మృతులకు పరిహారంపై హైడ్రామా | government Hospital, strikes at the mortuary | Sakshi
Sakshi News home page

మృతులకు పరిహారంపై హైడ్రామా

Published Mon, May 16 2016 2:29 AM | Last Updated on Mon, Sep 4 2017 12:10 AM

మృతులకు పరిహారంపై హైడ్రామా

మృతులకు పరిహారంపై హైడ్రామా

మట్టిపెళ్ళల మృతులకు న్యాయం చేయాలని కోరిన అఖిలపక్షం
►  ప్రభుత్వ ఆసుపత్రి, మార్చురీ వద్ద ధర్నాలు
బాధితులకు అండగా నిలిచిన వైఎస్సార్ సీపీ నేతలు
మృతుల కుటుంబాలకు రూ.50వేల చొప్పున సాయం
బాధిత కుటుంబాలకు రూ.20 లక్షలు...పక్కా ఇళ్లు మంజూరుచేయాలని డిమాండ్


గుంటూరు ప్రభుత్వాస్పత్రి వద్ద బాధితులను ఓదార్చుతున్న వైఎస్సార్‌సీపీ నేతలు బొత్స, మర్రి, లేళ్ల, రావి, సుచరిత, కావటి తదితరులు
 

న్యాయం కోసం ఎలుగెత్తారు.. అన్యాయంపై తిరగబడ్డారు. మట్టిపెళ్లల మృతులకు నష్టపరిహారం కోసం భీష్మించారు.
బిల్డర్ నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. ప్రధాన నిందితుడి అరెస్టుకు పట్టుబట్టారు. సజీవ సమాధి అయిన ఏడుగురి కుటుంబాల కోసం అఖిలపక్షంగా ఏర్పడిన వైఎస్సార్ సీపీ, కాంగ్రెస్, వామపక్షాలు, ప్రజాసంఘాలు ఆదివారం నిర్వహించిన ఆందోళనలతో గుంటూరు నగరం అట్టుడికింది.
 

 
అరండల్‌పేట (గుంటూరు) : గుంటూరు లక్ష్మీపురంలో చుక్కపల్లి రమేష్‌కు చెందిన వాణిజ్య భవన నిర్మాణంలో శనివారం రాత్రి  మట్టిపెళ్ళలు విరిగి పడిన ఘటనలో ఏడుగురు మృతిచెందారు. ఒకరు తీవ్ర గాయాలపాలై ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో ఆదివారం నగరంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బాధిత కుటుంబాలకు తక్షణ పరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ  అఖిలపక్ష నాయకులు, బాధిత కుటుంబాల సభ్యులు, వివిధ ప్రజాసంఘాల నాయకులు ఉదయం 8 గంటల నుంచి ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి(జీజీహెచ్) మార్చురీ ఎదుట ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు.

మరో వైపు జీజీహెచ్ వద్ద ఆందోళన చేపట్టిన బాధిత కుటుంబాలకు వైఎస్సార్‌సీపీ సీనియర్ నేతలు అండగా నిలిచారు.  సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే సుచరిత, జిల్లా అధ్యక్షులు మర్రి రాజశేఖర్, నగర అధ్యక్షులు లేళ్ల అప్పిరెడ్డి, జిల్లా యువజన విభాగం అధ్యక్షులు కావటి మనోహర్‌నాయుడు, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణ, చిన్నపరెడ్డి, సాయిబాబు, పానుగంటి చైతన్య తదితర నాయకులు బాధిత కుటుంబాలను పరామర్శించారు.  బాధితులతో మాట్లాడుతున్న సమయంలో వారి కష్టాలను విన్న సుచరిత కంటతడిపెట్టారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 50వేల చొప్పున సాయం అందిస్తామని  బొత్స ప్రకటించారు.

అలాగే పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి త్వరలోనే బాధిత కుటుంబాలను పరామర్శిస్తారని తెలిపారు. నిర్మాణ పనుల్లో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే ప్రమాదం సంభవించిందన్నారు. ఇందుకు కారణమైన బిల్డర్, ఇతరులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే బిల్డర్‌పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి, బాధిత కుటుంబాలను ఆదుకున్నప్పుడే న్యాయం జరుగుతుందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు మర్రి రాజశేఖర్ డిమాండ్ చేశారు.

