స్త్రీవాద సాహిత్యానికి గుర్తింపు
స్త్రీవాద సాహిత్యానికి గుర్తింపు
Published Wed, Mar 12 2014 2:30 AM | Last Updated on Sat, Sep 2 2017 4:35 AM
సాక్షి, న్యూఢిల్లీ: సాహితీ రంగంలో స్త్రీ సాహిత్యం గొప్పతనాన్ని వివరిస్తూ రాసిన ‘సాహిత్య ఆకాశంలో సగం’ అనే పుస్తకానికి ప్రముఖ రచయిత్రి కాత్యాయనీ విద్మహే ప్రతిష్టాత్మకమైన కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారాన్ని అందుకున్నారు. కేంద్ర సాహిత్య అకాడెమీ 60 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఢిల్లీలో ‘ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్’ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వివిధ భాషలకు చెందిన 24 మంది సాహితీవేత్తలకు 2013 సంవత్సరానికిగాను సాహిత్య అకాడెమీ అవార్డులను ప్రదానం చేశారు. అవార్డుతోపాటు లక్ష రూపాయల నగదు బహుమతిని అందజేశారు. మంగళవారం సాయంత్రం ఢిల్లీలోని కమాని ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో సాహిత్య అకాడెమీ అధ్యక్షుడు డా. విశ్వనాథ్‌ప్రసాద్ తివారీ చేతుల మీదుగా కాత్యాయనీ విద్మహే ఈ అవార్డును అందుకున్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘ఈ అవార్డు ఆశించలేదు. ఊహించనూలేదు. నా పని నేను చేసుకుపోతున్నా. అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డు రావడం దేశవ్యాప్తంగా స్త్రీవాద సాహిత్యానికి గుర్తింపు లభించిందనుకుంటున్నా. దీనిలో కేవలం కాత్యాయనే లేదు. రంగనాయకమ్మతో సహా ఆంధ్రలో స్త్రీవాదం గురించి ఆలోచించే వారంతా ఉన్నారు. స్త్రీ సాహిత్యాన్ని ఎందుకు చదవాలన్న వివక్ష గతంలో ఉండేది. 1984 నుంచి 2009 వరకు సాహితీ రంగంలో మహిళా రచయితల అభ్యుదయం, వారి రచనలు తదితర అంశాలపై చేసిన పరిశోధనలకు 2010లో ‘సాహిత్య ఆకాశంలో సగం’ అనే పుస్తక రూపాన్నిచ్చాను.
ఇది రాయడం నా కర్తవ్యంగా భావించా’’ అని అన్నారు. డాక్టర్ విశ్వనాధ్ ప్రసాద్ మాట్లాడుతూ.. భారతీయ సాహిత్యాన్ని పెంపెందించేందుకు కృషి చేస్తున్న రచయితలకు సాహిత్య అకాడెమీ ఈ అవార్డులతో వందనాలు తెలుపుతుందని చెప్పారు. దేశంలో సాహిత్యాన్ని పెంపొందించేందుకు రచయితలు, తత్వవేత్తలు చేస్తున్న కృషి అభినందనీయమని సాహిత్య అకాడెమీ కార్యదర్శి కె.శ్రీనివాసరావు అన్నారు. అవార్డు అందుకున్న వారిలో ప్రముఖ రచయితలు జావెద్ అక్తర్ (ఉర్దూ), నవలా రచయిత మృదులా గార్గ్ సహా 24 భాషలకు చెందిన రచయితలు ఉన్నారు. అకాడెమీ నిర్వహిస్తున్న ‘ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్’ కార్యక్రమం ఈనెల 15 వరకు కొనసాగనుంది.
Advertisement