Automobile hub
-
టాప్ గేర్‌లో ఏపీ ఆటోమొబైల్
సాక్షి, అమరావతి: ఆటోమొబైల్ హబ్‌గా ఆంధ్రప్రదేశ్ రూపుదిద్దుకుంటోంది. ముఖ్యంగా రాయలసీమలో ఆటోమొబైల్, ఆటో విడిభాగాల తయారీ ప్లాంట్ల ఏర్పాటుకు పలు కంపెనీలు ముందుకు వస్తున్నాయి. రాష్ట్రంలో 100 కు పైగా విడిభాగాల ఉత్పత్తి సంస్థలు ఉన్నాయి. లాక్డౌన్ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రీస్టార్ట్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే పలు కంపెనీలు ఉత్పత్తిని ప్రారంభించాయి. అనంతపురం జిల్లాలోని కియా మోటార్స్ ప్రస్తుతం ఒక షిఫ్టులో పనిచేస్తోంది. నిబంధనలను అనుసరించి కార్లను ఉత్పత్తి చేస్తున్నట్లు కియా మోటార్స్ ప్రతినిధులు తెలిపారు. శ్రీసిటీలో 20కిపైగా ఆటో మొబైల్ కంపెనీలున్నాయి. ఇందులో జపాన్‌కు చెందినవే అధికం. ఇసుజు మోటార్స్ ఇక్కడ ఎస్‌యూవీలను తయారు చేస్తోంది. ఇటీవలే ఈ కంపెనీ రూ. 400 కోట్ల పెట్టుబడితో అదనపు ఉత్పత్తి కేంద్రాన్ని, ప్రెస్ షాప్, ఇంజిన్ అసెంబ్లీ యూనిట్లతో ప్రారంభించింది. అనుబంధ పరిశ్రమలకు ఊతం.. ఇసుజు వాహనాలకు అవసరమైన వివిధ విడి భాగాలలో ప్రస్తుతం 70 శాతం మాత్రమే మన దేశంలో తయారవుతున్నాయి. రాబోయే రోజుల్లో, అన్ని విడి భాగాలను పూర్తిగా ఇక్కడే తయారుచేసేందుకు ఆ సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. దీంతో పలు అనుబంధ పరిశ్రమలు త్వరలో శ్రీసిటీకి రానున్నాయి. శిక్షణ, అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించి తిరుపతి ఐటీఐ కళాశాలలో ఇసుజు మోటార్స్ నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేశారు. కొబెల్కో గ్రూçపు, పయోలాక్స్, యన్.యస్.ఇన్స్ట్రుమెంట్స్, యన్.హెచ్.కే స్ప్రింగ్స్, మెటల్ వన్, నిట్టాన్ వాల్వ్ తదితర కంపెనీలు, ఇతర విడిభాగాల తయారీ కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. ఉత్పత్తికి సిద్ధంగా హీరో, అశోక్ లేలాండ్ చిత్తూరు జిల్లాలో ఉన్న అపోలో టైర్స్, అమరరాజా బ్యాటరీస్ లాక్డౌన్ తర్వాత తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. అలాగే ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటార్ కార్ప్ తమ ఉత్పత్తులను ట్రయిల్ రన్ చేస్తోంది. దేశంలో ఆటోమొబైల్ రంగం అమ్మకాలు పుంజుకున్న వెంటనే ఉత్పత్తి ప్రారంభించడానికి రంగం సిద్ధం చేసుకుంది. అదేవిధంగా విజయవాడ సమీపంలోని అశోక్ లేలాండ్ కూడా ఉత్పత్తులను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఇవి కాకుండా అవేరా ఈ బైక్స్ తమ ఉత్పత్తి కార్యక్రమాలను ప్రారంభించింది. అనంతపురంలో వీరా బస్సు తయారీ కేంద్రం రానుండగా, మరో ఆరు, ఏడు అంతర్జాతీయ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి చర్చలు జరుపుతున్నాయి. నమ్మకం పెరిగింది.. రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్–19 వైరస్ వ్యాప్తిని సమర్థవంతంగా అడ్డుకుంది. ప్రభుత్వం ఇచ్చిన సహకారంతో మే మొదటి వారంలోనే ఉత్పత్తి ప్రారంభించాం. రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం పెరగడంతో మరో రూ. 400 కోట్ల వరకు అదనపు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. త్వరలో మరో కొత్త మోడల్ కారును విడుదల చేయనున్నాం. – కూక్ హ్యూన్ షిమ్, ఎండీ, కియా మోటార్స్ ఇండియా. రాయితీలు అందాయి.. రాష్ట్ర ప్రభుత్వం రీస్టార్ట్ ప్యాకేజీ కింద ప్రకటించిన రాయితీలు పొందాం. అదే విధంగా వర్కింగ్ క్యాపిటల్ కింద మరో 20 శాతం అదనపు రుణానికి దరఖాస్తు చేసిన రెండు రోజుల్లోనే విడుదల అయ్యింది. ప్రస్తుతం యూనిట్‌ను 50 శాతం మంది సిబ్బందితో నడుపుతున్నాం. మార్చి నెల ఆర్డర్లను పూర్తి చేసి త్వరలో తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అమ్మకాలు విస్తరించే యోచనలో ఉన్నాం. – డాక్టర్ రమణ, అవేరా ఈ స్కూటర్స్, ఫౌండర్ సీఈవో. -
ఏపీని ఆటోమొబైల్ హబ్ గా చేస్తా..
