రుణమాయేనా..! | Pressure on banks to pay loans | Sakshi
Sakshi News home page

రుణమాయేనా..!

Published Sun, Jun 15 2014 2:44 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

రుణమాయేనా..! - Sakshi

రుణమాయేనా..!

  • ఎన్నికల ముందు రుణాలన్నీ రద్దు చేస్తామని టీడీపీ హామీ
  •  ఇప్పుడు కమిటీ, జీవోల పేరుతో కాలయాపన
  •  రుణాలు చెల్లించాలని బ్యాంకుల ఒత్తిడి
  •  బంగారం వేలానికి ప్రకటనలు
  •  ఖరీఫ్ ఖర్చుల కోసం అన్నదాతల ఎదురుచూపులు  
  • ‘నేను మారలేదు.. మీరు మారిపోతే నేరం నాది కాదు...’ అని ఓ సినీ కవి చెప్పినట్టుంది టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తీరు. రుణాలన్నీ మాఫీ చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన ఆయన..అధికారంలోకి వచ్చిన తర్వాత తన సహజ నైజాన్ని చాటుకున్నారు. కమిటీ, జీవోల పేరుతో కాలయాపన చేస్తున్నారు. రుణాలన్నీ రద్దవుతాయని ఆశగా ఎదురుచూస్తున్న అన్నదాతలకు బకాయిలు చెల్లించాలని బ్యాంకర్లు నోటీసులు పంపిస్తున్నారు. రుణాల కోసం తాకట్టుపెట్టిన బంగారంవేలం వేస్తున్నట్లు కొన్ని బ్యాంకులు ప్రకటించాయి. దీంతో ప్రస్తుత ఖరీఫ్ సాగు ఖర్చులకే అప్పుల కోసం ఎదురు చూస్తున్న రైతన్నలు... పాత బకాయిలు తీర్చేదెలా.. అంటూ ఆందోళనకు గురవుతున్నారు.
     
    మచిలీపట్నం :  ఎన్నికల ముందు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని, ఎవరూ రుణాలు చెల్లించవద్దని టీడీపీ ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మాటమార్చింది. కమిటీ పేరుతో కాలయాపన చేస్తోంది. రైతు రుణాలను రద్దు చేసేందుకు విధివిధానాలను ఖరారు చేయాలని జీవో నంబరు 31 విడుదల చేసింది. మరోవైపు రుణాలు చెల్లించాలని బ్యాంకులు రైతులకు నోటీసులు జారీచేస్తున్నాయి. జిల్లాలో సుమారు మూడు లక్షల మంది రైతులు బ్యాంకులకు రూ.9,137 కోట్లు బకాయిలు ఉన్నారు. రుణాలన్నీ రద్దు చేస్తారని ఆశపడుతున్న రైతులు... ఇప్పుడు షరతులు విధిస్తే తమ పరిస్థితి ఏమిటని ఆందోళనకు గురవుతున్నారు.
     
    రోజుకో ప్రకటనతో గందరగోళం..
     
    అధికారపక్షం రోజుకో రకం ప్రకటన చేస్తూ రైతులను గందరగోళానికి గురిచేస్తోంది. ఎన్నికల ముందు వ్యవసాయ రుణాలన్నింటినీ రద్దు చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు గురువారం విశాఖపట్నంలో విలేకరులతో మాట్లాడుతూ మహిళల పేరుతో బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాల వివరాలను సేకరిస్తామని చెప్పటం రైతుల్లో కలకలం రేపింది. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల్లో బంగారం తాకట్టుపెట్టి వ్యవసాయ రుణాలు తీసుకునేది తక్కువే. వాణిజ్య బ్యాంకుల్లో మాత్రమే ఈ విధంగా రుణాలు ఇస్తారు. అయితే వ్యవసాయ రుణాలు తీసుకునే మహిళల్లో 30 శాతం మందికి మాత్రమే వాణిజ్య బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో రుణమాఫీ హామీ నుంచి తప్పుకోవడానికే ఇటువంటి దొడ్డిదారులు వెతుకుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
     
    తెలంగాణలో ఒక విధంగా.. సీమాంధ్రలో మరో విధంగా..

