టీడీపీలో బహిర్గతమైన వర్గ విభేదాలు
Published Tue, Dec 24 2013 3:48 AM | Last Updated on Mon, Sep 17 2018 4:52 PM
శ్రీకాకుళం, న్యూస్‌లైన్: టీడీపీలో మరో మారు వర్గ విభే దాలు బహిర్గతమయ్యాయి. ఒక వర్గం వారు మాట్లాడుతుండగా మరో వర్గం వారు అడ్డుతగలడం, కేకలు వేసుకోవడంతో శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లాస్థాయి సమావేశం దద్దరిల్లింది. స్థానిక బాపూజీ కళామందిర్‌లో పార్టీ జిల్లా అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి అధ్యక్షతన సోమవారం జిల్లాస్థాయి సమావేశం జరిగింది. రాష్ట్ర పరిశీలకునిగా వచ్చిన తూముల భాస్కరరావు మాట్లాడుతూ బూత్ కమిటీలను ఏర్పాటు చేసి ప్రతి బూత్‌కు ఇద్దరు ఇన్‌చార్జిలను నియమించాలని సూచించారు. ఓటరు నమోదులో శ్రద్ధ చూపాలని కోరారు. నాయకుల మధ్య మనస్పర్దలు ఉంటే నాలు గు గోడలు మధ్యనే తేల్చుకోవాలని హితవుపలికారు. ఉత్తరాంధ్ర జిల్లాలను ముగ్గురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు సర్వనాశనం చేశారని, అటువంటి వారిని దోషులుగా నిలబెట్టే బాధ్యత టీడీపీపై ఉందని కిల్లి కృపారాణి, బొత్స ఝాన్సీ, పురందరేశ్వరి, ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణలను ఉద్దేశించి పరోక్షంగా విమర్శించారు. ఈ సందర్భంలో కార్యకర్తలు కోండ్రు, శత్రుచర్లను ఎందుకు విడిచిపెట్టారని కేకలు వేశారు.
కార్యకర్తల మధ్య వాదనలు
అటు తరువాత పార్టీ పరిశీలకుడు కార్యకర్తలకు మాట్లాడాలని చెప్పగా, రాజాం మాజీ ఎంపీపీ చీడి లోకేశ్వరరావు మాట్లాడుతూ పార్టీలో నాయకత్వ లోపం ఉందన్నారు. రాజాం ఇన్‌చార్జిగా కావలి ప్రతిభాభారతి పనికిరాదంటూ విమర్శించారు. ఆమెకు మళ్లీ టిక్కెట్టు ఇస్తే పార్టీ సర్వనాశనం అవుతుందన్నారు. ఈ సందర్భంలో రాజాం తెలుగుయువత నాయకుడు జి.వెంకటరావు మాట్లాడుతూ పార్టీ పదవులు అనుభవించి అవి పూర్తయిన తరువాత విమర్శించడం ఏమిటని విమర్శిం చారు. దీంతో రాజాం నియోజకవర్గానికి చెందిన ఇరు వర్గాల నాయకుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదాలు జరిగాయి. అటు తరువాత సరుబుజ్జిలి జెడ్పీటీసీ మాజీ సభ్యుడు శివ్వాల సూర్యనారాయణ మాట్లాడుతూ పార్టీలో నాయకత్వలోపం ఉండడం నిజమేనన్నారు. జిల్లాలోని పార్టీ నాయకులు ఆలోచన లేకుండా పనిచేస్తున్నారని, ఓటరు నమోదుకు సోమవారం ఆఖరు తేదీగా ఆరోజున సమావేశం ఏర్పాటు చేసి తప్పక రావాలని ఆదేశించడాన్ని తప్పుబట్టారు. పాతపట్నం నియోజకవర్గానికి ఇప్పటి వరకూ ఇన్‌చార్జిని ప్రకటించకపోవడం జిల్లా నాయకత్వ లోపమా, పార్టీ అధ్యక్షుని నిర్లక్ష్యమా అని నిలదీశారు. కార్యకర్తలు ఒకరినొకరు విమర్శించుకుంటూ వాదులాడుకోవడంతో అచ్చెన్నాయుడు, శివాజీలు సర్దిచెప్పారు.
శ్రీకాకుళం నాయకుల ప్రతివిమర్శలు
శ్రీకాకుళం మాజీ ఎమ్మెల్యే గుండ అప్పలసూర్యనారాయణ మాట్లాడుతూ తను శ్రీకాకుళం నియోజకవర్గంలో జరిగిన అవినీతిని ఎండగట్టానని చెప్పారు. కొందరు ప్యాకేజీల కోసం ఆశపడి ఇతర పార్టీల వైపు చూస్తున్నారని అటువంటి వారు వెళ్లిపోయినా నష్టం లేదన్నారు. అవినీతి జరుగుతున్న సమయంలో మాట్లాడిన వారు ఇప్పుడు తమకు పదవులు కావాలని అడగడాన్ని ఆయన తప్పు పట్టారు. దీంతో గుండ పార్టీలోని ఆయనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతున్నారని గుర్తించిన ప్రత్యర్థి వర్గం తరఫున బాధ్యతను పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి.వి.రమణ తన భుజస్కంధాలపై వేసుకున్నట్లుగా ప్రతివిమర్శలు చేశా రు. జిల్లాలో ధర్మాన అవినీతిపై ఎదురొడ్డి పోరాడింది ఎర్రన్నాయుడు అని గుర్తు చేశారు.
యువత ముందుకు రావాలి
రాష్ర్టంలో అవినీతి రహిత రాజకీయాల కోసం యువత ముందుకు రావాలని కింజరాపు రామ్మోహన్‌నాయుడు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పాతపట్నం నాయకుడు కొబగాపు సుధాకర్, పాలకొండ నాయకుడు నిమ్మక జయకృష్ణ, ఇచ్ఛాపురం నాయకుడు బెందాళం అశోక్, నరసన్నపేట నాయకుడు బగ్గు రమణమూర్తిలు ప్రసంగించగా మొదలవలస రమేష్, కలిశెట్టి అప్పలనాయుడు, గొర్లె వెంకటరమణ, మాదారపు వెంకటేష్, చిట్టి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.
Advertisement