హాస్టల్ యజమాని బరితెగింపు
విద్యార్థినులను గెంటేసిన వైనం
రోడ్డుపైకి లగేజీ విసిరివేత
పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు
అదుపులో నిందితులు
అమ్మాయిలకు ప్రత్యామ్నాయ వసతి ఏర్పాటు
తిరుపతి క్రైం : తిరుపతి-రేణిగుంట మార్గంలోని గొల్లవానిగుంట వద్ద ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఓ విద్యార్థినిపై యజమాని దాడిచేసిన ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గొల్లవానిగుంటలోని భారతి ఉమెన్స్ హాస్టల్‌లో అనంతపురం, చిత్తూరు జిల్లాలకు చెందిన 40 మంది డైట్ విద్యార్థులు ఉంటున్నారు. వీరు చేరేటప్పుడు అడ్వాన్స్‌ల కింద ఒక్కొక్కరు రూ.3 వేలు చెల్లించారు. నిలిచిపోయేందుకు సిద్ధమై అడ్వాన్స్ అడిగితే హాస్టల్ యజమాని భారతి, ఆమె కూతురు మూగతి ఇద్దరూ కలసి గౌతమి అనే విద్యార్థిపై చేయి చేసుకున్నారు. మేము డబ్బులు ఇవ్వం.. దిక్కున్న చోట చెప్పుకో అని బయటకు గెంటేశారు. దీంతో అక్కడున్న హాస్టల్ విద్యార్థులందరూ తిరగబడ్డారు. తమ అడ్వాన్స్‌లు ఇస్తే మేము నిలిచిపోతామని యజమానిని నిలదీయడంతో అందర్నీ కూడా రోడ్డుపై గెంటేసింది. రూముల్లో ఉన్న వారి లగేజీ మొత్తం తెచ్చి రోడ్డుపై పడేసింది. సాయంత్రం నుంచి కన్నీరుమున్నీరుగా ఏడుస్తూ రోడ్డుపైనే ఉండడంతో స్థానికులు గుర్తించి డయల్ 100కు ఫిర్యాదు చేశారు. అలిపిరి సీఐ శ్రీనివాసులు, ఎస్‌ఐ గణేష్ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
యజమానిని పిలిచి మాట్లాడగా మేము ఎవరినీ కొట్టలేదని, వారే మాపై తిరగబడి హాస్టల్‌ను ఖాళీ చేస్తామని రోడ్డుపైకి వచ్చారన్నారు. కానీ విద్యార్థులు మాత్రం వీరు తరచూ ఇలానే వాదిస్తుంటారని, కాలేజీ సమీపంలో ఉందని ఇక్కడ చేరామని తెలిపారు. యజమాని భారతి దీన్ని నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించింది. పోలీసులు ఎంత చెప్పినా వినకుండా వాగ్వాదానికి దిగింది. విద్యార్థిని గౌతమి ఫిర్యాదు మేరకు భారతీని, ఆమె కుమార్తెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులే రోడ్డుపైనే ఉన్న విద్యార్థినులను, వారి లగేజీని ఓ వ్యాన్‌లో తీసుకుని మరో చోట వసతి కల్పించేందుకు వెళ్లారు. కనీసం ఆడపిల్లలని కూడా చూడకుండా రాత్రి సమయంలో హాస్టల్ బయటకు తరిమేసిందని హాస్టల్ యజమానిని స్థానికులు నిలదీశారు. సీఐ నచ్చజెప్పడంతో వ్యవహారం సద్దుమణిగింది.