డీఈఈ శ్రీనివాస్ మెడకు బిగుసుకున్న ఉచ్చు | kimidi mrunalini serious on dee srinivas | Sakshi
Sakshi News home page

డీఈఈ శ్రీనివాస్ మెడకు బిగుసుకున్న ఉచ్చు

Published Sat, Aug 23 2014 2:47 AM | Last Updated on Sat, Sep 2 2017 12:17 PM

డీఈఈ శ్రీనివాస్ మెడకు బిగుసుకున్న ఉచ్చు

డీఈఈ శ్రీనివాస్ మెడకు బిగుసుకున్న ఉచ్చు

సాక్షి ప్రతినిధి, విజయనగరం : పంచాయతీరాజ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్‌కుమార్ మెడకు ఉచ్చు బిగుసుకుంది. ఆయన వ్యవహారంపై రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి కిమిడి మృణాళిని సీరియస్‌గా స్పందించారు. పాత తేదీతో జారీ చేసిన టెక్నికల్ అసిస్టెంట్ల కొనసాగింపు ఉత్తర్వులను రద్దు చేయాలని, ఉపయోగం లేని డీఈఈని సరెండర్ చేయాలని పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ ఇంజినీర్(ఎస్‌ఈ)ను ఆదేశించారు.

ఈ మేరకు ఆమె తరఫున ఎస్‌ఈకి ఓఎస్‌డీ ఎ.చంద్రశేఖరరావు ప్రత్యేక లేఖ రాశారు. డీఈఈ జారీ చేసిన టెక్నికల్ అసిస్టెంట్ల పొడిగింపు ఉత్తర్వులను జెడ్పీ చైర్‌పర్సన్ ఆదేశాలతో ఇప్పటికే ఎస్‌ఈ నిలిపేశారు. మరోవైపు జెడ్పీ సీఈఓ విచారణ వేగవం తం చేశారు. తప్పు జరిగిందని సంజాయిషీ ఇచ్చిన సెక్షన్ సూపరింటెండెంట్ జీవీ రత్నకుమార్‌తో పాటు అభియోగాలు ఎదుర్కొంటున్న డీఈఈ శ్రీనివాస్‌కుమార్‌పై విచారణ జరిపారు. స్టేట్‌మెంట్ కూడా రికార్డు చేయడంతో పాటు లిఖిత పూర్వకంగా వివరణ ఇవ్వాలని డీఈఈని కోరినట్టు తెలిసింది.
 
 చిచ్చురేపారనే...
 జెడ్పీ పాలకులకు డీఈఈ శ్రీనివాస్‌కుమార్ టార్గెట్‌గా మారారు. టీడీపీలో నాయకుల మధ్య చిచ్చు రేపారన్నదే కారణం. తమ పార్టీ ఎమ్మెల్యేల మద్దతుతో తమకే సవాల్ విసిరేలా వ్యవహరిస్తున్నారన్నదే వారి ఆగ్రహానికి కారణం. ఎమ్మెల్యేలను సంతృప్తి పరిచేందుకే రిలీవైన తర్వాత పాత తేదీలతో కొత్త పేర్లను చేర్చి టెక్నికల్ అసిస్టెంట్ కాల పరిమితి పొడిగింపు ఉత్తర్వులపై సంతకం చేశారన్నది జెడ్పీ చైర్‌పర్సన్ వర్గీయుల ఆరోపణ. ఎమ్మెల్యేలు తమను బైపాస్ చేసి శ్రీనివాస్‌కుమార్ ద్వారా పనులు  చక్కబెడతారా అన్నది మరో అక్కసు. ఆయన్ని ఇరుకున పెట్టి చర్యలు తీసుకోవడానికి కలెక్టర్ వేసిన విచారణే మంచి అవకాశమని భావించారు. అయితే ఇక్కడే ఆక్షేపణ వ్యక్తమవుతోంది. ఒకవేళ చర్యలు తీసుకోవాలంటే డీఈఈతో పాటు ఆ వ్యవహారంలో ప్రమేయం ఉన్న సెక్షన్ సూపరింటెండెంట్, జిల్లా మహిళా అభ్యుదయ సంక్షే మ సమాఖ్య ప్రతినిధిపైనా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
 
 లేదంటే ఇది కేవలం కక్ష సాధింపు చర్యగా మిగిలిపోతుందనే వాదనను  డీఈఈకి మద్దతుగా నిలిచిన టీడీపీ, అధికార వర్గాల వారు లేవనెత్తుతున్నారు.  గత ప్రభుత్వంలో కాంగ్రెస్ నేతలతో కలిసి హవా సాగించిన పంచాయతీరాజ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్‌కుమార్ వ్యవహార శైలిని ప్రస్తుత జెడ్పీ చైర్‌పర్సన్ వర్గం ఏమాత్రం సహించడం లేదు. కాంగ్రెస్ నేతల అండతో ఇష్టారీతిన వ్యవహరించారని, కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేల మద్దతుతో పాత పద్ధతిలో దందా కొనసాగుతున్నారని, అధికారం పోయినా కాంగ్రెస్ నాయకుల హవా శ్రీనివాస్ కారణంగా సాగుతోందని భావిస్తున్నారు. అందుకనే ఆయన్ని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఈఈ) ఇన్‌చార్జి బాధ్యతల నుంచి తప్పించారు.
 
 అయినా శ్రీనివాస్ కుమార్ జోక్యం తగ్గలేదని భావించిన జెడ్పీ పాలకులకు.. ఇంకా ఏం చేయాలా అనే ఆలోచించేసరికి అవుట్ సోర్సింగ్ టెక్నికల్ అసిస్టెంట్ కాల పరిమితి పొడిగింపు వ్యవహారం ఆయుధంగా దొరికింది. చర్యలు తీసుకోవడానికి మంచి అవకాశమని అభిప్రాయపడ్డారు. కాకపోతే ఆయనపై చర్యలు తీసుకోవాలంటే ముందుగా  ఆ ఫైలు నడిపిన సెక్షన్ సూపరింటెండెంట్‌ను బాధ్యుడ్ని చేయాల్సి వస్తుందన్న వాదన వినిపిస్తోంది. ఇప్పుడిదే జెడ్పీ చైర్‌పర్సన్ వర్గానికి ఇరకాటంగా తయారైంది. సెక్షన్ సూపరింటెండెంట్ రత్నకుమార్  లోగుట్టు విప్పడంతోనే వెనకటి తేదీ భాగోతం, కొత్త పేర్లు చేరిక వెలుగు చూసింది. నోటితో చెప్పిదానికన్న రాసిస్తే పకడ్బందీగా ఉంటుందని ఆయన చేత లిఖిత పూర్వక  సంజాయిషీ తీసుకున్నారు. దీనితో శ్రీనివాస్‌కుమార్‌ను ఆటాడించొచ్చని భావించారు.
 
 కానీ శ్రీనివాస్‌కుమార్ బలంగానే తన వాదన విన్పిస్తున్నారు. ఈఈ బాధ్యతల నుంచి రిలీవైన రోజున(ఈనెల12న) ఆ ఫైలుపై సంతకం పెట్టానని, సెక్షన్ సూపరింటెంటెండ్ చెప్పిన దాంట్లో వాస్తవం లేదని చెబుతున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయనపై తప్పనిసరిగా చర్య తీసుకోవాలంటే రత్నకుమార్ ఇచ్చిన సంజాయిషీని రుజువుగా పరిగణించాలి. దాన్ని ఆధారంగా చేసుకుంటే సూపరింటెండెంట్‌ను ఆ తప్పిదంలో భాగస్వామ్యమైనట్టుగా భావించాలి. అలాగే వెనకటి తేదీతో పాటు కొనసాగింపు జాబితాలో కొత్త పేర్ల చేరికపై డీఈఈ, సూపరింటెండెంట్‌తో పాటు జిల్లా మహిళా అభ్యుదయ సంక్షేమ సమాఖ్య ప్రతినిధిని నిందించాల్సిన పరిస్థితి నెలకొంది. అదే జరిగితే ముగ్గురిపైనా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.  
 
 ఎందుకంటే, కొత్త పేర్ల చేరికతో ఉన్న ఉత్తర్వులపై ముగ్గురి సంతకాలు ఉన్నాయి. ఏదేమైనా శ్రీనివాస్‌కుమార్‌ను జిల్లా నుంచి పంపించడం ఖాయంగా కన్పిస్తోంది. ఎందుకంటే, ఈ వ్యవహారంలో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి మృణాళిని అకస్మాత్తుగా స్పందించారు. దీనివెనుక కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు సూచనో, తన దృష్టికొచ్చిన తర్వాత చంద్రబాబు ఇచ్చిన ఆదేశాలో తెలియదుగాని డీఈఈ శ్రీనివాస్ కుమార్‌ను సరెండర్ చేయాలని తన ఓఎస్‌డీ చంద్రశేఖరరావు చేత పంచాయతీరాజ్ ఎస్‌ఈకి లేఖ రాయించారు. దీంతో డీఈఈ ఇక్కడి నుంచి వెళ్లక తప్పదనే వాదన విన్పిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement