chipurupalli
-
‘నా టికెట్‌ను తన్నుకుపోయారు’.. కిమిడి నాగార్జున కన్నీళ్లు
సాక్షి, విజయనగరం: చీపురుపల్లి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు భగ్గుమంటున్నాయి. చీపురుపల్లి టికెట్ ఆశించి కిమిడి నాగార్జున భంగపడ్డారు. పెద్దనాన్న కళా వెంకట్రావుకు చాలా అవకాశాలు ఉన్నాయని.. అయిన సరే తన టికెట్‌ను తన్నుకుపోయారంటూ చీపురుపల్లి క్యాడర్ వద్ద కన్నీటి పర్యంతం అయ్యారు. తన జీవితం చెడిందని.. యువత ఎవరూ రాజకీయాల్లోకి రావద్దంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు మాటలు నమ్మి విదేశాల్లో ఉద్యోగం వదులుకొని వచ్చేసి 2019 ఎన్నికల్లో పోటీచేసిన కళా వెంకటరావు సోదరుడి కుమారుడు నాగార్జునకు ఓటమి తప్పలేదు. ఆ ఎన్నికల్లో టీడీపీ ఉమ్మడి విజయనగరం జిల్లాలో తుడిచిపెట్టుకుపోయింది. అలాంటి పరిస్థితుల్లో జిల్లాలో పార్టీ బాధ్యతలు తీసుకోవడానికి సీనియర్ నాయకుడు అశోక్ గజపతిరాజు సహా ఎవ్వరూ ముందుకురాన్నప్పుడు నాగార్జున భుజానికెత్తుకున్నారు. ఐదేళ్లూ అడపాదడపా కార్యక్రమాలతో టీడీపీ ఉనికి చాటుతూ వచ్చారు. ఈసారి చీపురుపల్లి నుంచి పోటీచేయాలని ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ చంద్రబాబు ఆయన్ను కరివేపాకులా తీసిపడేశారు. తనను నమ్మించి గొంతు కోశారని, నిలువునా మోసం చేశారని నాగార్జున లబోదిబోమంటున్నారు. -
టీడీపీలో ప్రకంపనలు.. కిమిడి నాగార్జున రాజీనామా
సాక్షి, విజయనగరం జిల్లా: చీపురుపల్లి టికెట్ కళా వెంకట్రావుకు కేటాయించడంపై విజయనగరం టీడీపీలో ప్రకంపనలు రేగుతున్నాయి. చీపురుపల్లి టికెట్ రాకపోవడం పట్ల మనస్తాపం చెందిన విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున పార్టీకి రాజీనామా చేశారు. పెద్ద నాన్న కళావెంకట్రావుకి సహకరించేది లేదని ప్రకటించారు. చీపురుపల్లి టీడీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ కరపత్రాలు, పోస్టర్లను కార్యకర్తలు దహనం చేశారు. బాబు, లోకేష్ అచ్చెన్నాయుడు మోసగాళ్లంటూ నినాదాలు చేశారు. పార్టీని నమ్ముకున్న వారికి టికెట్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కళా వెంకట్రావుకు సహకరించేది లేదని టీడీపీ శ్రేణులు చెబుతున్నారు. -
కళా వెంకటరావు మెడకు చీపురుపల్లి గంట
అటు తిరిగి ఇటు తిరిగి కిమిడి కళా వెంకటరావు పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. చీపురుపల్లి నుంచి పోటీ చేయమని ఆయన్ను పార్టీ సూచించినట్లు సమాచారం. ఎచ్చెర్లలో పార్టీ శ్రేణులు కళాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు ఈ ప్రతిపాదన చేసినట్లు తెలిసింది. వాస్తవానికి ‘కళా’ను చీపురుపల్లి అసెంబ్లీకి పోటీ చేయాలని పార్టీ అధినేత మొదట్లోనే సూచించారు. కానీ ‘కళా’ అంగీకరించలేదు. విశాఖకు చెందిన గంటా శ్రీనివాసరావును చీపురుపల్లి పంపించి పోటీ చేయించాలని అనుకున్నారు. ఆయన కూడా అంగీకరించకపోవడంతో అక్కడ మంత్రి బొత్సపై పోటీకి సరైన అభ్యర్థి దొరకలేదు. దాంతో మళ్లీ కళా మెడలో గంట కట్టే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ విస్తృత బంధువర్గం, పరిచయాలు ఉన్న సీనియర్ నేత అయిన కళా అయితేనే బొత్సకు కొంత పోటీ ఇవ్వగలరన్నది చంద్రబాబు ఆలోచన. అదే సమయంలో ఎచ్చెర్లలో పంచాయితీని కూడా పరిష్కారం సాధించినట్లు అవుతుందని భావిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఎచ్చెర్లలో స్వపక్షంలోనే వ్యతిరేకతను ఎదుర్కొంటున్న టీడీపీ నేత కిమిడి కళా వెంకటరావును నియోజకవర్గం మార్చే యోచనలో చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక్కడ కాకుండా చీపురుపల్లి నియోజకవర్గంలో బరిలో దించితే ఎలా ఉంటుందనేదానిపై ఐవీఆర్ఎస్ సర్వే కూడా చేయించారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును చీపురుపల్లి నుంచి పోటీ చేయించాలని చూసినా ఆయన ససేమిరా అనడంతో ప్రత్యామ్నాయంగా కళా వెంకటరావుపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఐవీఆర్ఎస్ సర్వే ప్రకారం కళాను బరిలో దించుతారా? లేదంటే అక్కడా సానుకూలత లేదని పక్కన పెట్టేస్తారా? అంత రిస్క్ చేయడమెందుకని ఓడిపోయే సీట్లలో ఎవరు పోటీ చేస్తే ఏముందని ఎచ్చెర్లకే వదిలేస్తారా? అన్నది ప్రస్తుతం టీడీపీలోనే చర్చనీయాంశంగా మారింది. గ్రూపుల గోల..! ఎచ్చెర్లలో టీడీపీ బలహీనంగా ఉంది. గత ఐదేళ్లలో ఆ పార్టీ ఏమాత్రం బలపడలేదు. సరికదా గ్రూపులుగా తయారై టీడీపీ శ్రేణులు విడిపోయి మరింత పట్టుకోల్పోయారు. గత ఎన్నికల్లో ఓటమి పాలైన దగ్గరి నుంచి ఇక్కడ వర్గపోరు నడుస్తోంది. మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావు ఒకవైపు, ఏఎంసీ మాజీ చైర్మన్ కలిశెట్టి అప్పలనాయుడు మరోవైపు గ్రూపుగా తయారై రాజకీయాలు చేస్తున్నారు. గుడ్డిలో మెల్ల అన్నట్టుగా ఎవరికి వారు బల ప్రదర్శన చేసుకుంటున్నారు. ఎన్నాళ్లు కళా వెంకటరావు పల్లకిమోస్తామని, ఈ సారి కలిశెట్టికి టికెట్ ఇవ్వాల్సిందేనని కొన్నాళ్లుగా టీడీపీలో ఓ గ్రూపు పట్టుబడుతూ వస్తోంది. చెప్పాలంటే కళా వెంకటరావుకు వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తోంది. చౌదరి బాబ్జీ తదితర నాయకులు సైతం కళా వెంకటరావుతో తాము వేగలేమని.. అణగదొక్కే రాజకీయాలు ఇంకెంత కాలమని స్వరం విన్పిస్తున్నారు. అనుకున్నట్టుగా చివరికొచ్చేసరికి కళాతో పోటీగా కలిశెట్టి రేసులో నిలబడ్డారు. ఇప్పుడు ఎవరికి టికెట్ ఇస్తారన్నదానిపై సస్పెన్స్ నెలకొంది. రకరకాల సర్వేలు.. పొత్తులో భాగంగా బీజేపీకి ఇచ్చేస్తే సమస్యే లేదని ఒకవైపు ఆలోచిస్తుండగానే మరోవైపు కళా, కలిశెట్టిలో ఎవరి బెస్ట్ అన్నదానిపై ఐవీఆర్ఎస్తో పాటు రకరకాల సర్వేలను చంద్రబాబు చేయించారు. కొన్నింటిలో కలిశెట్టికి సానుకూలత రాగా, మరికొన్నింటిలో కళాకు అనుకూలంగా వచ్చినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో చీపురుపల్లి నియోజకవర్గం ఆ పార్టీకి గుదిబండగా తయారైంది. మంత్రి బొత్స సత్యనారాయణను ఢీకొట్టే నాయకత్వం అక్కడ లేకపోవడంతో చంద్రబాబు రకారకాల ఆలోచనలు చేస్తున్నారు. తరుచూ నియోజకవర్గాలు మార్చి ఎన్నికల్లో గట్టెక్కుతున్న గంటా శ్రీనివాసరావును అక్కడ బరిలో దించాలని చూసింది. పార్టీకి సమస్యగా మారిన గంటాను ఈ రకంగానైనా వదిలించుకోవాలని చంద్రబాబు అండ్‌కో చూస్తోంది. దానిలో భాగంగా ఓడి పోయిన సీట్లలో గంటాను పోటీ చేయిస్తే పీడ విరగడయిపోతుందని భావించారు. కానీ, గంటా దాని కి ససేమిరా అంటున్నారు. బొత్సతో పోటీ చేయలేనని చెప్పేస్తున్నారు. ఓడిపోయి పరువు పోగొట్టుకోవడం కంటే పోటీ చేయకపోవడమే మంచిదన్న ఆలోచనకొచ్చి తన మనసులో మాటను అధిష్టానానికి చేప్పేశారు. కాకపోతే, పైరవీలు, లాబీయింగ్ చేసే గంటా తనదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో గంటా పోటీ చేసే సీటుపై ఆ పార్టీ అధిష్టానం పునరాలోచనలో పడింది. ఈ క్రమంలో చీపురుపల్లి నుంచి కిమిడి కళా వెంకటరావును పోటీ చేయిస్తే ఎలా ఉంటుందనేదానిపై ఆలోచన చేస్తోంది. ఇప్పటికే ఐవీఆర్ఎస్ సర్వే కూడా చేయించింది. ఎచ్చెర్లలో ఎలాగూ కష్టం.. చీపురుపల్లిలో కనీసం పోటీ అయినా ఇచ్చి బొత్సతో ఢీకొనాలని చూస్తోంది. అందులో భాగంగానే చీపురుపల్లికి కళా వెంకటరావును పంపిస్తారని ఇప్పటికే ఎచ్చెర్ల నియోజకవర్గ టీడీపీ శ్రేణులకు సమాచారం వచ్చింది. బీజేపీకి ఎచ్చెర్ల ఇచ్చేస్తే.. సీనియర్‌కు కనీసం చీపురుపల్లిలోనైనా సీటు ఇచ్చి గౌరవం ఇచ్చామని చెప్పుకునేలా టీడీపీ అడుగులు వేస్తోంది. ఈ సమీకరణాలు చివరి వరకు నడుస్తాయా? లేదంటే ఆఖరి నిమిషంలో మారుతాయో తెలియదు గానీ ప్రస్తుతం చీపురుపల్లికి కళాను పంపించాలని చంద్రబాబు భావిస్తున్నట్టుగా సమాచారం. -
వల్లనోరిమామా నేనెళ్లను.. చీపురుపల్లి పోనంటున్న తమ్ముళ్లు
పిచ్చి కాకపొతే.. పోయిపోయి మైక్ టైసన్‌తో పోరాడాలని ఎవరనుకుంటారు.. హుస్సేన్ బోల్ట్‌తో పరుగెత్తాలని ఎందుకనుకుంటారు. షార్క్‌తో సెల్ఫీ దిగాలని ఎందుకనుకుంటారు. అలాగే రాజకీయంగా చూస్తే కొన్ని కొన్ని నియోజకవర్గాల జోలికి పోకూడదని కూడా అనుకుంటారు.. వాటిల్లో చీపురుపల్లి ఒకటి. ఇక్కణ్ణుంచి వైయస్సార్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మంత్రి బొత్స ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈపాలి ఆయన్ను ఎలాగైనా ఓడించాలని చంద్రబాబు కూడా శతథా ప్రయత్నిస్తున్నారు. వాస్తవానికి ఇక్కడ 2014 లో గెలిచిన కిమిడి మృణాళిని అప్పటి టీడీపీ ప్రభుత్వంలో కొన్నాళ్ళు మంత్రిగా చేసారు అయితే ఆ తరువాత 2019 లో ఆవిడకు బదులుగా కొడుకు నాగార్జునను రంగంలోకి దించారు కానీ సత్తిబాబు ఎత్తులు... అనుభవం... వీటిముందు నాగార్జున నిలవలేదు. ఓడిపోయారు.. ఈసారి కూడా మళ్ళీ అక్కడ పోటీ చేసేందుకు నాగార్జున ప్రయత్నాలు చేస్తున్నారు.. స్థానికంగానే ఉంటూ పదిమందినీ కలుస్తూ గతంలో ఓడిపోయినా సానుభూతి మిక్స్ చేసి గెలుద్దాం అని ఆశిస్తున్నారు. అయితే ఈ తరుణంలో విశాఖకు చెందిన గంటా శ్రీనివాసుని చీపురుపల్లిలో దించుతారని లీకులొచ్చాయి. ఒక్కో ఎన్నికకు ఒక్కో నియోజకవర్గం మారే గంటా ఈసారి ఏకంగా జిల్లా క్రాస్ చేసేసి విజయనగరం వచ్చి బొత్స మీద పోటీ చేస్తారని