భారం తప్పదు !
ఈ ఏడాది భారీగా పెరగనున్న విద్యుత్ చార్జీలు
ముగిసిన ‘ఏపీఈఆర్‌సీ’ బహిరంగ విచారణ
{పభుత్వ వైఖరి తీసుకున్న తర్వాత టారిఫ్‌పై నిర్ణయం
‘ఈపీడీసీఎల్’ ప్రతిపాదనలపై సానుకూలత
వాపపక్షాల నుంచి మినహా వెల్లడికాని వ్యతిరేకత
విశాఖపట్నం : వినియోగదారులపై విద్యుత్ చార్జీల భారం తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి. 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఈపీడీసీఎల్) ప్రతిపాదించిన చార్జీల పెంపు టారిఫ్‌పై చివరి బహిరంగ విచారణ బుధవారం హైదరాబాద్‌లోని ఏపీఈఆర్‌సీ కార్యాలయంలో జరిగింది. విశాఖ, కాకినాడ, హైదరాబాద్ సమావేశాల్లో విద్యుత్ చార్జీలు పెంచవద్దని, ప్రత్యామ్నాయ మార్గాల్లో ఆదాయం సమకూర్చుకోవాలని కొందరు చెప్పగా, 100 యూనిట్ల పైన చార్జీలు పెంచినా అభ్యంతరం లేదని కొందరు స్పష్టం చేశారు. చార్జీల పెంపుపై కాకుండా సంస్థాగత మార్పులపైనే ఎక్కువ అభిప్రాయాలు వెల్లడయ్యాయి. దీంతో ఈ ఏడాది చార్జీల పెంపు తప్పనిసరి అని తెలుస్తోంది.
ఖర్చు ఎక్కువ రాబడి తక్కువ
ఈపీడీసీఎల్ పరిధిలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 52.18 లక్షల మంది వినియోగదారులున్నారు. 65 వినియోగదారుల సేవా కేంద్రాలతో సేవలందిస్తోంది. సంస్థ నిర్వహణకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.10,367 కోట్లు అవసరం కాగా, సంస్థకు రూ.8,022 కోట్లు ఆదాయం వస్తోంది. ఈ లెక్కన రూ.2,345 కోట్ల లోటు కనిపిస్తోంది. విద్యుత్ చార్జీలు పెంచి రూ.440 కోట్లు సమీకరించుకోవాలని సంస్థ ప్రతిపాధించింది. అలా చూసినా ఇంకా రూ.1905 కోట్ల లోటు ఉంటుందని సంస్థ చెబుతోంది. ఈ ఏడాది విద్యుత్ కోనుగోలుకే రూ.7,564 కోట్లు వెచ్చించాల్సి వస్తుందంటున్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్ చార్జీలు పెంచక తప్పదని ఈపీడీసీఎల్ గట్టిగా వాదిస్తోంది. 2013-14 ధరలపై 6 శాతం పెంపునకు పట్టుబడుతోంది.
పేదల నుంచి రాని వ్యతిరేకత
ఈపీడీసీఎల్ సమర్పించిన రిటైల్ సరఫరా వ్యాపారం, సమగ్ర ఆదాయ ఆవశ్యకత నివేదికపై విశాఖ, కాకికాడ లో ఏపీఈఆర్‌సీ నిర్వహించిన బహిరంగ విచారణలో వినియోగదారుల నుంచి పెద్దగా వ్యతిరేకత రాలేదు. నెలకు 100 యూనిట్ల వరకూ వాడే వినియోగదారులకు పాత చార్జీలే ఉంటాయని ఈపీడీసీఎల్ స్పష్టం చేయడంతో పేద వర్గాల నుంచి ఆందోళన వ్యక్తం కాలేదు. ఏపీఈఆర్‌సీ చైర్మన్ సైతం భిన్నాభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటామని తేల్చిచెప్పారు. దీనిని బట్టి ఈ ఏడాది ఖచ్చితంగా విద్యుత్ చార్జీలు పెరుగుతాయని స్పష్టమవుతోంది. అయితే దీనిపై ఏపీఈఆర్‌సీ ప్రభుత్వ వైఖరిని తీసుకోవాల్సి ఉంది. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలపైనే వినియోగదారులపై పడే భారం ఆధారపడి ఉంది.
సానుకూలత వచ్చింది
ఏపీఈఆర్‌సీ హైదరాబాద్‌లో నిర్వహించిన బహిరంగ విచారణలో విద్యుత్ టారిఫ్ తగ్గించాలని ఒక్క సీపీఐఎంఎల్ న్యూడెక్రసీ మాత్రమే కోరింది. వినియోగదారుల పట్ల ఉద్యోగులు గౌరవంగా మెలగాలని, త్వరితగతిన సేవలందేందుకు వీలుగా ఉద్యోగుల సంఖ్యను పెంచాలని కొంత మంది సూచించారు. వ్యవసాయానికి 7 గంటల విద్యుత్ పగటి పూట మాత్రమే ఇవ్వాలని రైతు సంఘాలు కోరాయి. ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమల ప్రతినిధులు, స్పిన్నింగ్ మిల్స్ అసోసియేషన్లు, రైల్వే విభాగాల నుంచి రాయితీలు, ప్రాధాన్యాలు పెంచాలనే విజ్ఞప్తులు వచ్చాయి. ‘పీపీఏ’లపై సమీక్ష చేయమని, విద్యుత్ ప్రమాదాల్లో పరిహారం పెంచాలని పలువురు కోరారు. వాటన్నిటినీ నమోదు చేసుకున్నాం. టారిఫ్ ఆవశ్యకతను కూడా వినియోగదారులకు వివరించాం. దాదాపుగా అన్ని వర్గాల నుంచి మా ప్రతిపాదనలకు సానుకూలత వ్యక్తమైంది.
-ఆర్.ముత్యాలరాజు, సీఎండీ, ఏపీఈపీడీసీఎల్