కళ్యాణదుర్గం, న్యూస్‌లైన్ : బుధవారం కళ్యాణదుర్గంలో తన ముగ్గురు పిల్లలపై డీజిల్ పోసి తల్లి కూడా నిప్పంటించుకుని ఆత్మహత్యకు యత్నించిన ఘటనకు కారణం వరకట్న వేధింపులే అని తెలుస్తోంది. ఈ ఘటనలో కుమారుడు, కుమార్తె మృతి చెందగా.. మరో కుమార్తె భయంతో పరిగెత్తి ప్రాణం కాపాడుకుంది.
తల్లి పరిస్థితి విషమంగా ఉంది. పట్టణంలోని వడ్డే కాలనీలో నివాసముంటున్న వడ్డే నాగరాజుకు కర్ణాటకలోని తుంకూరు జిల్లా కొరటిగెర గ్రామానికి చెందిన శోభతో పదేళ్ల క్రితం వివాహమైంది. వివాహ సమయంలో 30 తులాల బంగారు, రూ.10 లక్షల కట్నంగా ఇచ్చామని శోభ తల్లి కొల్లారమ్మ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. పిల్లలు హరిణి (6), ఐశ్వర్య (4), శ్రీనివాసులు (18 నెలలు) పుట్టాక అల్లుడు, అతని తల్లిదండ్రులు అదనపు కట్నం కోసం వేధించడం మొదలు పెట్టారని చెప్పింది. ఇదే విషయాన్ని తన కూతురు ఎన్నో సార్లు తనతో చెప్పుకుని ఏడ్చిందని వాపోయింది.
దీన్ని బట్టి చూస్తే తన కూతురు శోభను అదనపు కట్నం కోసం అత్తింటి వారే ఒంటిపై డీజిల్ చల్లి నిప్పంటించి చంపారని ఆమె ఆరోపించింది.
తన కుమార్తెతో పాటు మనవడు శ్రీనివాసులు, మనవరాలు హరిహణిని కూడా పొట్టన పెట్టుకున్నారని కన్నీటి పర్యంతమైంది. కాగా, శోభ పరిస్థితి విషమంగా ఉండటంతో పుట్టింటి వారు ఆమెను మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తీసుకెళ్లారు. అంతకు ముందు ఆస్పత్రిలో శోభ నుంచి జూనియర్ సివిల్ జడ్జి శైలజ వాంగ్మూలం సేకరించారు. వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త బి.తిప్పేస్వామి ఆస్పత్రికి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. శోభ తన పిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నం ఎందుకు చేసుకుందో తమకు తెలియడం లేదని, ప్రాణాలు తీసుకునేంత పరిస్థితి ఎందుకొచ్చిందో అర్థం కావడం లేదని శోభ అత్తింటి వారు ఆస్పత్రిలో రోదించారు.
కట్న జ్వాలే కాటేసిందా?
Published Thu, Dec 12 2013 3:24 AM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM
Advertisement
Advertisement