అన్నారు.. గంటా కూడా తక్కువైనోడు కాదు.. పక్కా గెలుపు అనిపిస్తేనే నియోజకవర్గం మారతాడు తప్ప ఇలా సింహానికి ఎదురెళ్లే రకం కాదు. సేఫ్ గేమ్ ఆడతాడు తప్ప ప్రయోగాలు చేసేందుకు ఏమాత్రం సిద్ధపడని రకం అయన. అలాంటి వ్యక్తి బొత్సకు ఎదురెళ్లి ఓటమిని కొనితెచ్చుకోవాలాలని ఎందుకు అనుకుంటాడు. అందుకే నేను రానుగాకరాను అనేశాడు... దీంతో రెండో కృష్ణుడు ఎవరబ్బా అని చూస్తే సీనియర్ నాయకుడు కిమిడి కళా వెంకట్రావు కనిపించారు.. ఆయన్ను పెద్దాయన మీరైతేనే బొత్సను ఓడిస్తారు.. చీపురుపల్లి వెళ్ళండి అన్నారట చంద్రబాబు.. దీనికి ఆ పెద్దాయన...' బాబుగారు నాకు టిక్కెట్ ఇవ్వకుంటే మానేయండి అంతేకానీ బొత్సకు ఎదురుగా పోటీ చేయమని చెప్పకండి.. ఎందుకంటే ఈ వయసులో నేను చికెన్ షాప్ ముందు తొడగొట్టలేను సారీ అని తప్పుకున్నట్లు చెబుతున్నారు. అలా ఇలా కాదని ఇంకో కాపు అభ్యర్థిని తెరముందుకు తెచ్చిన చంద్రబాబు ఆమెను సైతం చీపురుపల్లి వెళ్లాలని కోరారట. 2014 లో విజయనగరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మీసాల గీతకు చీపురుపల్లి టిక్కెట్ ఇస్తాను... వెళ్లి బొత్స మీద పోటీ చేయండి అన్నారట.. గంటా, కళా వంటి పెద్దలే పారిపోతుంటే నేనెళ్ళి ఎందుకు ఓటమిని మోయాలి అంటూ ఆబ్బె.. నాకు వద్దండి... అది తప్ప ఇంకేదైనా ఇవ్వండి అని గీత కూడా చంద్రబాబు దగ్గర కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు చీపురుపల్లికి టీడీపీ అభ్యర్థి దొరకడం లేదట.. ఖర్చులు మొత్తం పార్టీ తరఫున పెట్టుకుంటాం.. పోటీ చేయండి అంటున్నా ఎవరూ రావడం లేదని టీడీపీ వర్గాలు బావురుమంటున్నాయి. ::: సిమ్మాదిరప్పన్న -
కన్నవారిని కలిపిన ఫేస్బుక్
పాతపట్నం (శ్రీకాకుళం): నాలుగేళ్ల వయసులో తప్పిపోయి అమ్మానాన్నలకు దూరమైంది. చిన్ననాటి జ్ఞాపకాలను పదిలపర్చుకుని.. పదమూడేళ్ల అనంతరం వారి జాడ తెలుసుకుంది. కన్నవారిని కలుసుకోబోతున్నాననే ఆనందం ఒకవైపు.. 13 ఏళ్లపాటు సొంత బిడ్డలా పెంచి.. చదువు చెప్పించిన తల్లి దూరమవుతోందనే బాధ మరోవైపు ఆమెను చుట్టుముట్టాయి. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం చీపురుపల్లి గ్రామానికి చెందిన కోడిపెంట్ల మాధవరావు, వరలక్ష్మి దంపతులు బతుకుదెరువు కోసం 14 ఏళ్ల క్రితం హైదరాబాద్ వెళ్లారు. ఆ దంపతులకు ముగ్గురు సంతానం. మాధవరావు, వరలక్ష్మి దంపతులు 2006 నవంబర్‌లో ముగ్గురు బిడ్డల్ని ఇంటివద్దే ఉంచి కూలి పనులకు వెళ్లారు. వారి కుమార్తె భవానీ తన అన్నయ్యలు సంతోష్, గోపీతో ఆడుకుంటూ తప్పిపోయింది. రోడ్డుపై బిక్కుబిక్కుమంటూ రోదిస్తున్న భవానీని జయరాణి (జయమ్మ) అనే మహిళ చేరదీసి ఆమె తల్లిదండ్రుల కోసం చుట్టుపక్కల వాకబు చేసింది. ఫలితం లేకపోవడంతో అప్పట్లోనే సనత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసి.. భవానీ సంబంధీకులు వచ్చేవరకు ఆమెను తానే సాకేందుకు ముందుకొచ్చింది. భవానీని పెంచి ఇంటర్మీడియెట్ వరకు చదివించింది. భవానీకి ప్రస్తుతం 17 ఏళ్లు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన జయరాణి (జయమ్మ) గతంలో హైదరాబాద్‌లో ఉంటూ అక్కడి ఇళ్లల్లో పని చేస్తుండేది. కొంతకాలం క్రితం కుటుంబ సభ్యులు, భవానీతో కలిసి విజయవాడ వచ్చి ఇళ్లల్లో పని చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. తాను పని చేస్తున్న ఇంట్లోనే భవానీని కూడా పనిలో పెట్టాలనే ఉద్దేశంతో ఇంటి యజమాని వంశీ, భార్య కృష్ణకుమారి వద్దకు భవానీని తీసుకెళ్లింది. భవానీ వివరాలను ఇంటి యజమాని వంశీ ఆరా తీశారు. తాను చిన్నతనంలోనే తప్పిపోయానని తెలిపిన భవానీ తల్లిదండ్రుల పేర్లు, అన్నల పేర్లను, గుర్తున్న చిన్ననాటి సంగతులను చెప్పింది. ఆ వివరాలను, భవానీ ఫొటోను వంశీ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. శనివారం ఆ పోస్ట్‌ను చూసిన భవానీ అన్న.. వంశీకి వీడియో కాల్ చేశాడు. అన్నయ్యను భవానీ గుర్తు పట్టింది. ఆ తరువాత ఆమె తల్లిదండ్రులు కూడా భవానీతో వీడియో కాల్ మాట్లాడారు. కుమార్తెను తీసుకెళ్లడానికి చీపురుపల్లి నుంచి తల్లిదండ్రులు మాధవరావు, వరలక్ష్మి, సోదరులు సంతోష్, గోపీ విజయవాడ బయలుదేరారు. ఇదిలావుంటే.. గతంలో హైదరాబాద్‌లో జీవనోపాధి పొందిన భవానీ తల్లిదండ్రులు ప్రస్తుతం చీపురుపల్లిలోనే ఉంటున్నారు. తమ బిడ్డ ఆచూకీ తెలిసి భవానీ తల్లిదండ్రులు ఆనంద డోలికల్లో తేలియాడుతున్నారు. ఇంత కాలం తల్లిగా మారి భవానీని కంటికి రెప్పలా చూసుకుంటూ చదువు చెప్పించిన జయమ్మకు రుణపడి ఉంటామని చెప్పారు. ఇన్నాళ్లకు భవానీ అమ్మా నాన్నలకు దగ్గరవుతుండటంతో చీపురుపల్లి గ్రామమంతా సంతోషం వ్యక్తం చేసింది. -
విషాదం: మామ, అల్లుడి మృతి
సాక్షి, చీపురుపల్లి(శ్రీకాకుళం): అప్పుడే తెల్లవారింది. అసలే ఆదివారం. సాధారణంగా మాంసాహార ప్రియుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అదే ఆశతో చికెన్ సెంటర్ నడుపుతున్న ఆ ఇద్దరు మామా అల్లుళ్లు ఉదయాన్నే దుకాణం తెరిచారు. బేరం బాగుంటుందనీ... సాయంత్రం కాస్తంత కాసులతో ఇంటికెళ్తామని ఆశించారు. కానీ వారు ఇంటి నుంచి వెళ్లిన కొద్ది గంటల్లోనే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారన్న వార్త ఆ రెండు కుటుంబాలను హతాశులను చేసింది. పట్టణంలోని మెయిన్రోడ్లో గల మండల పరిషత్ కార్యాలయం ఎదురుగా దశాబ్దాల క్రితం నుంచి షేక్ బాషా చికెన్ సెంటర్ ఉంది. దాని యజమాని షేక్ బాషా(45), ఆయన అల్లుడు షేక్ సైదు(28) ఉదయం 5 గంటలకే చికెన్ సెంటర్‌కు వచ్చి వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించారు. 7 గంటల సమయంలో షేక్ సైదు కోళ్లను డ్రసింగ్ చేసేందుకు సంబంధిత మెషీన్లో వేశాడు. ఇంతలోనే విద్యుత్ షాక్ తగలడంతో ఆ మెషిన్‌కు చెందిన డ్రమ్‌తో బాటు సైదు ఎగిరిపడ్డాడు. ఆ శబ్దం విన్న మామ బాషా అల్లుడిని పట్టుకున్నాడు. అప్పటికే విద్యుత్ షాక్ తగిలి ఉన్న సైదుతో బాటు బాషా కూడా అక్కడికక్కడే క్షణాల్లో మృతి చెందారు. పట్టణంలో కలకలం పట్టణంలో పేరు మోసిన చికెన్ సెంటర్ కావడంతో ఎప్పటి మాదిరిగానే దుకాణంలో ఎక్కువ రద్దీ ఉంది. ఉదయాన్నే కొనుగోలుదారులతో సందడిగా ఉంది. ఇంతలో జరిగిన ఈ హఠాత్పరిణామంతో అక్కడున్నవారంతా దిగ్భ్రాంతి చెందారు. కలలా జరిగిన ఈ సంఘటనతో వారంతా కలవరపడ్డారు. దాదాపు పాతికేళ్లుగా ఆ మార్కెట్‌తో బాషాకు అనుబంధం ఉంది. ఇన్నేళ్లుగా అందరి ఆదరణ చూరగొన్న ఆయన తన అల్లుడితో సహా కన్నుమూయడంతో పట్టణంలో విషాదం అలముకుంది. సమాచారం అందుకున్న ఎస్ఐ దుర్గాప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనాథలైన రెండు కుటుంబాలు హడ్కోకాలనీకి చెందిన షేక్ బాషా పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం ఎదురుగా చికెన్ సెంటర్ నడుపుతున్నాడు. ఆయనకు భార్య అమ్మాజీతో బాటు గోరీ, పీరు, మహీదా అనే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కూతురు గోరీకి శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటకు చెందిన షేక్ సైదాతో నాలుగేళ్ల క్రితం వివాహం చేశాడు. బాషాకు మగ పిల్లలు లేకపోవడంతో అల్లుడు సైదాను నరసన్నపేట నుంచి చీపురుపల్లి తీసుకొచ్చాడు. తన వ్యాపారంతో బాటు కుటుంబాలను చూసుకునేందుకు తోడుగా ఉంటాడని భావించాడు. తానుంటున్న వీధిలోనే వేరే ఇంట్లో కూతురితో కాపురం పెట్టించారు. తన కుటుంబానికి ఎప్పటికైనా ఆసరాగా నిలుస్తాడని భావించాడు. కానీ విధి వక్రీకరించింది. విద్యుత్‌షాక్ రూపంలో వారి కలలను కల్లలు చేసింది. ఈ సంఘటనతో మగదిక్కు కోల్పోయిన ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. బాసటగా నిలిచిన వైఎస్సార్సీపీ నాయకులు.... చికెన్ సెంటర్లో విద్యుత్ షాక్‌తో ఇద్దరు మృతి చెందిన సంఘటన తెలుసుకున్న వైఎస్సార్సీపీ నాయకులు ఆ కుటుంబాలకు బాసటగా నిలిచారు. మృతుడు షేక్ బాషాకూడా పార్టీ సానుభూతిపరుడు కావడం... ముస్లిం వర్గానికి నాయకత్వం వహిస్తుండటంతో పార్టీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావుతో బాటు ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. పార్టీ మండల నాయకులు ఇప్పిలి అనంతం, వలిరెడ్డి శ్రీనివాసనాయుడు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ప్రభుత్వాస్పత్రికి తరలించే ఏర్పాటు చేశారు. ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ప్రభుత్వాస్పత్రి వద్ద మృతదేహాలను సందర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. -
20 ఏళ్లకు పట్టుబడిన మాయ‘లేడి’
సాక్షి, చీపురుపల్లి: రెండు దశాబ్దాల క్రితం ఆ మాయ‘లేడీ’ ఓ బాలుడిని అపహరించింది. ఆ తరువాత ప్రాంతాలు మారుస్తూ మనుషుల్ని ఏమార్చడమే వృత్తిగా మార్చుకుంది. ఇటీవల జియ్యమ్మవలస పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తికి వలవేసి అతడి ఇంట్లో చేరింది. ఆ ఇంట్లోని బంగారమంతా మూటగట్టుకుని ఉడాయించబోతుండగా.. స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించడంతో పాత కేసు వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మంకు చెందిన సుంకరి భాగ్యలక్ష్మి అనే మహిళ 20 ఏళ్ల క్రితం విజయనగరం జిల్లా వంగపల్లిపేటలో అద్దె ఇంట్లో నివాసం ఉండేది. అదే గ్రామానికి చెందిన మండల సూర్యారావు, పెంటమ్మ దంపతుల నాలుగేళ్ల కుమారుడు శంకరరావును 1998 మార్చి 8న కిడ్నాప్ చేసింది. ఆ ఇంట్లోంచి రూ.15 వేల నగదు, ఆరున్నర తులాల బంగారాన్ని కూడా అపహరించుకుపోయింది. అప్పట్లో బాలుడి తల్లిదండ్రులు చీపురుపల్లి పోలీసులను ఆశ్రయించగా.. ఏళ్ల తరబడి విచారణ జరిపినా ఆ మహిళతోపాటు బాలుడి ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో కేసును మూసేశారు. 20 ఏళ్ల తరువాత అనూహ్యంగా జియ్యమ్మవలసలో పట్టుబడిన ఆమెను హెడ్ కానిస్టేబుల్ లోపింటి రామకృష్ణ గుర్తించడంతో కిడ్నాప్ కేసు వెలుగులోకి వచ్చింది. విశేషం ఏమంటే.. బాలుడు కిడ్నాపైన సందర్భంలో రామకృష్ణ చీపురుపల్లి స్టేషన్లో కానిస్టేబుల్‌గా పని చేస్తుండేవారు. బాలుడి ఆచూకీ కోసం గాలించిన బృందంలో అతడు పనిచేశారు. స్పష్టత లేని సమాధానాలిస్తున్న నిందితురాలు బాలుడిని కిడ్నాప్ చేసింది తానేనని, 16 సంవత్సరాల వరకు మాత్రమే తనతో ఉన్నాడని నిందితురాలు భాగ్యలక్ష్మి చెబుతోంది. ఎక్కడున్నాడో తెలియదని ఒకసారి, హైదరాబాద్‌లో తన బావ దగ్గర ఉన్నాడని మరోసారి చెబుతోంది. ఇదిలావుంటే.. 20 ఏళ్లుగా తమ బిడ్డ కోసం ఎదురు చూస్తున్నామని.. ఇప్పుడైనా తమ బిడ్డ ఆచూకీ కనిపెట్టాలని తల్లి పెంటమ్మ వేడుకుంటోంది. కేసును తిరిగి తెరిచేందుకు కోర్టును ఆశ్రయించామని, త్వరలోనే బాలుడి ఆచూకీ కనిపెడతామని చీపురుపల్లి సీఐ సీహెచ్.రాజులునాయుడు చెప్పారు. -
దుకాణంలో దొంగలు.!
సాక్షిప్రతినిధి, విజయనగరం: వ్యాపారులకు మంచి జరగాలి.. పంచాయతీకి ఆదాయం రావాలన్న సదుద్దేశంతో పంచాయతీ, వ్యాపారుల భాగస్వామ్యంతో నిర్మించిన దుకాణాలపై టీడీపీ నేతల కన్ను పడింది. అధికారాన్ని అడ్డంగా పెట్టుకుని దుకా ణాలను తమ చేతుల్లోకి తీసుకున్నారు. కోట్ల రూపాయల పంచాయతీ ఆదాయానికి గండికొ డుతున్నారు. తక్కువ అద్దెలు చెల్లిస్తూ ప్రశ్నించే వారిపై దౌర్జన్యం చేస్తున్నారు. ప్రభుత్వం మారిన తర్వాతైనా వారిలో మార్పువచ్చిందా అంటే అదీ లేదు. న్యాయస్థానం ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఇంజక్షన్ ఆర్డర్ ఉన్న దుకాణాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారు. అధికారంలో ఉన్నన్నాళ్లూ ఇదే చీపురుపల్లిలో అనేక అక్రమాలకు పాల్పడిన టీడీపీ నేతలు నేటికీ అదే ధోరణిని కొనసాగి స్తుండడాన్ని చూసి జనం విస్తుపోతున్నారు. అయితే, దుకాణాలకు బహిరంగ వేలం నిర్వహించడం ద్వారా పంచాయతీకి ఆదాయం చేకూర్చవచ్చని ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ జిల్లా కలెక్టర్ హరిజవహర్‌లాల్‌కు సూచించారు. ఇదీ కథ... చిరువ్యాపారుల సంక్షేమం దృష్ట్యా చీపురుపల్లి పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్, మెయిన్ రోడ్డును ఆనుకుని ఉన్న పయంచాయతీ స్థలంలో 26 దుకాణాల నిర్మాణానికి 2009లో అప్పటి కాంగ్రెస్ పాలకులు ప్రణాళికలు వేశారు. దుకాణాల నిర్మాణానికి చిరు వ్యాపారుల నుంచి కొంత వరకు నిధులు సమీకరించి ఆ డబ్బుతో దుకాణాలను నిర్మించారు. సాధారణ అద్దె నిర్ణయించి ఏడు సంవత్సరాలు లీజుకు దుకాణాలను కేటాయించారు. తరువాత 2016లో పంచాయతీ తిరిగి ఆ దుకాణాలను తీసుకుని బహిరంగ వేలం నిర్వహించాల్సి ఉంది. అప్పటికి టీడీపీ అధికారంలో ఉండడంతో రెండేళ్లు తాత్సారం చేసింది. 