♦ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్య ♦ సిటీలో ఇసుజు ప్లాంటు ప్రారంభం సాక్షి, సత్యవేడు: రాష్ట్రాన్ని ఆటోమొబైల్ హబ్‌గా అభివృద్ధి చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. శ్రీ సిటీలో ఏర్పాటైన ‘ఇసుజు’ తయారీ పరిశ్రమను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వి-క్రాస్ అడ్వెంచర్ యుటిలిటీ వాహనాన్ని నడిపి చూశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ ప్రపంచస్థాయి వసతులున్న శ్రీ సిటీకి దేశంలో మరే సెజ్ సాటి రాదన్నారు. ‘‘ఏపీలో పరిశ్రమల స్థాపనకు అపార అవకాశాలున్నాయి. శ్రీ సిటీ ప్రాంతాన్ని ఆటో మొబైల్ హబ్‌గా తీర్చి దిద్దుతాం. శ్రీ సిటీకి మరిన్ని పరిశ్రమలు వచ్చేలా చూస్తాం’’ అన్నారాయన. శ్రీ సిటీలో జపాన్‌కు చెందిన 18 పరిశ్రమలు ఏర్పడటాన్ని ప్రస్తావిస్తూ... జపాన్‌తో రాష్ట్రానికి విడదీయరాని అనుబంధం ఉందని, వ్యవసాయ అభివృద్ధికి జపాన్‌తో కలసి పనిచేస్తామని చెప్పారు. అమరావతి నిర్మాణంలో జపాన్ భాగస్వామ్యం ఉందన్నారు. ఆరు నెలల క్రితం జపాన్ పర్యటనలో రాష్ట్ర పరిస్థితులపై అక్కడి పారిశ్రామికవేత్తలతో చర్చించినట్లు సీఎం తెలిపారు. ఇసుజు మోటార్స్ ప్రెసిడెంట్ మసనోరి కతయమ మాట్లాడుతూ ప్రపంచంలో అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్లలో భారత్ ఒకటన్నారు. ఇసుజు మోటార్స్ అంతర్జాతీయ ప్రయాణంలో ఇండియా అత్యంత కీలకమైన భాగమని చెప్పారు. ‘‘మున్ముందు ఇసుజు గ్లోబల్ ఆపరేషన్స్‌కు భారత్ అత్యంత కీలకంగా మారుతుంది’’ అన్నారాయన. ఇసుజు మోటార్స్ ఇండియా చైర్మన్ హిరోయాసుమియరాతో పాటు కార్యక్రమంలో భారత్‌లోని జపాన్ రాయబారి కెన్టీ హీరా, శ్రీ సిటీ చైర్మన్ శ్రీనిరాజు, ఎండీ రవీంద్రసన్నారెడ్డి, డిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామమోహనరావు, రాష్ట్ర మంత్రులు గోపాల కృష్ణారెడ్డి, నారాయణ, స్థానిక ఎమ్మెల్యే ఆదిత్య తదితరులు పాల్గొన్నారు -
ఆటోమొబైల్ హబ్‌లో హీరో పరిశ్రమ
- 1600 కోట్లతో బైక్‌ల పరిశ్రమ ఏర్పాటుకు ‘హీరో’ సంస్థకు అనుమతి - 1500 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి సాక్షి ప్రతినిధి, తిరుపతి: జిల్లాలో ఏర్పాటు చేసే ఆటోమొబైల్ హబ్‌లో రూ.1600 కోట్ల వ్యయంతో ద్విచక్ర వాహనాల తయారీ పరిశ్రమ నెలకొల్పడానికి హీరో మోటో కార్స లిమిటెడ్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ పరిశ్రమ వల్ల 1500 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. ఆ మేరకు పరిశ్రమలశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్వీ ప్రసాద్ గురువారం ఉత్తర్వుల(జీవో ఎంఎస్ నం: 199)ను జారీచేశారు. రాష్ట్రంలో హీరో మోటో కార్స్ లిమిటెడ్ సంస్థ ద్విచక్ర వాహనాల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు అంగీకరించింది. ఈ మేరకు ఆ సంస్థతో సెప్టెంబరు 16న రాష్ట్ర ప్రభుత్వం కనీస అవగాహన ఒప్పందం(ఎంవోయూ) కుదర్చుకుంది. హీరో పరిశ్రమ ఏర్పాటుపై స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కమిటీ(ఎస్ఐపీసీ) సెప్టెంబరు 19న తొలిసారి, సెప్టెంబరు 26న మరోసారి చర్చించింది. ఎస్ఐపీసీప్రతిపాదనల మేరకు హీరో పరిశ్రమను జిల్లాలో సత్యవేడు మండలం మాదన్నపాళెంలోని ఏపీఐఐసీకి చెందిన భూముల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ ప్రతిపాదనపై మంత్రిమండలి ఆమోదముద్ర వేసిన విషయం విదితమే. ఆటోమొబైల్ పరిశ్రమలను ఆకర్షించాలనే లక్ష్యంతో సోమవారం ప్రభుత్వం ఆటోమొబైల్ పాలసీ(2014-19)ను విడుదల చేసింది. ఈ పాలసీలో చిత్తూరు-నెల్లూరు జిల్లాల మధ్య శ్రీసిటీ పరిసర ప్రాంతాల్లో ఆటోమొబైల్ హబ్‌ను ఏర్పాటు చేస్తామని పేర్కొంది. శ్రీసిటీ పరిసర ప్రాంతాల్లో సత్యవేడు మండలం మాదన్నపాళెం వద్ద ఏపీఐఐసీ భూములు ఉండటం గమనార్హం. హీరోకు అనుకూలం ఆటోమొబైల్ పాలసీలో రూ.1500 కోట్లకుపైగా పెట్టుబడి పెట్టే పరిశ్రమలకు ప్రభుత్వం భారీ ఎత్తున రాయితీలను ప్రకటించింది. ఆటోమొబైల్ పాలసీ ప్రకారం.. పరిశ్రమలకు ప్రభుత్వ భూమిని రాయితీపై కేటాయిస్తారు. 24 గంటలు నిరంతరాయంగా విద్యుత్‌ను సరఫరా చేస్తారు. సమీపంలోని జాతీయ, రాష్ట్ర రహదారులను పరిశ్రమను కలిపేలా నాలుగు లేన్ల రహదారిని నిర్మిస్తారు. దరఖాస్తు చేసుకున్న 60 రోజుల్లోగా అన్ని అనుమతులను సింగిల్‌విండో పద్ధతిలో మంజూరు చేస్తారు. పదేళ్లపాటు వంద శాతం సీఎస్టీ(వాణిజ్యపన్ను)ని రీయింబర్స్మెంట్ చేస్తారు. వ్యాట్‌లో రాయితీ ఇస్తారు. తయారైన ఉత్పత్తులపై 20 ఏళ్లు లేదా తొలి ఏడేళ్లలో ఖర్చుపై 150 శాతం వ్యాట్ పన్నును రీయింబర్స్మెంట్ చేస్తారు. ఐదేళ్లపాటూ యూనిట్ విద్యుత్‌ను 75 పైసలకే సరఫరా చేస్తారు. 