మేం అనుకున్నదే చేస్తాం! | eligible for Pensions Cancel on Members of the questions intolerance | Sakshi
Sakshi News home page

మేం అనుకున్నదే చేస్తాం!

Published Sat, Dec 27 2014 3:38 AM | Last Updated on Sat, Sep 2 2017 6:47 PM

మేం అనుకున్నదే చేస్తాం!

మేం అనుకున్నదే చేస్తాం!

* జెడ్పీ సాక్షిగా ప్రభుత్వ విప్ రవికుమార్ స్పష్టీకరణ
* అర్హుల పింఛన్ల రద్దుపై సభ్యుల ప్రశ్నలతో అసహనం
* రెచ్చిపోయి కేకలు వేసిన విప్
* వేదిక వద్దకు వెళ్లి నిలదీసిన వైఎస్‌ఆర్‌సీపీ సభ్యులు, ఎమ్మెల్యేలు
* అన్యాయం జరిగితే న్యాయం చేస్తామని సర్దిచెప్పిన మంత్రి
* పాడైన , రంగుమారిన ధాన్యం కొనుగోలుకూ చర్యలు

శ్రీకాకుళం: పింఛన్ల రద్దు వ్యవహారం జిల్లాపరిషత్ సర్వసభ్య సమావేశంలో వాగ్వాదాలకు, అరుపులకు దారి తీసింది. సభ్యుల ఆరోపణలకు సరిగ్గా సమాధానం చెప్పకపోగా ప్రభుత్వ విప్ కూన రవికుమార్ మాటలతో రెచ్చిపోవడంతో కొంత ఉద్రిక్తత ఏర్పడింది. మేం చేయాలనుకున్నదే చేస్తామన్న విప్ వ్యాఖ్యానించడంతో ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌సీపీ సభ్యులు వేదిక వద్దకు వచ్చి ఆయన్ను నిలదీశారు.

ఈ సందర్భంగా ఇరుపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మంత్రి అచ్చెన్నాయుడు జోక్యం చేసుకొని సర్దిచెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. శుక్రవారం జెడ్పీ సమావేశ మందిరంలో జరిగిన ఈ సమావేశంలో బూర్జ జెడ్పీటీసీ సభ్యుడు ఆనెపు రామకృష్ణ పింఛన్ల ప్రస్తావన తీసుకొచ్చారు. ఆమదాలవలస నియోజకవర్గంలో అర్హులైన వారికి పింఛన్లు రాకుండా ప్రభుత్వ విప్ కూన రవికుమార్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. పలువురు అర్హులకు పింఛన్ల జాబితాలో చోటు లేకపోవడాన్ని, టీడీపీ హయాం నుంచీ పింఛన్లు పొందిన వారిని ప్రస్తుతం తొలగించడాన్ని ఆధారాలతో సహా నివేదించారు.

దీనికి కొద్దిసేపు సజావుగానే సమాధానాలు చెప్పిన విప్ రవికుమార్ ఓ దశలో జెడ్పీటీసీని ఉద్దేశించి మీ వల్లే అలా జరిగిందని వ్యాఖ్యానించారు. దీంతో జెడ్పీటీసీ స్పందిస్తూ మీరే కక్ష సాధింపుతో ఇలా చేస్తున్నారని గట్టిగా చెప్పారు. దీనికి విప్ స్పందిస్తూ ‘మీరు కేకలు వేసినా ఫలితం ఉండదు.. మేము చేయాలనుకున్నదే చేస్తాం. మీరు టాంపరింగ్‌లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దీనికి జెడ్పీటీసీ రామకృష్ణ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అర్హుల పింఛన్లు తొలగించిన పలు ఉదంతాలను సభ దృష్టికి తీసుకురావడంతో విప్ రవికుమార్ మరింత రెచ్చిపోయారు.

దాంతో వైఎస్సార్ సీపీకి చెందిన జెడ్పీటీసీలతో పాటు శాసనసభ్యులు కలమట వెంకటరమణ, కంబాల జోగులు బూర్జ జెడ్పీటీసీకి బాసటగా నిలిచారు. సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఇలా సమాధానం చెప్పడం సరికాదన్నారు. వారంతా వేదిక వద్దకు వచ్చి గట్టిగా నిలదీయడంతో రవికుమార్ వారిపై కేకలు వేశారు. హెచ్చరిస్తున్న ధోరణిలో వేలు చూపుతూ సమాధానం చెప్పారు. అదే సమయంలో మంత్రి అచ్చెన్నాయుడు జోక్యం చేసుకొని ఎవరికైనా అన్యాయం జరిగితే తప్పక న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది.
 
ఆర్‌ఆండ్‌బీ తీరుపై అసంతృప్తి
అంతకు ముందు ఆర్‌అండ్‌బీ శాఖపై సమీక్షలో అన్ని పార్టీల సభ్యులు, శాసనసభ్యులు, విప్, ఉన్నతాధికారులు, జెడ్పీ చైర్‌పర్సన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎజెండాలో హుద్‌హుద్ తుపాను లెక్కలు లేకపోవడాన్ని తప్పుబట్టారు. 2012లో మంజూరైన గజాల ఖానా నిర్మాణం ఇప్పటికీ ప్రారంభం కాకపోవడాన్ని పాలకొండ జెడ్పీటీసీ సభ్యుడు సామంతుల దామోదర్ ప్రశ్నించారు. ఇటువంటివి ఎన్నో ఉన్నాయని ఆయన చెప్పగా పార్టీలకు అతీతంగా సభ్యులంతా ఆర్‌అండ్‌బీ అధికారుల తీరుపై విరుచుకుపడ్డారు. అధికారులు మండల సమావేశాలకు హాజరు కాకపోవడాన్ని కూడా పలువురు సభ్యులు తప్పు పట్టగా ఇక మీదట తప్పక హాజరు కావాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ ఆ శాఖ అధికారులను ఆదేశించారు.
 
గత ప్రశ్నలకు ఇప్పుడు సమాధానమా?
గత సమావేశంలో తాము అడిగిన ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం అందజేయడాన్ని పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ తప్పు పట్టారు. ఇప్పుడు సమాధానాలు ఇస్తే ఈ అంశాలపై ఎప్పుడు తాము మాట్లాడుతామని నిలదీశారు. ఇప్పటి వరకు ఏజెండాలోని అంశాలు ప్రస్తావనకు రాలేదని, అటువంటప్పుడు తమ సమస్యలను ఎలా తెలియజేస్తారని అడిగారు. త్వరలో మళ్లీ సమావేశం ఏర్పాటు చేయాలని, అవసరమైతే వరుసగా రెండు రోజులు నిర్వహించాలని కలమటతో పాటు రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు సూచించారు. ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని వాటన్నింటిపైనా చర్చించాల్సి ఉందని చెప్పారు. దీనికి మంత్రి స్పందిస్తూ సంక్రాంతి తరువాత సమావేశం ఏర్పాటు చేసుకోవచ్చని చెప్పారు.
 
బినామీ రుణాలపై చర్యలు
సొసైటీల్లో బినామీల పేరిట రుణాలు పొందిన వారిపై విచారణ జరిపి చట్టపరంగా చర్యలు చేపడతామని రాష్ట్ర కార్మిక, ఉపాధిశాఖా మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. పాతపట్నం, రాజాం ఎమ్మెల్యేలు కలమట వెంకటరమణ, కంబాల జోగులు మాట్లాడుతూ రుణమాఫీ వర్తింపులో అవకతవకలను ప్రశ్నించారు. దీనికి జిల్లా కలెక్టర్ స్పందిస్తూ ఆధార్ నెంబరు, బ్యాంకు అకౌంట్, రేషన్‌కార్డు సమర్పించిన అర్హులైన రైతులందరికీ రుణమాఫీ వర్తింపజేస్తామన్నారు.

జిల్లాలో 2.40 లక్షల మంది అర్హులైన రైతుల వివరాలను వ్యవసాయ శాఖ, బ్యాంకు అధికారులకు అందజేశామని చెప్పారు. ఆధార్ కార్డులు లేని 60వేల మంది రైతుల వివరాలను బ్యాంకులకు త్వరలో అందజేస్తామని తెలిపారు. సాంకేతిక కారణాలతో ఆధార్ కార్డులు మంజూరు కాని రైతులకు మంజూరుకు తహశీల్దార్లు కృషి చేయాలని అన్నారు.
 
పాడైన ధాన్యాన్ని కూడా కొంటాం:మంత్రి
ధాన్యం కొనుగోలు కేంద్రాలపై చర్చలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 115  కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, 17.20 హెక్టార్లలోని ధాన్యం కొనుగోలు చేశారని చెప్పారు. పాతపట్నం ఎమ్మెల్యే మాట్లాడుతూ 1100 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారని, మిగిలిన లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఏ విధంగా కొనుగోలు చేస్తారని ప్రశ్నించారు. దీనిపై మంత్రి మాట్లాడుతూ రంగుమారిన, పూర్తిగా పాడైన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పారు.

హుద్‌హుద్ తుపానులో నష్టపోయిన రైతుల నష్టపరిహారం జాబితాలను పంచాయతీల్లో అందుబాటులో ఉంచాలని పాలకొండ జెడ్పీటీసీ సామంతుల దామోదరరావు కోరారు. నందిగాం జెడ్పీటీసీ కురమాన బాలకృష్ణ మాట్లాడుతూ తమ మండలంలో 90 శాతం పంట నష్టం జరిగినా తుపాను నష్టం జాబితాలో చేర్చలేదని ఫిర్యాదు చేశారు. మంత్రి సమాధానం చెబుతూ ఆ మండలాన్ని సుడిదోమ మండలంగా పరిగణించామని, ఏ ఒక్క రైతు నష్టపోకుండా పరిహారాన్ని అందజేస్తామని చెప్పారు. విప్ రవికుమార్ మాట్లాడుతూ విత్తన తయారీ యూనిట్లపై యాక్షన్ ప్లాన్ తయారు చేసి పంపాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు.

పొలంలో కల్లాలను ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని ఉపాధిహామీ పనుల్లో చేర్చినట్లు చెప్పారు. ఈ సమావేశంలో ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు, జెడ్పీ చైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మి, జేసీ వివేక్‌యాదవ్, ఏజేసీ పి. రజనీకాంతారావు, జెడ్పీ సీఈవో వసంతరావు, ఎమ్మెల్సీలు పీరుకట్ల విశ్వప్రసాద్, గాదె శ్రీనివాసులు నాయుడు, పలాస, ఇచ్ఛాపురం, నరసన్నపేట ఎమ్మెల్యేలు గౌతు శ్యామసుందర శివాజీ, బెందాళం అశోక్, బగ్గు రమణమూర్తి, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, ఎమ్పీటీసీ సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
 
ఆర్‌అండ్‌బీలో జంగిల్ క్లియరెన్స్ స్కామ్:ఎమ్మెల్యే శివాజీ
శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లాలోని ఆర్‌అండ్‌బీ శాఖలో జంగిల్ క్లియరెన్స్ స్కామ్ జరుగుతోందని పలాస శాసనసభ్యుడు గౌతు శ్యామసుందర శివాజీ ఆరోపించారు. జెడ్పీ సర్వసభ్య సమావేశంలో ఆర్‌అండ్‌బీ శాఖపై సమీక్ష జరుగుతున్నప్పుడు జంగిల్ క్లియరెన్స్ నిధులు ఏం చేస్తున్నారని అధికారులను ప్రశ్నించారు.

దీనికి అధికారులు తటపటాయిస్తూ ఒక్కో కిలోమీటరుకు రూ. 12 వేలు జంగిల్ క్లియరెన్స్ కింద మంజూరవుతోందని, దీనిని వెచ్చించి మరమ్మతులు చేయిస్తున్నామని చెప్పారు. దీనికి సంతృప్తి చెందని శివాజీ మరమ్మతులకు నోచుకోని రోడ్ల నిధులు ఏమవుతున్నాయని అడిగారు. ఇవి పక్కదారి పడుతున్నాయి కనుకే స్కాం అనాల్సి వచ్చిందన్నారు. ఎన్ని రకాలుగా ప్రశ్నించినా అధికారులు సరైన సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు.
 
పాలకవర్గాలు లేక అధికారుల ఇష్టారాజ్యం: జెడ్పీ చైర్‌పర్సన్

స్థానిక సంస్థలకు మూడేళ్లుగా పాలకవర్గాలు లేకపోవడంతో అధికారులు ఇష్టారాజ్యం అయిందని జెడ్పీ చైర్మన్ చౌదరి ధనలక్ష్మి అన్నారు. జెడ్పీ సర్వసభ్య సమావేశంలో పలువురు సభ్యులు అజెండా తయారు చేయడాన్ని తప్పుపట్టారు. దీనిపై స్పందించిన చైర్‌పర్సన్ పాలకవర్గాలు లేకపోవడంతో అధికారులు, సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరించి తమ పనులను మరిచిపోయారన్నారు. వచ్చే సమావేశం నాటికి వీటిని సరిచేసుకోవాలని సిబ్బందికి సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement