
జీశాట్-14 తొలివిడత కక్ష్య పొడిగింపు విజయవంతం
సూళ్లూరుపేట, న్యూస్‌లైన్: జీశాట్-14 కమ్యూనికేషన్ల ఉపగ్రహం తొలివిడత కక్ష్య పొడిగింపును భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సోమవారం విజయవంతంగా నిర్వహించింది. దేశంలోనే తొలిసారిగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన జీఎస్‌ఎల్‌వీ- డీ5 రాకెట్ ద్వారా ప్రయోగించిన జీశాట్-14 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టే దిశగా బెంగళూరులోని మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ సెంటర్ (ఉపగ్రహా నియంత్రణ కేంద్రం) శాస్త్రవేత్తలు ఈ ప్రక్రియను చేపట్టారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి జీఎస్‌ఎల్‌వీ-డీ5 ప్రయోగం విజయవంతమైన సంగతి తెలిసిందే. ఈ రాకెట్ నిర్ణీత దిశలో ప్రయాణించింది.
తొలి దశలో సెకనుకు 4.5 కి.మీ వేగంతో, రెండో దశలో సెకనుకు 4.9 కి.మీ వేగంతో ప్రయాణించిన రాకెట్, క్రయోజెనిక్ దశలో సెకనుకు 9.78 కి.మీ వేగాన్ని పుంజుకుని జీశాట్-14 ఉపగ్రహాన్ని 179 కి.మీ పెరూజీ (భూమికి సమీపంగా), 35,960 కి.మీ. అపోజీ (భూమికి దూరంగా) భూస్థిర కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. తర్వాత దీనిని బెంగళూరులోని ఉపగ్రహాల నియంత్రణ కేంద్రంలోని శాస్త్రవేత్తలు తమ అధీనంలోకి తీసుకున్నారు. వారు సోమవారం ఉదయం 7.58 గంటలకు ఉపగ్రహంలోని అపోజీ మోటార్‌ను 3,134 సెకన్ల పాటు మండించి, ఉపగ్రహాన్ని 8,966 కిలోమీటర్ల పెరూజీ, 35,744 కిలోమీటర్ల అపోజీలో ప్రవేశపెట్టారు.