కర్నూలు(అగ్రికల్చర్):
కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వం 2013 మే నెలలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బంగారు తల్లి పథకాన్ని తెలుగుదేశం ప్రభుత్వం దాదాపుగా పక్కనబెట్టింది. బంగారుతల్లి పథకానికి మా ఇంటి మహాలక్ష్మి అనే పేరును జోడించినా అమలులో మాత్రం నిర్లక్ష్యం చూపుతోంది. 2013 మే నెల ఒకటి నుంచి ఈ పథకం అమలులోకి వచ్చింది. ఆసుపత్రిలో కాన్పు అయితే ప్రోత్సాహకంగా రూ.2500 తల్లి ఖాతాలో జమచేస్తారు.
మొదటి ఏడాది వ్యాధి నిరోధక టీకాలన్నింటినీ సక్రమంగా వేయిస్తే రెండవ ఏడాది ప్రోత్సాహకంగా రూ.1000 జమ కావాల్సి ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరి నెల వరకు తల్లుల ఖాతాలకు రూ.2500 ప్రకారం జమ అవుతూ వచ్చాయి. సాధారణ ఎన్నికల కోడ్ రావడంతో మార్చి నుండి జమలు నిలిచిపోయాయి. 2014 మే నెల 1వ తేదీతో సంవత్సరం గడచిపోయినా ఇంతవరకు ఒక్కరికి కూడా రెండవ సంవత్సరంలో జమ కావాల్సిన నగదు జమకాలేదు.
మొత్తంగా చూస్తే నవంబర్ 1వ తేదీ వరకు బంగారు తల్లి పథకం కింద 18371 మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వీరిలో 6781 మందికి రూ.2500 జమ అయింది. ఇంకా 11590 మందికి ఈ మొత్తం జమ కావాల్సి ఉంది. అలాగే సర్టిఫికెట్లు వచ్చింది మాత్రం 3200 మందికే. సర్టిఫికెట్ వస్తేనే బంగారుతల్లి పథకం కింద నమోదు అయినట్లుగా నిర్ధారణ అవుతుంది.
అరుునా ప్రభుత్వం పట్టించుకోలేదు. పలువురు సర్టిఫికెట్ల కోసం తిరుగుతున్నా అధికారులు పెద్దగా స్పందించడంలేదు. గత ప్రభుత్వం చేపట్టిన దానిని తామెందుకు ముందుకు తీసుకెళ్లాలని పాలకులు భావిస్తున్నట్లు సమాచారం.
మొదటి స్థానంలో బేతంచెర్ల
బంగారుతల్లి పథకం కింద రిజిస్ట్రేషన్‌లలో బేతంచెర్ల మండలం జిల్లా మొదటి స్థానంలో ఉంది. ఈ మండలంలో కేవలం 138 మందికి రూ.2500 జమ అయ్యాయి. పత్తికొండ మండలంలో 557 రిజిస్ట్రేషన్‌లు అయి రెండవ స్థానంలో ఉన్నా కేవలం 92 మందికి మాత్రమే కాన్పు ప్రోత్సాహకాలు జమ అయ్యాయి. ప్యాపిలి, ఆస్పరి, ఆదోని, గోనెగండ్ల మండలాల్లో కూడా రిజిస్ట్రేషన్లు ఎక్కువగా ఉన్నాయి.
మొదటి రెండు కాన్పుల వరకు బంగారుతల్లి పథకం కింద నమోదయ్యే అవకాశం ఉండడంతో ఇటీవల వరకు ఆడ పిల్లలు కలిగిన దంపతులు ఈ పథకం కింద రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ఆసక్తి చూపేవారు. తెలుగుదేశం ప్రభుత్వం ఈ పథకాన్ని పట్టించుకోకపోవడంతో ఇటీవలి కాలంలో రిజిస్ట్రేషన్లు తగ్గినట్లు తెలుస్తోంది.
డిగ్రీ వరకు చదువులో రాణిస్తే వివాహ సమయానికి రూ.2.16 లక్షలు సంబంధిత కుటుంబానికి చేరుతాయి. బంగారుతల్లి ఉద్దేశం మంచిదే అయినా ప్రభుత్వం దీని అమలుపై చొరవ తీసుకోకపోవడం వల్ల వేలాది మంది నిరుత్సాహానికి గురవుతున్నారు. బంగారుతల్లి పథకాన్ని యథావిధిగా అమలు చేయాలని కోరుతున్నారు.
‘బంగారు తల్లి’ కంటతడి
Published Thu, Nov 6 2014 3:07 AM | Last Updated on Sat, Sep 2 2017 3:55 PM
Advertisement
Advertisement