నష్టపరిహారంపై హైడ్రామా ...
మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించే విషయంలో హైడ్రామా చోటుచేసుకుంది. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల నష్టపరిహారం, ఐదు ఎకరాల భూమి, బిల్డర్ చుక్కపల్లి రమేష్‌పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు, మృతుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని  బాధిత కుటుంబ సభ్యులు, అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. దీనిపై జీజీహెచ్ ఎదుట రోడ్డుపై సుమారు ఏడు గంటల పాటు  ఆందోళన నిర్వహించారు. ఈ సమయంలో  జిల్లా జాయింట్ కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, అర్బన్ జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠత్రిపాఠి పెద్ద ఎత్తున డీఎస్పీలు, సీఐలు అక్కడకు చేరుకున్నారు. 

పలు దఫాలుగా అధికారులతో అఖిలపక్ష నాయకులు చర్చలు జరిపినా కొలిక్కి రాలేదు. బాధితులకు, అధికారులకు మధ్యవర్తిగా వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు వ్యవహరించారు. నష్టపరిహారం ప్రకటించడంలో హైడ్రామా నడిపారు. మధ్యాహ్నాం మూడు గంటలకు  జేసీ శ్రీధర్ నష్టపరిహారం వివరాలను వెల్లడించారు. వీటిలో మృతుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వం నుంచి రూ. 5 లక్షలు, బిల్డర్ నుంచి రూ. 15 లక్షలు మొత్తం రూ. 20 లక్షల పరిహారం,  గొట్టిపాడులో ఎస్సీలందరికి రూరల్   హౌసింగ్ స్కీమ్ కింద పక్కా ఇళ్లు కట్టించేందుకు అంగీకరించారు. మృతుల కుటుంబాల్లోని పిల్లలను ప్రభుత్వ హాస్టళ్లలో చేర్పించే విషయంలోను స్పష్టమైన హామీ ఇచ్చారు. అయితే బిల్డర్‌పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదుతో పాటు ప్రభుత్వ ఉద్యోగంపై హామీ ఇవ్వలేదు. ఇదే సమయంలో బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం హామీని లిఖితపూర్వకంగా ఇవ్వాలని కోరితే ఆయన స్పందించలేదు.


బాధ్యులపై పోలీసులకు ఫిర్యాదు
భవన నిర్మాణ పనుల్లో ఏడుగురు కూలీలు మృతి చెందిన ఘటనపై నగర కమిషనర్ ఎస్. నాగలక్ష్మి స్పందించారు. బిల్డర్ చుక్కపల్లి రమేష్, లెసైన్స్‌డ్ ఇంజినీరు హరిబాబు, స్ట్రక్చరల్ ఇంజినీరు వీఏ రెడ్డి, ఫోనెక్స్ సంస్థ నిర్వాహకులపై కేసులు నమోదు చేయాల్సిందిగా పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అలాగే హరిబాబు, వీఏ రెడ్డి, చుక్కపల్లి రమేష్‌ల లెసైన్సులను రద్దుచేశారు. బిల్డింగ్ ఇన్‌స్పెక్టరు సువర్ణకుమార్‌ను సస్పెండ్ చేయడంతో పాటు డీసీపీ సత్యనారాయణ, సీపీ ధనుజంయరెడ్డిలకు మెమో జారీచేశారు.


పరారీలో ప్రధాన నిందితుడు రమేష్,
పోలీసుల అదుపులో ముగ్గురు
ఏడుగురు కార్మికుల మృతికి బాధ్యులుగా బావిస్తున్న భవన బిల్డర్, ప్రధాన నిందితుడు చుక్కపల్లి రమేష్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆయన ఓ ప్రజాప్రతినిధి అండతో హైదరాబాద్‌లో ఉన్నట్లు సమాచారం. అలాగే సైట్ సూపర్‌వైజర్ సాంబశివరావు, మేస్త్రీ రాము, కాంట్రాక్టరు వినోద్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement