ఇల్లు..గొల్లు | G-Plus-3 housing complex in the controversial area | Sakshi
Sakshi News home page

ఇల్లు..గొల్లు

Published Sat, Jun 24 2017 9:47 AM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

ఇల్లు..గొల్లు - Sakshi

ఇల్లు..గొల్లు

► వివాదాస్పద స్థలంలో జీ ప్లస్‌– 3 గృహ సముదాయానికి శంకుస్థాపన
► దీనిపై తలోమాట చెబుతున్న హౌసింగ్, రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులు
► లబ్ధిదారుల జాబితాను ప్రకటించని నగరపాలక సంస్థ


దేవుడు కరుణించినా పూజారి వరమివ్వలేదన్నట్లుగా ఉంది రాష్ట్ర ప్రభుత్వ తీరు. కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన కింద హౌస్‌ ఫర్‌ ఆల్‌ పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఒక్కో ఇంటికి రూ. 1.50 లక్షల రుణం ప్రకటించింది. ఇదే సమయంలో టీడీపీ నేతలు దరఖాస్తులంటూ హడావుడి చేయడంతో తమకు ఇల్లు సమకూరినట్టేనని ప్రతి పేద గుండె సంబరపడింది. అయితే ఈ సంబరం ఎక్కువ రోజులు నిలవలేదు. మూడేళ్లుగా ముచ్చట్లతోనే కాలం గడుపుతున్న ప్రభుత్వం తాజాగా ఇళ్ల నిర్మాణానికి ఓ వివాదాస్పద స్థలంలో భూమి పూజ చేసి లబ్ధిదారుల ఆకాంక్షలతో ఆటలాడుతోంది.         

సాక్షి, గుంటూరు: కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన పథకం కింద హౌస్‌ ఫర్‌ ఆల్‌ ద్వారా నగరంలో 11,800 గృహాలను మంజూరు చేసింది. ఇందు కోసం ప్రతి ఇంటికీ రూ. 1.50 లక్షల సబ్సిడీ అందించింది. పథకం ప్రవేశపెట్టి ఏడాది దాటుతున్నా ఇంత వరకు గుంటూరు నగరపాలక సంస్థ, ట్రిడ్‌కో అధికారులు లబ్ధిదారుల జాబితా తయారు చేయలేదు. కనీసం నగరపాలక సంస్థ నుంచి హౌస్‌ ఫర్‌ ఆల్‌ పథకంపై ఎటువంటి నోటిఫికేషన్‌ విడుదల చేయకుండా లబ్ధిదారుల ఎంపిక మొత్తం టీడీపీ నేతల చేతుల్లో పెట్టేశారు.

తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా హౌస్‌ ఫర్‌ ఆల్‌ పథకంలో జీ ప్లస్‌ 3 గృహ సముదాయాల నిర్మాణానికి గుంటూరు రూరల్‌ మండల పరిధిలోని అడవితక్కెళ్లపాడు గ్రామ శివారులో 47 ఎకరాల భూమిలో ఈ నెల 19న మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా ఉన్నతాధికారుల సమక్షంలో భూమి పూజ నిర్వహించారు. ఈ భూమిలో సగానికిపైగా కోర్టు వివాదంలో ఉందనే విషయం కూడా అధికారులు పట్టించుకోకపోవడం దారుణం. నిరుపేదలకు వివాదాస్పద భూమిలో ఇళ్ల నిర్మాణం ఏ విధంగా చేపడతారో వారికే తెలియాలి.

తెలుగు తమ్ముళ్లదే రాజ్యం
టీడీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటుతున్నా జిల్లాలో ఇంత వరకు ఒక్క ఇల్లు నిర్మించ లేదు. హౌస్‌ ఫర్‌ ఆల్‌ పథకానికి అర్హులు కావాలంటే సొంత స్థలం లేదా బీ ఫారం పట్టాలు ఉండాలన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ. 1.50 లక్షల సబ్సిడీకి తోడు రాష్ట్ర ప్రభుత్వం మరో రూ. 1.50 లక్షల సబ్సిడీ ఇస్తూ ట్రిడ్‌కో ద్వారా హౌస్‌ ఫర్‌ ఆల్‌ పథకంలో జీ ప్లస్‌ 3 గృహ సముదాయాన్ని నిర్మించేందుకు సిద్ధమైంది. దీని లబ్ధిదారుల ఎంపికను జీవో ప్రకారం ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్, కార్పొరేషన్‌ కమిషనర్‌లు చూడాలి. కానీ ఈ పెత్తనం కూడా తెలుగు తమ్ముళ్లే తీసుకొన్నారు.

వివాదాస్పద భూమిలో నిర్మాణాలట..!
47 ఎకరాల స్థలంలో జీ ప్లస్‌ 3 గృహ సముదాయాలు నిర్మించేందుకు వివాదాస్పద భూమిలో పూజ నిర్వహించారు. ఇళ్లు నిర్మించే స్థలానికి మార్కింగ్‌ వేసి అందులో డిటైల్‌ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్‌) తయారు చేయాల్సి ఉండగా, అవేమీ పట్టించుకోకుండా హడావుడిగా శంకుస్థాపన చేసేశారు. శంకుస్థాపనకు జనాలను తరలించేందుకు టీడీపీ నేతలు దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి మీకు ఇల్లు మంజూరైందని, శంకుస్థాపనకు హాజరు కావాలంటూ సెల్‌ఫోన్‌ మెసేజ్‌లు పంపారు. మరుసటి రోజే లబ్ధిదారుల ఎంపిక జరగలేదని తెలుసుకుని నిర్ఘాంతపోయారు.

మేళాను రద్దు చేసిన అధికారులు
తూర్పు నియోజకవర్గ పరిధిలో లబ్ధిదారుల నుంచి డిపాజిట్‌ సేకరణ కోసం గురువారం బీఆర్‌ స్టేడియంలో మేళా నిర్వహిస్తున్నట్లు నగరపాలక సంస్థ ప్రకటించింది. స్థల వివాదం కొలిక్కి రాకపోవడం, దీనిపై రెవెన్యూ అధికారులు స్పష్టత ఇవ్వకపోవడంతో మేళాను వాయిదా వేశారు. కనీసం ఎప్పుడు నిర్వహిస్తారో కనీసం తేదీ కూడా ప్రకటించలేదు. అయితే డివిజన్‌ స్థాయి టీడీపీ నేతలు మాత్రం లబ్ధిదారుల జాబితాలో ఉన్నారని, వెంటనే రూ. 25 వేలు డీడీలు తమకు అందించాలంటూ హడావుడి చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా నగరపాలక సంస్థ అధికారులు నోరు మెదపడం లేదు. కేవలం టీడీపీ మద్దతుదారులను మాత్రమే లబ్ధిదారులుగా ఎంపిక చేస్తున్నారు.

ఒక్కొక్కరిదీ ఒక్కో మాట
వివాదాస్పద భూమిపై ‘సాక్షి’ గుంటూరు తహసీల్దారు వెంకటేశ్వర్లును ఫోన్‌లో వివరణ కోరగా 23 ఎకరాలు మినహా మిగతా భూమి అంతా కోర్టు వివాదంలో ఉన్నట్లుగా తెలిసిందని, పూర్తి సమాచారం తన వద్ద లేదని చెప్పారు. నగరపాలక సంస్థ అధికారులు మాత్రం 4.8 ఎకరాల భూమి మాత్రమే కోర్టు వివాదంలో ఉందంటున్నారు. ఇలాంటి స్థలంలో ఇళ్ల నిర్మాణానికి నగరపాలక సంస్థ, రెవెన్యూ, హౌసింగ్‌ అధికారులు ఎలా అనుమతిచ్చారనేది ప్రశ్నార్థకం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement