సరిహద్దు దాటితే ప్రవేశ పన్ను
* వాణిజ్య ఉపకరణాలపై చెక్‌పోస్టుల వద్ద 2 శాతం సీఎస్‌టీ
* ముసాయిదా బిల్లు సిద్ధం
సాక్షి, హైదరాబాద్: ఆదాయం పెంచుకోవడంలో భాగంగా సరిహద్దులు దాటి రాష్ట్రంలోకి తరలించే వాణిజ్య సరుకులు, ఉపకరణాలపై చెక్‌పోస్టుల వద్ద ప్రవేశ పన్నును పునరుద్ధరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రవేశపన్ను లేకుంటే సొంత రాష్ట్రంలో వ్యాపారులకు, ఖజానాకు నష్టం వాటిల్లుతుందని ప్రభుత్వం భావి స్తోంది. ప్రవేశపన్ను విధించకపోతే పొరుగు రాష్ట్రమైన తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వస్తువులు తరలిస్తే స్థానిక వ్యాపారులు నష్టపోతారని వాణిజ్య పన్నుల అధికారి ఒకరు వివరించారు. ఈ నేపథ్యంలో వస్తువుల రవాణాపై చెక్‌పోస్టుల వద్ద 2 శాతం మేర సీఎస్‌టీ విధించాలని నిర్ణయించింది. ఈమేరకు ముసాయిదా బిల్లును ప్రభుత్వం సిద్ధం చేసింది. ప్రస్తుతం ఇది అడ్వొకేట్ జనరల్ పరిశీలనలో ఉంది.
2 శాతం సీఎస్‌టీ వీటిపై..: తొలిదశలో 15 రకాల వస్తువులపై సీఎస్‌టీ విధించాలని వాణిజ్య పన్నుల శాఖ ప్రతిపాదించింది. సిమెంట్, ఐరన్ అండ్ స్టీల్, మార్బుల్స్, గ్రానైట్స్, సిరామిక్ శానిటరీ, అన్ని రకాల ఎలక్ట్రికల్ వస్తువులు, ప్లైవుడ్స్, ట్రాన్స్‌ఫార్మర్లు, జనరేటర్లు, మినరల్స్, డైస్ అండ్ కెమికల్స్, బల్క్ డ్రగ్స్, ఐరన్ ఓర్, లిఫ్ట్‌లు, అటోమొబైల్ విడిభాగాలు రెండు శాతం సీఎస్‌టీ జాబితాలో ఉన్నాయి.
19 చెక్‌పోస్టుల ఆధునీకరణ: రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న 11 చెక్‌పోస్టులతోపాటు విభజన తరువాత తెలంగాణ సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన 8 కొత్త చెక్‌పోస్టులను ఆధునీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే చెక్‌పోస్టులకు భూమి కొరత సమస్య ఎదురవుతోంది. ఒక్కో చెక్ పోస్టుకు రవాణా సామర్థ్యం ఆధారంగా రెండు ఎకరాల నుంచి 20 ఎకరాలు అవసరమని ప్రభుత్వం గుర్తించింది. ప్రతి వాహనాన్ని చెక్‌పోస్టుల్లో కెమేరాలో రికార్డు చేస్తారు.