలమని మారుతి డీలర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గతేడాది దసరా.. నెలలో 375 కార్లను విక్రయించగా ఈ ఏడాది 450 కార్లను విక్రయించినట్లు వరుణ్ మారుతి డీలరు పేర్కొన్నారు. జీఎస్‌టీ తర్వాత చిన్న కార్లు, దిచక్ర వాహనాల ధరలు తగ్గడం కలిసొచ్చిందంటున్నారు. రాష్ట్రంలో చిన్న కార్లకు డిమాండ్ అధికంగా ఉందని చెబుతున్నారు. మారుతిలో మొత్తం 13 మోడల్స్ ఉండగా అందులో ఒక్క ఎటికా తప్ప అన్ని కార్ల ధరలు తగ్గాయన్నారు. జీఎస్‌టీ తర్వాత మోడల్‌ను బట్టి కారు ధరలు రూ.15,000 నుంచి రూ.70,000 వరకు తగ్గగా, ఎటికా ధర మాత్రం రూ.1.30 లక్షలు పెరిగిందన్నారు. ద్విచక్ర వాహనాల్లో మోటార్ సైకిళ్ల కంటే స్కూటర్లకు అధిక డిమాండ్ ఉందని వివరించారు.