అభివృద్ధికి రాజకీయ బ్రేక్! | Development political break | Sakshi
Sakshi News home page

అభివృద్ధికి రాజకీయ బ్రేక్!

Published Thu, Sep 4 2014 2:38 AM | Last Updated on Mon, Sep 17 2018 4:52 PM

అభివృద్ధికి  రాజకీయ బ్రేక్! - Sakshi

అభివృద్ధికి రాజకీయ బ్రేక్!

 శ్రీకాకుళం సిటీ:అధికారంలో ఏ పార్టీ ఉన్నా గతంలో మంజూరైన అభివృద్ధి పనులను అడ్డుకున్న ఉదంతాలు జిల్లాలో ఇప్పటివరకు లేవు. ఈ దుస్సంప్రదాయానికి ప్రస్తుత అధికార పార్టీ నాయకులు తెర తీశారు. ఫలితంగా గత ప్రభుత్వ హయాంలో మంజూరైన సుమారు రూ.320 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు బ్రేక్ పడింది. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి ఉన్న ధర్మాన ప్రసాదరావు చొరవతో మంజూరైన ఈ పనులను పునఃసమీక్ష పేరుతో ప్రభుత్వం నిలిపివేసింది. ఈ పనులు పూర్తి అయితే ఆ ఘనత ధర్మానకే దక్కుతుంది. అదే అక్కసుతో జిల్లాకు చెందిన అధికార పార్టీ నేతలు ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి ఈ పుణ్యం కట్టుకున్నారు.
 
 తదుపరి ఆదేశాలు వచ్చే వరకు నిలిపివేత
 జిల్లాలో ఆర్‌అండ్‌బీ శాఖ తరఫున 2011-13 మధ్య కాలంలో సుమారు రూ. 320 కోట్ల విలువైన పనులు మంజూరయ్యాయి. మళ్లీ ఆదేశాలు వచ్చే వరకు వీటి పనులు నిలిపివేయాలని, కొన్ని పనుల స్థితిగతుల వివరాలను సమీక్ష కోసం పంపాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంజూరైన పనుల్లో కొన్ని టెండర్ ప్రక్రియ పూర్తి చేసుకోగా.. మరికొన్నింటి నిర్మాణం ప్రారంభం కావలసి ఉంది. కాగా జిల్లా కేంద్రంలో రూ. 21 కోట్లతో చేపట్టిన పొన్నాడ బ్రిడ్జి, రూ.12 కోట్లతో చేపట్టిన నాగావళి పాత వంతెన స్థానంలో కొత్త వంతెన నిర్మాణం, దత్త క్షేత్రం సమీపంలోని కొత్త బ్రిడ్జి రోడ్డు విస్తరణ పనులు ఇప్పటికే కొంత పూర్తి అయ్యాయి. అయితే ఈ పనుల సబ్‌లీజులు అధికార పార్టీ అనుచరులకు దక్కేలా ఒత్తిళ్లు వస్తున్నట్లు తెలుస్తోంది.
 ధర్మాన హయాంలో మంజూరై, ప్రస్తుతం నిలిచిపోయిన పనుల వివరాలు పరిశీలిస్తే..
 
   రూ.116 కోట్లతో కలెక్టరేట్ భవన సముదాయం.
   రూ. 30 కోట్లతో నువ్వలరేవు-మంచినీళ్లపేట బ్రిడ్జి
   రూ.14 కోట్లతో ఈదుపురం వద్ద బాహుదా నదిపై ఓవర్ బ్రిడ్జి
   రూ.40 కోట్లతో రాజాం-రణస్థలం రోడ్డు           విస్తరణ
   రూ.40 కోట్లతో అలికాం-బత్తిలి రోడ్డు విస్తరణ
   రూ. 40 కోట్లతో నారాయణపేట బ్రిడ్జి నిర్మాణం
   రూ. 40 కోట్లతో సరుబుజ్జిలి- కొమ్మనాపల్లి బ్రిడ్జి నిర్మాణం
 
 ధర్మానకు క్రెడిట్ దక్కుతుందనే అక్కసుతోనే...
 జిల్లాలో ఎన్నడూ లేని రీతిలో ధర్మాన హయాంలో మంజూరైన ఈ పనులపై రాజకీయ క్రీనీడలు అలుముకున్నాయి. ఆ క్రెడిట్ ధర్మానకు దక్కకుండా చేసేందుకు అధికార పార్టీ కీలక నేత ఒకరు పావులు కదిపారు. జిల్లాలో ఆర్ అండ్ బి ఆధ్వర్యంలో జరుగుతున్న పనులన్నీ నిలిచిపోయేలా ప్రభుత్వం ద్వారా ఉత్తర్వులు జారీ చేయించారు. సీఎం రివ్యూ పేరుతో ఈ పనులు తమ అనుచరులకే దక్కేలా తాజా ఆమోదాలు ఇప్పించాలన్నది ఆయన వ్యూహమని తెలిసింది.
 రివ్యూ అనంతర మే నిర్ణయం
 
 ఈ విషయంపై ఆర్‌అండ్‌బి ఎస్‌ఈ రామచంద్రను వివరణ కోరగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లాలో పలు అభివృద్ధి పనులపై నివేదికలు పంపించామని, వీటిపై రివ్యూ జరగనుందని తెలిపారు. టెండర్లు పూర్తి కాని పనులు, ఇంకా ప్రారంభం కాని పనులపై కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుందని స్పష్టం చేశారు. రివ్యూ అనంతరం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆయా పనులు గ్రౌండ్ అవుతాయని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement