- 1600 కోట్లతో బైక్‌ల పరిశ్రమ ఏర్పాటుకు ‘హీరో’ సంస్థకు అనుమతి
- 1500 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి
సాక్షి ప్రతినిధి, తిరుపతి: జిల్లాలో ఏర్పాటు చేసే ఆటోమొబైల్ హబ్‌లో రూ.1600 కోట్ల వ్యయంతో ద్విచక్ర వాహనాల తయారీ పరిశ్రమ నెలకొల్పడానికి హీరో మోటో కార్‌స లిమిటెడ్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ పరిశ్రమ వల్ల 1500 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. ఆ మేరకు పరిశ్రమలశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్వీ ప్రసాద్ గురువారం ఉత్తర్వుల(జీవో ఎంఎస్ నం: 199)ను జారీచేశారు.
రాష్ట్రంలో హీరో మోటో కార్స్ లిమిటెడ్ సంస్థ ద్విచక్ర వాహనాల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు అంగీకరించింది. ఈ మేరకు ఆ సంస్థతో సెప్టెంబరు 16న రాష్ట్ర ప్రభుత్వం కనీస అవగాహన ఒప్పందం(ఎంవోయూ) కుదర్చుకుంది. హీరో పరిశ్రమ ఏర్పాటుపై స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ కమిటీ(ఎస్‌ఐపీసీ) సెప్టెంబరు 19న తొలిసారి, సెప్టెంబరు 26న మరోసారి చర్చించింది.
ఎస్‌ఐపీసీప్రతిపాదనల మేరకు హీరో పరిశ్రమను జిల్లాలో సత్యవేడు మండలం మాదన్నపాళెంలోని ఏపీఐఐసీకి చెందిన భూముల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ ప్రతిపాదనపై మంత్రిమండలి ఆమోదముద్ర వేసిన విషయం విదితమే. ఆటోమొబైల్ పరిశ్రమలను ఆకర్షించాలనే లక్ష్యంతో సోమవారం ప్రభుత్వం ఆటోమొబైల్ పాలసీ(2014-19)ను విడుదల చేసింది. ఈ పాలసీలో చిత్తూరు-నెల్లూరు జిల్లాల మధ్య శ్రీసిటీ పరిసర ప్రాంతాల్లో ఆటోమొబైల్ హబ్‌ను ఏర్పాటు చేస్తామని పేర్కొంది. శ్రీసిటీ పరిసర ప్రాంతాల్లో సత్యవేడు మండలం మాదన్నపాళెం వద్ద ఏపీఐఐసీ భూములు ఉండటం గమనార్హం.
హీరోకు అనుకూలం
ఆటోమొబైల్ పాలసీలో రూ.1500 కోట్లకుపైగా పెట్టుబడి పెట్టే పరిశ్రమలకు ప్రభుత్వం భారీ ఎత్తున రాయితీలను ప్రకటించింది. ఆటోమొబైల్ పాలసీ ప్రకారం.. పరిశ్రమలకు ప్రభుత్వ భూమిని రాయితీపై కేటాయిస్తారు. 24 గంటలు నిరంతరాయంగా విద్యుత్‌ను సరఫరా చేస్తారు. సమీపంలోని జాతీయ, రాష్ట్ర రహదారులను పరిశ్రమను కలిపేలా నాలుగు లేన్ల రహదారిని నిర్మిస్తారు. దరఖాస్తు చేసుకున్న 60 రోజుల్లోగా అన్ని అనుమతులను సింగిల్‌విండో పద్ధతిలో మంజూరు చేస్తారు.
పదేళ్లపాటు వంద శాతం సీఎస్‌టీ(వాణిజ్యపన్ను)ని రీయింబర్స్‌మెంట్ చేస్తారు. వ్యాట్‌లో రాయితీ ఇస్తారు. తయారైన ఉత్పత్తులపై 20 ఏళ్లు లేదా తొలి ఏడేళ్లలో ఖర్చుపై 150 శాతం వ్యాట్ పన్నును రీయింబర్స్‌మెంట్ చేస్తారు. ఐదేళ్లపాటూ యూనిట్ విద్యుత్‌ను 75 పైసలకే సరఫరా చేస్తారు. 50 శాతం రాయితీపై పరిశ్రమకు అవసరమైన నీటిని సరఫరా చేస్తారు. మూడేళ్లలోగా పరిశ్రమను పూర్తిస్థాయిలో ప్రారంభిస్తేనే ఈ రాయితీలన్నీ వర్తిస్తాయని ప్రభుత్వం పేర్కొంది. హీరో పరిశ్రమ రూ.1600 కోట్లను పెట్టుబడి పెట్టనున్న నేపథయలో ఆటోమొబైల్ పాలసీలో రాయితీలన్నీ ఆ సంస్థకు దక్కే అవకాశాలు ఉన్నాయి.
తెగని పంచాయతీ
సత్యవేడు మండలం మాదన్నపాళెంలో ఏపీఐఐసీకి చెందిన 633 ఎకరాల భూమిని హీరో పరిశ్రమకు కేటాయించడానికి ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. కానీ.. ఆ భూములను శ్రీసిటీ భూనిర్వాసితులు సాగుచేసుకుంటున్నారు. బంజరుగా ఉన్న ఆ భూములను భూనిర్వాసితులు సాగుకు యోగ్యంగా తీర్చిదిద్ది.. ఎనిమిదేళ్లుగా పంటలను పండించుకుంటున్నారు. ఈ భూములను సర్వే చేయడానికి వెళ్లిన రెవెన్యూ అధికారులను రైతులు అడ్డుకున్నారు.
ఎకరానికి కనిష్ఠంగా రూ.ఎనిమిది లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తేనే భూములు ఇస్తామని రైతులు స్పష్టీకరిస్తున్నారు. కానీ.. ప్రభుత్వం ఎకరానికి రూ.1.6 లక్షలకు మించి ఇచ్చేది లేదని స్పష్టీకరించడంతో రైతులు ఉద్యమబాట పట్టారు. భూనిర్వాసితులైన రైతులు, రైతు కూలీలకు న్యాయం చేస్తే హీరో పరిశ్రమ ఏర్పాటుకు ఎలాంటి అడ్డంకులు ఉండవని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఆటోమొబైల్ హబ్‌లో హీరో పరిశ్రమ
Published Fri, Dec 5 2014 3:04 AM | Last Updated on Sat, Sep 2 2017 5:37 PM
Advertisement
Advertisement