రాష్ట్ర న్యాయసేవల అథారిటీ ఆదేశాల అమలులో కలెక్టర్ ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారంటూ రాష్ట్ర మానవ హక్కుల సంఘం(హెచ్‌ఆర్‌సి) కలెక్టర్, డీఎంహెచ్‌ఓలకు నోటీసులు జారీ చేసింది.
శృంగవరపుకోట: రాష్ట్ర న్యాయసేవల అథారిటీ ఆదేశాల అమలులో కలెక్టర్ ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారంటూ చేసిన ఫిర్యాదు మేరకు రాష్ట్ర మానవ హక్కుల సంఘం(హెచ్‌ఆర్‌సి) కలెక్టర్, డీఎంహెచ్‌ఓలకు నోటీసులు జారీ చేసిందని స్థానిక న్యాయవాది చిక్కాల ఈశ్వరరావు శుక్రవారం తెలిపారు. ఈమేరకు ఆయన హెచ్‌ఆర్‌సి జారీ చేసిన నోటీసు ప్రతిని మీడియాకు విడుదల చేశారు.
జిల్లాలో దోమల నివారణకు సివిక్ ఎక్స్‌నోరా ప్రాజెక్టు అమలు చేయాలని రాష్ట్ర న్యాయసేవల అథారిటీ గతంలో ఆదేశాలిచ్చింది. ఆ ఆదేశాల అమలులో కలెక్టర్ చొరవ చూపకపోవడంతో హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించినట్టు ఈశ్వరరావు చెప్పారు. దీంతో ఈ కార్యక్రమం అమలుకు తీసుకున్న చర్యలను వివరించే తగిన వివరాలతో ఆగస్టు 16వ తేదీన ఉదయం 10.30గంటలకు కమిషన్ ఎదుట హాజరు కావాలని హెచ్‌ఆర్‌సి ఆదేశించిందని న్యాయవాది ఈశ్వరరావు చెప్పారు.