జిల్లాలో ఆటోమొబైల్ హబ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నెల్లూరు-చిత్తూరు జిల్లాల మధ్య(శ్రీ సిటీ సెజ్ పరిసర ప్రాంతాల్లో) ఆటో మొబైల్‌హబ్ ఏర్పాటుచేయాలని నిశ్చయించింది. ఈ క్రమంలో సోమవారం ఆటోమొబైల్ పాలసీ-(2014-19) విడుదల చేస్తూ పరిశ్రమలశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్వీ ప్రసాద్ ఉత్తర్వులు జారీచేశారు.
సాక్షి ప్రతినిధి, తిరుపతి: జిల్లాను సమగ్రంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో దివంగత సీఎం వైఎస్.. వ్యసాయంతోపాటు పారిశ్రామిక రంగానికీ పెద్దపీట వేశారు. పారిశ్రామికంగా జిల్లాను అభివృద్ధి చేయడంలో భాగంగా సత్యవేడు నియోజకవర్గం, నెల్లూరు జిల్లాలో తడ ప్రాంతాల్లో ప్రత్యేక వాణిజ్య మండలిని మంజూరు చేసి శ్రీసిటీ పేరుతో ఆగస్టు 8, 2008న వైఎస్ శంకుస్థాపన చేశారు. ఆయన హయాంలో భారీ ఎత్తున రాయితీలు ఇవ్వడంతో విదేశాలకు చెందిన పలు బహుళజాతి సంస్థలు శ్రీసిటీలో పెట్టుబడులు పెట్టి.. పరిశ్రమలను నెలకొల్పడానికి ముందుకొచ్చాయి.
జపాన్‌కు చెందిన ఇసుజు మోటార్స్, కొబెల్కో క్రేన్స్ వంటి ఆటో మొబైల్స్ సంస్థల నుంచీ క్యాడ్‌బర్రీ వంటి ఆహారపదార్థాల సంస్థల వరకూ పలు బహుళజాతి సంస్థలు పరిశ్రమలను ఏర్పాటుచేశాయి. అమెరికా, బ్రిటన్, థాయ్‌ల్యాండ్, తైవాన్, స్వీడన్, శ్రీలంక, స్పెయిన్, దక్షిణాఫ్రికా, సింగపూర్, సౌదీ అరేబియా, ఓమన్, నెదర్లాండ్స్, జపాన్, ఇటలీ, ఇండోనేషియా, జిబ్రాల్టర్, జర్మనీ, ఫ్రాన్స్, దుబాయ్, చైనా, బహ్రెయిన్ వంటి విదేశాలతోపాటు మన దేశానికి చెందిన 94 పరిశ్రమలు శ్రీసిటీలో ఏర్పాటయ్యాయి. వీటిలో ఇప్పటికే 60 పరిశ్రమలు పూర్తయ్యాయి. మరో 34 పరిశ్రమలు వివిధ దశల్లో ఉన్నాయి. ప్రస్తుతం ఉత్పత్తి ప్రారంభించిన 60 పరిశ్రమల్లో 15 వేల మందికి
ప్రత్యక్షంగా పరోక్షంగాఉపాధి లభిస్తోంది.
తక్కిన 34 పరిశ్రమలు పూర్తయితే మరో 25 వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నారు. దీంతో దక్షిణ భారతదేశంలో అత్యుత్తమ వాణిజ్య మండలిగా శ్రీసిటీని ఎగ్జిమ్ ఇండియా జూన్ 24న గుర్తించింది. రూ.1500 కోట్లతో ఇసుజు సంస్థ వాహనాల తయారీ పరిశ్రమను ఈ సెజ్‌లోనే ఏర్పాటుచేస్తోంది. కొబెల్కో క్రేన్స్ సంస్థ కూడా ఇక్కడే పరిశ్రమను ఏర్పాటుచేసింది. పలు దేశాలకు చెందిన బహుళజాతి సంస్థలు ఇప్పటికే ఈ ప్రాంతంలో ఆటోమొబైల్స్ పరిశ్రమలను ఏర్పాటుచేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే శ్రీసిటీతో పాటూ పరిసర ప్రాంతాల్లో ఆటోమొబైల్ హబ్‌ను ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే అంశాన్ని సోమవారం విడుదల చేసిన ఆటోమొబైల్ పాలసీలో కూడా ప్రభుత్వం పేర్కొంది. రూ.1500 కోట్ల కన్నా ఎక్కువ పెట్టుబడితో ఇంటిగ్రేటెడ్ ఆటోమొబైల్ ప్రాజెక్టులను ఏర్పాటుచేసే సంస్థలకు ఆటోమొబైల్ హబ్‌లో అధికంగా ప్రాధాన్యం ఇస్తారు. ఇంటిగ్రేటెడ్ ఆటోమొబైల్ ప్రాజెక్టులు మూడేళ్లలో రూ.500 కోట్ల పెట్టుబడి పెడితేనే రాయితీలు వర్తింపజేస్తామని ఆటోమొబైల్ పాలసీలో ప్రభుత్వం పేర్కొంది.
ఆటోమొబైల్ పాలసీలో ప్రధానాంశాలు ఇవే..:
ఆటోమొబైల్ పరిశ్రమలకు ప్రభుత్వ భూమిని రాయితీపై కేటాయిస్తారు.
24 గంటలూ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తారు.
సమీపంలోని జాతీయ, రాష్ట్ర రహదారులను పరిశ్రమను కలిపేలా నాలుగు లేన్ల రహదారిని నిర్మిస్తారు.
దరఖాస్తు చేసుకున్న 60 రోజుల్లోగా అన్ని అనుమతులనూ సింగిల్ విండో పద్ధతిలో మంజూరు చేస్తారు.
పదేళ్లపాటు వంద శాతం సీఎస్‌టీని రీయింబర్స్‌మెంట్ చేస్తారు. వ్యాట్‌లో రాయితీ ఇస్తారు.
ఐదేళ్లపాటు యూనిట్ విద్యుత్‌ను 75 పైసలకే సరఫరా చేస్తారు.
50 శాతం రాయితీపై పరిశ్రమకు అవసరమైన నీటిని సరఫరా చేస్తారు.
మూడేళ్లలోగా పరిశ్రమను పూర్తిస్థాయిలో ప్రారంభిస్తేనే ఈ రాయితీలన్నీ వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టీకరించింది.
తెరపైకి..ఆటోమొబైల్ హబ్
Published Tue, Dec 2 2014 1:52 AM | Last Updated on Sat, Sep 2 2017 5:28 PM
Advertisement
Advertisement