దివాకర్ బస్సు ప్రమాదం..పలువురికి హెచ్చార్సీ నోటీసులు
♦ కృష్ణా జిల్లా కలెక్టర్, ఏపీ రవాణా శాఖ కమిషనర్, డీజీపీ,
♦ ట్రావెల్స్ యజమానులకు నోటీసులు
విజయవాడ లీగల్: ఏపీలోని కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం మూలపాడు వద్ద ఫిబ్రవరి 28న జరిగిన దివాకర్ బస్సు ప్రమాదానికి సంబం ధించి జిల్లా కలెక్టర్, ఆ రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్, డీజీపీ, దివాకర్ ట్రావెల్స్ యజమానులకు ఏపీ మానవ హక్కుల కమిషన్ గురువారం నోటీసులు జారీ చేసింది. వారితో పాటు పెనుగంచిప్రోలు తహసీల్దారు, సబ్ ఇన్‌స్పెక్టర్, నందిగామ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌లను శుక్రవారం స్వయంగా కమిషన్ ముందు హాజరు కావాలని ఆదేశించింది.
దివాకర్ బస్సు ప్రమాదంలో పది మంది ప్రయాణికులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ ఘటనపై బెజవాడ బార్ అసోసియేషన్ న్యాయవాది తగరం కిరణ్‌బాబు మానవ హక్కుల కమిషన్‌లో పిటిషన్ దాఖలు చేశారు. ఆ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. మృతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి, ట్రావెల్స్ యజమానుల నుంచి ఎలాంటి సహాయం అందలేదని, ఆ ఘటనలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ప్రమాదానికి కారణమైన దివాకర్ ట్రావెల్స్ యజమానులు జె.సి.దివాకర్‌రెడ్డి ఎంపీగా, జె.సి.ప్రభాకర రెడ్డి ఎమ్మెల్యేగా అధికార టీడీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండడంతో కేసును నీరు గార్చేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని కిరణ్‌బాబు ఆరోపించారు.
మృతులకు పోస్టుమార్టం నిర్వహించలేదన్న ఆరోపణలు రావడంతో ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆస్పత్రిలో ఉన్న మృతదేహాలను చూసేందుకు వచ్చి అధికారులను ప్రశ్నించగా కలెక్టర్, ఆస్పత్రి వైద్యులు సరైన సమాధానం చెప్పకపోగా వాదనకు దిగారని ప్రస్తావించారు. మృతులకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఇదంతా మానవ హక్కుల ఉల్లంఘనే అన్నారు. విచారణకు స్వీకరించిన కమిషన్ బాధ్యులకు నోటీసులు జారీ చేసింది.