50 శాతం రాయితీపై పరిశ్రమకు అవసరమైన నీటిని సరఫరా చేస్తారు. మూడేళ్లలోగా పరిశ్రమను పూర్తిస్థాయిలో ప్రారంభిస్తేనే ఈ రాయితీలన్నీ వర్తిస్తాయని ప్రభుత్వం పేర్కొంది. హీరో పరిశ్రమ రూ.1600 కోట్లను పెట్టుబడి పెట్టనున్న నేపథయలో ఆటోమొబైల్ పాలసీలో రాయితీలన్నీ ఆ సంస్థకు దక్కే అవకాశాలు ఉన్నాయి. తెగని పంచాయతీ సత్యవేడు మండలం మాదన్నపాళెంలో ఏపీఐఐసీకి చెందిన 633 ఎకరాల భూమిని హీరో పరిశ్రమకు కేటాయించడానికి ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. కానీ.. ఆ భూములను శ్రీసిటీ భూనిర్వాసితులు సాగుచేసుకుంటున్నారు. బంజరుగా ఉన్న ఆ భూములను భూనిర్వాసితులు సాగుకు యోగ్యంగా తీర్చిదిద్ది.. ఎనిమిదేళ్లుగా పంటలను పండించుకుంటున్నారు. ఈ భూములను సర్వే చేయడానికి వెళ్లిన రెవెన్యూ అధికారులను రైతులు అడ్డుకున్నారు. ఎకరానికి కనిష్ఠంగా రూ.ఎనిమిది లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తేనే భూములు ఇస్తామని రైతులు స్పష్టీకరిస్తున్నారు. కానీ.. ప్రభుత్వం ఎకరానికి రూ.1.6 లక్షలకు మించి ఇచ్చేది లేదని స్పష్టీకరించడంతో రైతులు ఉద్యమబాట పట్టారు. భూనిర్వాసితులైన రైతులు, రైతు కూలీలకు న్యాయం చేస్తే హీరో పరిశ్రమ ఏర్పాటుకు ఎలాంటి అడ్డంకులు ఉండవని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. -
తెరపైకి..ఆటోమొబైల్ హబ్
జిల్లాలో ఆటోమొబైల్ హబ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నెల్లూరు-చిత్తూరు జిల్లాల మధ్య(శ్రీ సిటీ సెజ్ పరిసర ప్రాంతాల్లో) ఆటో మొబైల్‌హబ్ ఏర్పాటుచేయాలని నిశ్చయించింది. ఈ క్రమంలో సోమవారం ఆటోమొబైల్ పాలసీ-(2014-19) విడుదల చేస్తూ పరిశ్రమలశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్వీ ప్రసాద్ ఉత్తర్వులు జారీచేశారు. సాక్షి ప్రతినిధి, తిరుపతి: జిల్లాను సమగ్రంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో దివంగత సీఎం వైఎస్.. వ్యసాయంతోపాటు పారిశ్రామిక రంగానికీ పెద్దపీట వేశారు. పారిశ్రామికంగా జిల్లాను అభివృద్ధి చేయడంలో భాగంగా సత్యవేడు నియోజకవర్గం, నెల్లూరు జిల్లాలో తడ ప్రాంతాల్లో ప్రత్యేక వాణిజ్య మండలిని మంజూరు చేసి శ్రీసిటీ పేరుతో ఆగస్టు 8, 2008న వైఎస్ శంకుస్థాపన చేశారు. ఆయన హయాంలో భారీ ఎత్తున రాయితీలు ఇవ్వడంతో విదేశాలకు చెందిన పలు బహుళజాతి సంస్థలు శ్రీసిటీలో పెట్టుబడులు పెట్టి.. పరిశ్రమలను నెలకొల్పడానికి ముందుకొచ్చాయి. జపాన్‌కు చెందిన ఇసుజు మోటార్స్, కొబెల్కో క్రేన్స్ వంటి ఆటో మొబైల్స్ సంస్థల నుంచీ క్యాడ్‌బర్రీ వంటి ఆహారపదార్థాల సంస్థల వరకూ పలు బహుళజాతి సంస్థలు పరిశ్రమలను ఏర్పాటుచేశాయి. అమెరికా, బ్రిటన్, థాయ్‌ల్యాండ్, తైవాన్, స్వీడన్, శ్రీలంక, స్పెయిన్, దక్షిణాఫ్రికా, సింగపూర్, సౌదీ అరేబియా, ఓమన్, నెదర్లాండ్స్, జపాన్, ఇటలీ, ఇండోనేషియా, జిబ్రాల్టర్, జర్మనీ, ఫ్రాన్స్, దుబాయ్, చైనా, బహ్రెయిన్ వంటి విదేశాలతోపాటు మన దేశానికి చెందిన 94 పరిశ్రమలు శ్రీసిటీలో ఏర్పాటయ్యాయి. వీటిలో ఇప్పటికే 60 పరిశ్రమలు పూర్తయ్యాయి. మరో 34 పరిశ్రమలు వివిధ దశల్లో ఉన్నాయి. ప్రస్తుతం ఉత్పత్తి ప్రారంభించిన 60 పరిశ్రమల్లో 15 వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగాఉపాధి లభిస్తోంది. తక్కిన 34 పరిశ్రమలు పూర్తయితే మరో 25 వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నారు. దీంతో దక్షిణ భారతదేశంలో అత్యుత్తమ వాణిజ్య మండలిగా శ్రీసిటీని ఎగ్జిమ్ ఇండియా జూన్ 24న గుర్తించింది. రూ.1500 కోట్లతో ఇసుజు సంస్థ వాహనాల తయారీ పరిశ్రమను ఈ సెజ్‌లోనే ఏర్పాటుచేస్తోంది. కొబెల్కో క్రేన్స్ సంస్థ కూడా ఇక్కడే పరిశ్రమను ఏర్పాటుచేసింది. పలు దేశాలకు చెందిన బహుళజాతి సంస్థలు ఇప్పటికే ఈ ప్రాంతంలో ఆటోమొబైల్స్ పరిశ్రమలను ఏర్పాటుచేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే శ్రీసిటీతో పాటూ పరిసర ప్రాంతాల్లో ఆటోమొబైల్ హబ్‌ను ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే అంశాన్ని సోమవారం విడుదల చేసిన ఆటోమొబైల్ పాలసీలో కూడా ప్రభుత్వం పేర్కొంది. రూ.1500 కోట్ల కన్నా ఎక్కువ పెట్టుబడితో ఇంటిగ్రేటెడ్ ఆటోమొబైల్ ప్రాజెక్టులను ఏర్పాటుచేసే సంస్థలకు ఆటోమొబైల్ హబ్‌లో అధికంగా ప్రాధాన్యం ఇస్తారు. ఇంటిగ్రేటెడ్ ఆటోమొబైల్ ప్రాజెక్టులు మూడేళ్లలో రూ.500 కోట్ల పెట్టుబడి పెడితేనే రాయితీలు వర్తింపజేస్తామని ఆటోమొబైల్ పాలసీలో ప్రభుత్వం పేర్కొంది. ఆటోమొబైల్ పాలసీలో ప్రధానాంశాలు ఇవే..: ఆటోమొబైల్ పరిశ్రమలకు ప్రభుత్వ భూమిని రాయితీపై కేటాయిస్తారు. 24 గంటలూ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తారు. సమీపంలోని జాతీయ, రాష్ట్ర రహదారులను పరిశ్రమను కలిపేలా నాలుగు లేన్ల రహదారిని నిర్మిస్తారు. దరఖాస్తు చేసుకున్న 60 రోజుల్లోగా అన్ని అనుమతులనూ సింగిల్ విండో పద్ధతిలో మంజూరు చేస్తారు. పదేళ్లపాటు వంద శాతం సీఎస్టీని రీయింబర్స్మెంట్ చేస్తారు. వ్యాట్‌లో రాయితీ ఇస్తారు. ఐదేళ్లపాటు యూనిట్ విద్యుత్‌ను 75 పైసలకే సరఫరా చేస్తారు. 50 శాతం రాయితీపై పరిశ్రమకు అవసరమైన నీటిని సరఫరా చేస్తారు. మూడేళ్లలోగా పరిశ్రమను పూర్తిస్థాయిలో ప్రారంభిస్తేనే ఈ రాయితీలన్నీ వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టీకరించింది.