సాక్షి ప్రతినిధి, విజయనగరం : బినామీ రుణాలు గొట్లాం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం( పీఎసీఎస్) కొంప ముంచాయి. ఇప్పుడా సొసైటీ ఉనికికే ముప్పు వాటిల్లనుంది. రిజిస్ట్రార్ ఆదేశాలు అమలైతే సొసైటీ గల్లా పెట్టి ఖాళీ కానుంది. భవిష్యత్‌లో వచ్చే నిధులు కూడా డీసీసీబీ ఖాతాకు వెళ్లిపోనున్నాయి. పెద్ద ఎత్తున అక్రమాలు జరగడంతో సొసైటీ నుంచి రూ.కోటీ 11లక్షల99వేల మేర రికవరీ చేయాలని రిజిస్ట్రార్ ఆదేశించారు. అదే జరిగితే సొసైటీ నిధులు డీసీసీబీకి జమఅవుతాయి. ఈ నేపథ్యంలో సొసైటీ పరిస్థితి అగమ్య గోచరం కానుంది.
బొండపల్లి మండలం గొట్లాం పీఏసీఎస్ ద్వారా 1,559 మందికి నిబంధనలకు విరుద్ధంగా రూ.కోటీ 3లక్షల 78వేల 803మేర రుణాలిచ్చేశారని గత ఏడాది నిర్వహించిన సెక్షన్ 53విచారణలో తేల్చారు. దాదాపు అన్నీ బినామీ రుణాలేనని నిర్ధారణకొచ్చారు. కాకపోతే, ఈ అక్రమాలకు అప్పట్లో పనిచేసి మృతి చెందిన సొసైటీ అధ్యక్షుడు, కార్యదర్శులను బాధ్యులగా చేస్తూ మిగతా వారంతా తప్పించుకున్నారు. ఆ పాపమంతా వారిదేనని విచారణాధికారులు కూడా తేల్చేశారు. ఈమేరకు విచారణ నివేదికను ఆరు నెలల క్రితం పైండింగ్స్ కోసం సహకార శాఖ రిజిస్ట్రార్‌కు పంపించారు. కాకపోతే, అప్పట్లో ఇచ్చిన నివేదికలో సొసైటీ సిబ్బంది, డెరైక్టర్ల విషయమై సీరియస్‌గా తీసుకోలేదన్న ఆరోపణలొచ్చాయి. వాస్తవానికి సొసైటీలో ఏ అక్రమాలు జరిగినా అందులో పర్యవేక్షక అధికారులు, పాలకవర్గం ప్రతినిధులుగా డెరైక్టర్లు కూడా బాధ్యత వహించాల్సి ఉంటోంది.
ఎవరికే రుణమిచ్చినా పరిశీలించాల్సిన బాధ్యత సూపర్‌వైజరీ అధికారులపై ఉండగా, ఎవరికెంత రుణం ఇచ్చారన్నదానిపై పాలకమండలి సభ్యులంతా తీర్మానం చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన అక్కడే అక్రమాలు జరిగినా సమిష్టి బాధ్యత వహించాల్సి ఉంటుంది. కానీ చనిపోయిన సొసైటీ అధ్యక్షుడు, కార్యదర్శిని బాధ్యుల్ని చేసి విచారణ అధికారులు చేతులు దులిపేసుకున్నారన్న ఆరోపణలొచ్చాయి. ఈ నేపథ్యంలో విచారణాధికారులిచ్చిన నివేదికపై తాజాగా రిజిస్ట్రార్ పైండింగ్స్ రాసి పంపించారు. చనిపోయిన సొసైటీ అధ్యక్ష, కార్యదర్శుల్ని బాధ్యుల్ని చేసేస్తే సరిపోదని, అప్పట్లో పనిచేసిన ఉద్యోగులు, పాలకవర్గ సభ్యుల్ని కూడా భాగస్వామ్యం చేసినట్టు సమాచారం. ఇందులో భాగంగా సొసైటీకి రుణ వితరణ కోసం ఇచ్చిన నిధులు డీసీసీబీవని, బినామీ రుణాలు, ఇతరత్రా అవకతవకల నేపథ్యంలో దుర్వినియోగమైన రూ.కోటీ 11లక్షల 99వేలును సదరు సొసైటీ నుంచి డీసీసీబీ రికవరీ చేసుకోవాలని సూచించినట్టు తెలిసింది.
అలాగే, అప్పట్లో పనిచేసిన ఉద్యోగులపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని, పాలకవర్గ ప్రతినిధులపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు సమాచారం. ప్రస్తుతం సొసైటీలో సుమారు రూ.10లక్షల మేర టర్నోవర్ అవుతోంది. దాదాపు రూ.కోటీ 11లక్షల99వేలు రికవరీ చేయాలంటే సొసైటీకి భవిష్యత్‌లో వచ్చే నిధుల్ని డీసీసీబీ జమ చేసుకోవల్సి వస్తుంది. ఈ లెక్కన సొసైటీ ఉనికికే ముప్పు వాటిల్లబోతోంది. ఇంత వేగంగా కోలుకునే అవకాశం ఉండదు. దాని పరిధిలో ఉన్న రైతులకు ఇక ఎటువంటి ప్రయోజనాలు అందే అవకాశం లేదు.
గొట్లాం పీఏసీఎస్‌కు రుణాఘాతం !
Published Sun, Aug 2 2015 1:25 AM | Last Updated on Sun, Sep 3 2017 6:35 AM
Advertisement
Advertisement