
సాక్షి, చీపురుపల్లి: జిల్లాలో ఎన్నో నియోజకవర్గాలు ఉన్నప్పటికీ చీపురుపల్లి నియోజకవర్గానికి రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత ఉంది. జిల్లాలో జరిగే రాజకీయాలకు చీపురుపల్లి కేంద్ర బిందువుగా ఉంటోంది. ఎంతో కాలంగా ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ తాజా పరిస్థితుల్లో సైతం జిల్లాలో చీపురుపల్లి కోసం అత్యధికంగా చర్చ జరుగుతోంది. 80 శాతం తూర్పుకాపు సామాజిక వర్గం ఉన్న ఏకైక నియోజకవర్గంగా కూడా చెప్పుకోవచ్చు. 2004లో వైఎస్.రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక నియోజకవర్గంపై ఎంతో మక్కువ చూపించేవారు.
ఆయనకు ఎంతో సన్నిహితుడైన బొత్స సత్యనారాయణ ఎమ్మెల్యే కావడంతో నియోజకవర్గ అభివృద్ధికి మహానేత ఎంతో సహాయ సహకారాలు అందించేవారు. అందులో భాగంగానే 2004 నుంచి 2009 వరకు నియోజకవర్గం అభివృద్ధి విషయంలో పరుగులు తీసింది. దీంతో పులివెందుల, కుప్పం నియోజకవర్గాల సరసన చీపురుపల్లి కూడా చేరిందని అప్పట్లో చెప్పుకునేవారు. మహానేత వైఎస్సార్ మరణానంతరం స్థానిక ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కూడా పని చేశారు. దీంతో నియోజకవర్గం పేరు మరింత మార్మోగిపోయింది. 1952లో నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇంతవరకు 14 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 2019లో 15వ సారి ఎన్నికలు జరుగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment