ఉపశమనం.. ఉత్తమాటే.. | Invalid expand Documents | Sakshi
Sakshi News home page

ఉపశమనం.. ఉత్తమాటే..

Published Wed, Jul 6 2016 4:00 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM

Invalid expand Documents

చెల్లుబాటు కాని రుణమాఫీ పత్రాలు  
ఆదేశాలు లేవంటున్న బ్యాంకర్లు  
బ్యాంకుల చుట్టూ రైతుల ప్రదక్షిణ
పాత విధానమే మేలంటున్న వైనం

 
ఇటీవల ప్రభుత్వం రుణ ఉపశమన పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ఎంతో ఆర్భాటంగా చేపట్టింది. మంత్రులు, టీడీపీ         ఎమ్మెల్యేలు సభలు ఏర్పాటు చేసి.. రైతులకు పత్రాలు పంపిణీ చేశారు. ‘రైతు ప్రభుత్వం’ అంటూ గొప్పలు చెప్పుకున్నారు. పత్రాలు     బ్యాంకర్లకు ఇస్తే 24 గంటల్లో ఖాతాల్లోకి డబ్బు     జమ అవుతుందని చెప్పారు. అయితే..వాస్తవ పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. మాఫీ పత్రాలను బ్యాంకర్లు తీసుకోవడం లేదు. తమకు ఆదేశాలు లేవని స్పష్టం చేస్తున్నారు.
 
 ధర్మవరం : ధర్మవరం మండలం తుమ్మల గ్రామానికి చెందిన దాదాపు 70 మంది రైతులకు రుణమాఫీ పత్రాలు ఇచ్చారు. వీరు రోజూ ధర్మవరం పట్టణంలోని కెనరా బ్యాంకు చుట్టూ తిరుగుతున్నారు. మంగళవారం కూడా 20 మంది దాకా వచ్చారు. రుణమాఫీ పత్రాలు తీసుకుని..తమ ఖాతాల్లో డబ్బు జమయ్యేలా చూడాలని బ్యాంకు అధికారులకు విన్నవించుకున్నారు. అయితే.. వారు తీసుకోలేదు. ‘ మేం పత్రాలు తీసుకుని ఏం చేయాలి? మాకు ఎవరూ ఏమీ చెప్పలేదు. పోండి’ అంటూ రైతులను తిప్పి పంపారు.  దీంతో  రైతులు నిరుత్సాహంతో వెనుదిరిగారు. ఒక్క ధర్మవరంలోనే కాదు..జిల్లాలో చాలాచోట్ల రైతులకు ఇలాంటి అనుభవమే ఎదురవుతోంది. ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా రుణమాఫీ పత్రాలు ఇచ్చినప్పటికీ బ్యాంకర్లు వీటిని తిరస్కరిస్తుండడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.
 
రుణమాఫీ పథకం అమలులో భాగంగా తొలి ఏడాది అప్పులు తీసుకున్న రైతుల నుంచి ఆయా బ్యాంకుల ద్వారా వారి ఖాతా, ఆధార్ నంబర్లు సేకరించారు. ఆన్‌లైన్ ద్వారా నేరుగా  సదరు రైతుల బ్యాంకు ఖాతాల్లోకి తొలివిడత మొత్తాన్ని జమచేశారు. ప్రభుత్వం పూర్తిగా మాఫీ చేయకపోయినప్పటికీ అయ్యిందేదో అయ్యిందని భావించిన రైతులు వచ్చిన కాస్త మొత్తానికి మరింత జమ చేసి  పంట రుణాలను రెన్యూవల్ చేసుకున్నారు. రుణమాఫీ చేసినా తొలి ఏడాదిలో రైతుల నుంచి ఎటువంటి మద్దతూ లభించలేదని భావించిన ప్రభుత్వం.. రెండో ఏడాది కొండంత ప్రచారం చేపట్టింది. రైతు సాధికార సంస్థ పేరిట రుణ ఉపశమన అర్హత పత్రాలను మంజూరు చేసింది. అయితే.. వాటిని తీసుకుని రైతుల వివరాలను ఆన్‌లైన్‌లో రైతు సాధికార సంస్థకు అప్‌లోడ్ చేయాలని బ్యాంకర్లకు ఆదేశాలు జారీ చేయలేదు. దీంతో రైతులను బ్యాంకర్లు తమ చుట్టూ తిప్పుకుంటున్నారు. ప్రస్తుతం అన్ని బ్యాంకులూ రుణాల రెన్యూవల్ చేస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో రుణమాఫీ మొత్తం వస్తే రైతులకు కొద్దిపాటి ఉపశమనమైనా లభిస్తుంది.జిల్లాలో ఎనిమిది లక్షల మందికి గాను 5.15 లక్షల మంది  రైతులకు రుణ మాఫీ పత్రాలు మంజూరయ్యాయి. వీటిలో ఇంకా 30 శాతం వరకు రైతులకు చేరలేదు. వాస్తవానికి ఆధార్ కార్డులో ఏ చిరునామా ఉంటే ఆ  మండల వ్యవసాయ అధికారుల వద్దకు పత్రాలు చేరాయి. వీటిని ఇతర ప్రాంతాల్లో ఉంటున్న కొందరు రైతులు సకాలంలో తీసుకోలేకపోతున్నారు.
 
 పాతపద్ధతే మేలు
 గత సంవత్సరం మా ఖాతాలోకే రుణమాఫీ మొత్తం పడింది. దాంతో పాటు మరికొంత చెల్లించి పంట రుణం రెన్యూవల్ చేసుకున్నా. ఈ సారి  పత్రాలు ఇచ్చినారు. బ్యాంకోళ్లు.. ఇవి తీసుకోబోమని చెబుతున్నారు. తమకు ఎవరూ చెప్పలేదంటున్నారు. పాత పద్ధతిలో అకౌంట్లలోకి వేసి ఉంటే బాగుండేది. - కేశవరెడ్డి, తుమ్మల, దర్మవరం మండలం
 
 ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాం
 ప్రభుత్వం అందజేసిన రుణమాఫీ పత్రాలను తీసుకుని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని బ్యాంకర్లందరికీ చెప్పాం. పంట రుణాల రెన్యూవల్స్‌లో కొంత బిజీగా ఉన్నందున, సిబ్బంది కొరత కారణంగా కొన్ని బ్యాంకుల్లో  తీసుకోలేదని నా దృష్టికి వచ్చింది. అయినా మరొకసారి అందరికీ చెబుతాం.  రైతులను వెనక్కి పంపొద్దని ఆదేశిస్తాం. - జయశంకర్, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement