
సాక్షి ఉద్యోగికి గాయాలు
రేగిడి : మండలంలోని లచ్చారాయపురం వద్ద మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ‘సాక్షి’ దినపత్రికలో ఏసీఓగా పనిచేస్తున్న బొడ్డేపల్లి కోటేశ్వరరావు గాయపడ్డారు. విధులు నిర్వహించేందుకు రాజాం నుంచి రేగిడి వైపు బైక్‌పై వస్తున్న ఆయనను పాల కొండ నుంచి రాజాం వైపు వెళుతున్న లారీ ఢీ కొంది. తీవ్ర గాయాలైన కోటేశ్వరరావును ఎస్సై ఎన్. కామేశ్వరరావు, హెచ్‌సీ రిప్పన్‌రా వు, కానిస్టేబుల్ సుధీర్‌లు వెంటనే 108లో రాజాం ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే తనకీ ప్రమాదం జరిగిందని కోటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎస్సై ఎన్. కామేశ్వరరావు కేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నారు.
చెట్టును ఢీకొన్న కారు
పొందూరు: స్థానిక రాపాక కూడలిలో మంగళవారం ఓ కారు చెట్టును ఢీ కొట్టింది. ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకొన్నారు. మితిమీరిన వేగంతో కారును నడపడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. కారు రాయగడ నుంచి భువనేశ్వరం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్సై వెంకట్రావు చెప్పారు. కారులో ప్రయాణిస్తున్న రస్మీ రంజన్ సాగర్ ఎడమ భుజానికి గాయమవడంతో రిమ్స్‌కు తరలించారు. అందులో ప్రయాణిస్తున్న గౌరీ శంకర్ బెహరా, రాకేష్ రాధోలులకు స్వల్ప గాయాలయ్యాయి.