    తెలంగాణలో లక్ష రూపాయల లోపు రుణాలను రద్దు చేస్తామని ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు హామీ ఇచ్చారు. బంగారం తాకట్టుపెట్టి పంట రుణాలు తీసుకుంటే రద్దు చేయబోమని ప్రకటించారు. దీంతో అక్కడి టీడీపీ నాయకులు అన్ని రకాల రుణాలు రద్దు చేయాలని, పంట రుణం చెల్లించలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే అందుకు కేసీఆర్ బాధ్యత వహించాలని వ్యాఖ్యానిస్తున్నారు.

    ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం వ్యవసాయ రుణాలమాఫీపై టీడీపీ ఇచ్చిన హామీకి భిన్నంగా జీవోను జారీ చేసినా ఆ పార్టీ నేతలు నోరుమెదపడం లేదు. గుంటూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తాను వ్యవసాయ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి రెండు రోజుల ముందు అన్ని రుణాలను రద్దు చేస్తామని ఓ టీవీ చానల్ నిర్వహించిన కార్యక్రమంలో ప్రకటించారు. ఆయన మంత్రిగా నియమితులైన తర్వాత... రుణాల రద్దుపై అధ్యయనం కోసం కమిటీ వేసినా, విధివిధానాల ఖరారు కోసం జీవో జారీ చేసినా స్పందించడం లేదు.
     
    ఖరీఫ్‌కు కష్టాలు తప్పవా..!
     
    ఈ నెల ఒకటో తేదీ నుంచి ఖరీఫీ సీజన్ ప్రారంభమైంది. వాతావరణం అనుకూలిస్తే నెలాఖరులోపు నారుమడులు, ఇతర పంటలు సాగు చేసేందుకు రైతులు సమాయత్తమవుతారు. జూన్, జూలై నెలల్లోనే రైతులు వ్యవసాయ రుణాలు అధికంగా తీసుకుంటారు. ఈ నేపథ్యంలో రుణమాఫీపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామని, ఈ నెల 22వ తేదీలోగా ప్రాథమిక నివేదిక వస్తుందని, అనంతరం పూర్తిస్థాయి నివేదిక అందుతుందని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించారు.

    ఈ చొప్పున రుణమాఫీపై ఆగస్టు మొదటి వారం వరకు స్పష్టత వచ్చే అవకాశం లేదు. నివేదికలు అందిన తర్వాత తాము ఎన్నిరోజుల్లో చర్యలు తీసుకుంటామనే దానిపైనా అధికార పక్షం స్పష్టమైన ప్రకటన చేయలేదు. గతంలో బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు చెల్లిం చకుంటే ఈ ఖరీఫ్ సీజన్ కోసం మళ్లీ కొత్త రుణాలు ఇస్తారా.. లేదా.. అనే అనుమానాలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. రుణమాఫీపై ప్రభుత్వం ఎలాంటి విధివిధానాలను తమకు పంపలేదని, ప్రభుత్వ నిర్ణయం కోసమే తాము ఎదురుచూస్తున్నామని పలు బ్యాంకుల అధికారులు చెబుతున్నారు.
     
    ఆత్మహత్యే శరణ్యం

    రెండు ఎకరాల్లో మిర్చి, ఒక ఎకరంలో పత్తి సాగు చేశాను. ఇందుకోసం పెద్దాపు రంలోని సహకార బ్యాంకులో రూ.12,600  ఒకసారి, మరోసారి 27,000 రుణం తీసుకున్నా. మొదటి రుణానికి వడ్డీతో కలిపి రూ.14,986, రెండోదానికి రూ.31,364 చెల్లించాలి నోటీసులు అందాయి. డబ్బు కట్టే పరిస్థితుల్లో లేను. రుణమాఫీ చేయకుండా.. అప్పు చెల్లించాలని ఒత్తిడి చేస్తే ఆత్మహత్యే శరణ్యం.
    - ఎస్.జగన్మోహన్‌రావు, పెద్దాపురం
     
     రోడ్డున పడతాం..

     నేను రెండు ఎకరాల పత్తి సాగు చేశాను. మరో మూడు ఎకరాలు కౌలుకు తీసుకున్నాను. పంట సాగు పెట్టుబడి కోసం ఇంట్లో ఉన్న బంగారం వస్తువులు తాకట్టు పెట్టి బ్యాంకులో రూ.75,000 వేలు తీసుకున్నాను. ఇప్పుడు వడ్డీతో రూ.83,504 చెల్లించాలని నోటీసులు పంపించారు. చంద్రబాబు ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోతే నా కుటుంబం రోడ్డున పడే పరిస్థితి నెలకొంది.
     - తాళ్ల నాగేశ్వరరావు, రైతు, పెద్దాపురం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement