అప్రమత్తతతోనే ప్రమాదాల నివారణ | Gas cylinder Tips... | Sakshi
Sakshi News home page

అప్రమత్తతతోనే ప్రమాదాల నివారణ

Apr 16 2016 3:18 AM | Updated on Sep 3 2017 10:00 PM

అప్రమత్తతతోనే ప్రమాదాల నివారణ

అప్రమత్తతతోనే ప్రమాదాల నివారణ

పట్టణాల నుంచి పల్లెల వరకు ప్రతి ఇంటా గ్యాస్ సిలిండర్ వినియోగం తప్పనిసరి అయ్యింది. సిలిండర్ వినియోగంలో మెలకువలు పాటించాల్సిన అవసరం ఉంది.

గ్యాస్ వినియోగంలో మెళకువలివీ..
రాయవరం :  పట్టణాల నుంచి పల్లెల వరకు ప్రతి ఇంటా గ్యాస్ సిలిండర్ వినియోగం తప్పనిసరి అయ్యింది. సిలిండర్ వినియోగంలో మెలకువలు పాటించాల్సిన అవసరం ఉంది.
 
ఇలా వేరు చేయాలి
గ్యాస్ సిలిండర్ పొయ్యికి అమర్చే ముందు ఇంట్లో ఏదేని మంటలు వెలుగుతున్న కొవ్వొత్తి, నిప్పులను ఆర్పేయాలి. బర్నల్ మీదున్న అన్ని రంధ్రాలను మూసివేసేలా ఏదైనా పళ్లెం లాంటిది పెట్టాలి.
 
రెగ్యులేటర్‌కు ఉన్న స్విచ్ నాబ్‌ను ఆన్ స్థానం నుంచి ఆఫ్ స్థానంలోకి తిప్పుకోవాలి. రెగ్యులేటర్‌ను గట్టిగా పట్టుకుని కింది వైపున ఉన్న నల్లటి బుష్‌ను పైకిలాగి రెగ్యులేటర్‌ను నెమ్మదిగా కదుపుతూ పైకి ఎత్తాలి. దీంతో గ్యాస్ సిలిండర్‌ను వేరు చేసినట్టవుతోంది. గ్యాస్ సిలిండర్ వాల్వుపైన సేఫ్టీ క్యాప్‌ను పెట్టి క్లిక్‌మనే శబ్ధం వస్తే అది సరిగ్గా అమర్చినట్టు భావించాలి.

ఇలా అమర్చాలి
సిలిండర్‌కున్న సేఫ్టీ క్యాప్‌ను దానికున్న దారాన్ని లాగి తొలగించాలి. రెగ్యులేటర్‌కు ఉన్న స్విచ్ నాబ్‌ను ఆఫ్ స్థానంలో పెట్టి, కింద ఉన్న నల్లని ప్లాస్టిక్ బుష్‌ను పైకిలాగి వాయు సిలిండర్ వాల్వు మీద నిలువుగా పెట్టి కిందకు నొక్కాలి. క్లిక్‌మనే శబ్ధం వస్తేనే సరిగ్గా అమరినట్లు. గ్యాస్ ఆన్ చేసి వెంటనే స్టౌవ్ వెలిగించకుండా కాసేపాగి గ్యాస్ వాసన చూసి లీక్ కాలేదని నిర్ధారించుకోవాలి. ఆ తర్వాత అగ్గిపుల్లను తీసుకుని బర్నల్ దగ్గర పెట్టుకుని గ్యాస్ ఆన్ చేసి వెలిగించుకోవాలి.
 
జాగ్రత్తలు పాటించాలి..
వంట చేస్తున్న సమయంలో నైలాన్ దుస్తులు ధరించరాదు. వంట పూర్తయ్యేదాక వంటింట్లోనే ఉండాలి. వంట గదిలో కర్టెన్లు వాడకూడదు. వంట సమయంలో కిటికీలను కచ్చితంగా తెరిచే వంట చేసుకోవాలి. గ్యాస్ స్టౌకు దగ్గరలో ఎలక్ట్రిక్ ఓవెన్, కిరోసిన్ స్టౌలాంటివి పెట్టకూడదు. రబ్బర్ ట్యూబ్ మాసిపోతుందని దానిపైన ఎలాంటి కవర్ వేయరాదు. స్టౌ వెలిగించే ముందు వంటగదిని గమనించాలి.

స్టౌవ్‌కు స్విచ్‌లు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అనేది చూసుకోవాలి. పనిచేయకుంటే గ్యాస్ ఆన్‌లో పెట్టి మరమ్మతులు చేయరాదు. నిపుణనుడైన మెకానిక్ దగ్గరకు తీసుకెళ్లి మరమ్మతు చేయించుకోవాలి. వంట పని అయిపోగానే స్టౌకు ఉన్న, సిలిండర్‌కు ఉన్న స్విచ్‌లు ఆఫ్ చేయాలి. సురక్షితమైన సురక్ష ట్యూబ్‌ను మాత్రమే వాడాలి. సురక్ష ట్యూబును కూడా రెండేళ్లకు ఒక సారి మారిస్తే మంచిది.
 
ప్రమాదం సంభవించకుండా..
సిలిండర్ మీద రాసి ఉన్న కాలపరిమితిని గమనించాలి. సదరు తేదీ దాటితే సంబంధిత డీలర్‌కు తెలియజేయాలి. సిలిండర్‌ను నిటారుగా, స్టౌకు కింద భాగాన ఉండేటట్టు చూసుకోవాలి. సిలిండర్‌ను స్టౌ కంటే ఎత్తులో ఉంచరాదు. స్టౌకు కిందనే కదాని సిలిండర్‌ను పడుకోబెట్టరాదు. సిలిండర్‌ను గాలి తగిలే చోట పెట్టాలి. అల్మరాలో పెట్టి డోర్లు వేయరాదు.

ఒకటి కంటే మించి స్టౌవ్‌లకు వినియోగించాలనుకుంటే శాస్త్రీయ విధానాన్ని పాటించాలి. అలా కాదని ‘టీ’ ఆకారంలో ఉండే పరికరాన్ని ఉపయోగించి దానికి పైపులు తొడగరా దు. గ్యాస్ బాయ్ తెచ్చిన సిలిండర్‌ను అతడితోనే రెగ్యులేటర్ పట్టి సరిచూసుకోవాలి. కొత్తగా ఇల్లు నిర్మించుకునే వారు వంట గదికి నేలకు అడుగు ఎత్తులో చిన్నపాటి కిటికి పెట్టించుకోవడం మంచిది.

ఆదాలో చిట్కాలు ..
వంట చేసేందుకు ఉపక్రమించే ముందు అన్నం, కూరలకు అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాతనే స్టౌ వెలిగించాలి. వంట పదార్థానికి తగినన్ని మాత్రమే వాడుకోవాలి. సాధ్యమైనంత వరకు ప్రెజర్ కుక్కర్ వాడకం చాలా ఉత్తమం. ఫ్రిజ్‌లో ఉండే ప్రెజర్ కుక్కర్ వాడకం చాలా ఉత్తమం. ఫ్రిజ్‌లో ఉండే పదార్థాలతో పంట చేయాలనుకున్నప్పుడు ముందుగానే వాటిని బయటకు తీసి, బయటి వాతావరణానికి అనువుగా వచ్చిన తర్వాత వాటిని స్టౌ మీద పెట్టుకోవాలి. గుండుగా ఉన్న గిన్నెల వాడకం బాగుంటుంది. గిన్నెలకు కింద రాగి కలిగిన వాటిని వాడితే మరీ మంచిది. మంట నీలం రంగులో రావాలి. ఎర్రగా వచ్చిందంటే స్టౌ సరిగ్గా లేదని గుర్తించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement