కలాం మృతితో జిల్లాలో విషాదం
‘తూర్పు’న స్ఫూర్తి రగిల్చిన మహా శాస్త్రవేత్త
సైంటిస్టులుగా ఎదిగిన పలువురు యువకులు
అమలాపురం టౌన్ : శాస్త్ర సాంకేతిక రంగ పితామహుడుగా ఖ్యాతినొందిన మహా శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పాదముద్రలకు జిల్లా నోచుకోనప్పటికీ ఇక్కడ ఎందరో యువత, విద్యార్థులు ఆయన అడుగుజాడల్లో శాస్త్రరంగంలో ఉన్నతస్థానాలను అందుకున్నారు. కలాం తన పరిశోధనాస్ఫూర్తితో జిల్లాలో ఎందరో యువకులను ప్రభావితం చేశారు. ఆయన చెప్పిన సుభాషితాలు ఎందరో విద్యార్థులకు సరైన దారి చూపిన దివిటీలయ్యూయి.కలాం, జీవితం.. ఆయన పరిశోధన ప్రస్థానం పాఠ్య పుస్తకాల్లో లేకపోయినప్పటికీ జిల్లాలోని కళాశాలలు, పాఠశాలల్లో విద్యార్థులకు ఆయన అనుసరించిన మార్గాన్ని బోధించటం విశేషం.
అమలాపురం రూరల్ మండలం వన్నె చింతలపూడికి చెందిన పరమట రాధాకృష్ణ బెంగళూరులోని ఎల్.ఆర్.డి.ఓ.లో శాటిలైట్లకు సంబంధించిన పరిశోధనల్లో రాడార్ నిపుణుడుగా పనిచేస్తున్నారు. ఆయన కూడా తనకు కలాం ఎంతో స్ఫూర్తినిచ్చారని చెబుతున్నారు. అమలాపురానికి చెందిన మలిశెట్టి భీమేశ్వరరావు బెంగళూరు ఇస్రోలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. ఆయన ఓసారి కలాంను చూడటమే కాక మరో సందర్భంలో కలుసుకున్నారు. కలాంను కలుసుకోనక్కర లేదు.. కనీసం చూసినా మనలో పరిశోధన ప్రకంపనలు వస్తాయని భీమేశ్వరరావు కలాం పట్ల తనకున్న అత్యున్నత గౌరవాన్ని, ఆరాధనను వ్యక్తం చేశారు.
పి.గన్నవరం మండలం ఆదిమూలంవారిపాలెంకు చెందిన ఆదిమూలం సూర్యతేజ్ త్రివేండ్రంలో, అమలాపురం రూరల్ మండలం బండార్లంకకు చెందిన పడవల విజయగణేష్ బెంగళూరులో శాస్త్రవేత్తలుగా పని చేస్తున్నారు. వారిద్దరూ కలామే తమకు స్ఫూర్తి అన్నారు. ‘భారత జనాభాలో 30 శాతం మంది యువతీ యువకులు ఉన్నారు. వీరిలో ఉన్న విజ్ఞానాన్ని శాస్త్రసాంకేతిక రంగం వైపు మళ్లిస్తే దేశ పరిశోధన ప్రగతి ప్రపంచ దేశాలకు ఆదర్శం అవుతుందని’ కలామ్ ‘విజన్- 20’ పేరుతో రగిలించిన స్ఫూర్తిని జిల్లాలో ఎందరో అంది పుచ్చుకున్నారు. దేశంలో ప్రముఖ విశ్వ విద్యాలయాల్లో ఆయన చేసిన ప్రసంగాలు కూడా జిల్లా యువతపై చెరగని ముద్ర వేశాయి. ఆయన మృతి జిల్లావాసులను.. ముఖ్యంగా యువతను కలచి వేసింది. లోటును తలుచుకుంటూ జిల్లా ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు. చెమర్చిన కళ్లతో ఆయన స్మృతులను, స్ఫూర్తిని నెమరు వేసుకున్నారు.
అంతరిక్ష పరిశోధనల్లో చరిత్ర సృష్టించారు..
అబ్దుల్ కలాం దేశ అంతరిక్ష పరిశోధనల్లో చరిత్ర సృష్టించారు. ఆయన పరిశోధన మార్గం దేశంలోని ఎందరో శాస్త్రవేత్తలకు ఆదర్శప్రాయం. ఆయన లేని దేశాన్ని ఊహించుకోలేకపోతున్నాను. కలాం రచించిన ‘వింగ్స్ ఆఫ్ ఫైర్’ నాలాంటి యువ శాస్తవేత్తలకు మార్గదర్శకం. కర్ణాటక రాష్ట్రంలోని హాసన్‌లో గల మాస్టర్ కంట్రోలర్ యూనిట్‌కు ఆయన వచ్చినప్పుడు నేను తొలిసారిగా చూశాను. ఇటీవల మంగళయాన్ ప్రయోగం విజయవంతం అయినప్పుడు కలామ్‌ను కలుకుని మాట్లాడినప్పుడు నా జీవితం ధన్యమైందని ఆనందించాను.ఆయన మృతిని జీర్ణించుకోలేకపోతున్నాను.
- మలిశెట్టి భీమేశ్వరరావు, ఇస్రో శాస్త్రవేత్త,
బెంగళూరు (సొంతూరు అమలాపురం)
యువతకు దిశానిర్దేశకుడు
యువకులకు దిశానిర్దేశం చేయడంతో పాటు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో విద్యార్థులను ప్రోత్సహించాలని నిరంతరం తపించిన కలాం మరణం దేశానికి తీరనిలోటు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో జేఎన్‌టీయూకేలో జరిగే అంతర్జాతీయ ప్రపంచ ఆరోగ్య సదస్సుకు ఆయనను ఆహ్వానించాలనుకున్నాం. ఈలోపే ఆయన మృతి చెందడం దిగ్భ్రాంతికి గురిచేసింది.
- వెల్లంకి సాంబశివకుమార్, వైస్ చాన్సలర్, జేఎన్‌టీయూకే
సైన్సు చరిత్రలో మేరు పర్వతం..
సైన్సు చరిత్రలో ఒక మేరు పర్వతం అబ్దుల్ కలాం. దేశ ప్రగతికి తన పరిశోధనలతో దోహదపడడమే కాక రాష్ట్రపతిగా దేశకీర్తిని ప్రపంచానికి చాటిన మహా మేధావి కలాం. శాస్త్రీయ ధోరణిల పట్ల అసాధారణ స్ఫూర్తిని కలిగించిన ఆయనను ప్రజలు దేవునిగా కొలిచి ఆయన ఫోటోకు పూజలు చేస్తూ రుణం తీర్చుకోవాలి. కోనసీమ సైన్స్ పరిషత్ ద్వారా నిర్వహించిన 2,000 సైన్స్ మహాసభల్లో విద్యార్థులకు కలామ్ శాస్త్రీయ పరిశోధనా స్ఫూర్తినే ఆదర్శంగా చెప్పేవాడిని.
- సీవీ సర్వేశ్వరశర్మ, అధ్యక్షుడు, కోనసీమ సైన్స్ పరిషత్
దేశానికి తీరని లోటు
కలాం మృతి దేశానికి తీరని లోటు. పరిశోధనల్లో ఆయన దేశాన్ని కొత్త పుంతలు తొక్కించారు. యువ శాస్త్రవేత్తల్లో పరిశోధనా స్ఫూర్తిని రగి లించారు. రాష్ట్రపతిగా ప్రజాస్వామ్య పరిరక్షణలో ఆయన పోషించిన భూమిక పొరుగు దేశాలకు కూడా ఆదర్శమైంది. అలాంటి గొప్ప పరిశోధకుడిని, అత్యుత్తమ పౌరుడిని కోల్పోవటందురదృష్టం. - నిమ్మకాయల చినరాజప్ప, ఉప ముఖ్యమంత్రి
సజల నయనాలతో.. బరువెక్కిన హృదయాలతో...
Published Tue, Jul 28 2015 1:54 AM | Last Updated on Sun, Sep 3 2017 6:16 AM
Advertisement
Advertisement