2018లో స్థానిక టీడీపీ నాయకులు అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి బహిరంగ వేలం లేకుండా 30 శాతం అద్దెలను పెంచుతూ తమ వర్గీయులకు దుకాణాలను కేటాయించుకున్నారు. ఆ సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడొకరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో కోర్టు ‘ఇంజక్షన్ ఆర్డర్’ను ఇచ్చింది. దుకాణాలను బహిరంగ వేలం నిర్వహించకుండా టీడీపీ పాలకులు తమ అనుయాయులకు, ఇష్టులకు తక్కువ అద్దెలకు దుకాణాలను కట్టబెట్టి మొదటి నుంచీ ఉన్న వారికి దుకాణాలు కేటాయించకుండా అన్యా యం చేశారు. అలా అన్యామైపోయిన వారిలో కోర్టును ఆశ్రయించిన వైఎస్సార్సీపీ నాయకుడు ఒకరు. అయితే, కోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ మెయిన్ రోడ్డులో వైఎస్సార్ సీపీ నాయకుడికి చెందిన దుకాణానికి టీడీపీ మాజీ జెడ్పీటీసీ వర్గీయులు సోమవారం దౌర్జన్యంగా తాళం వేశారు. ఇదేమిటని అడిగిన వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువార్గాల వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అద్దెల లెక్క ఇలా... ప్రస్తుతం ఒక్కో దుకాణం నుంచి రూ.2వేల నుంచి రూ.2,800 వరకు మాత్రమే పంచాయతీకి అద్దెలు వస్తున్నాయి. కానీ అక్కడ మార్కెట్లో మాత్రం ఒక్కొక్క దుకాణానికి రూ.20వేల నుంచి రూ.25 వేల వరకూ అద్దెలు పలుకుతున్నాయి.ఈ లెక్కన ఏడేళ్లకు రూ.5.46 కోట్ల ఆదాయం పంచాయతీకి రావాల్సి ఉంది. టీడీపీ నాయకుల చేతివాటంతో పంచాయతీ ఆదాయానికి గండిపడుతోంది. దీంతో పంచాయతీలో ఉద్యోగులకు జీతాలు, పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీరు, వీధి దీపాలు అంటూ అనేక పనులకు నిధుల కొరత ఏర్పడింది. ఇప్పటికైనా టీడీపీ నేతలు ప్రజలు, పంచాయతీ బాగు కోసం ఆలోచించి బహిరంగ వేలానికి మద్దతిస్తే ఎలాంటి వివాదాలకు తావులేకుండా అర్హులకు దుకాణాలు దక్కే అవకాశం ఉంది. వేలంతో పంచాయతీకి ఆదాయం.. చీపురుపల్లి దుకాణాల అంశంపై కలెక్టర్ హరిజవహర్‌లాల్‌తో ఇప్పటికే చర్చించాం. దుకాణాలకు ప్రస్తుతం అతి తక్కువ అద్దెలు వస్తున్నాయి. దీనివల్ల పంచాయతీకి ఆదా యం రావడం లేదు. ఈ విధానం మారాల్సిన అవసరం ఉంది. అందుకే బహిరంగ వేలం నిర్వహించాల్సింది గా కలెక్టర్‌ను కోరాం. అదే జరిగితే పంచాయతీకి ఏడాదికి దాదాపు రూ.5 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. పంచాయతీ అవసరాలకు ఆ సొమ్ము ఉపయోగపడుతుంది. – బెల్లాన చంద్రశేఖర్, ఎంపీ, విజయనగరం ఉన్నతాధికారుల సూచనల మేరకే... వ్యాపారులు దుకాణాల కోసం గ్రీవెన్సుసెల్‌ను గతేడాది ఆశ్రయించారు. దీంతో ప్రతిపాదనలు పంపించాల్సిందిగా జిల్లా అధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. ఆ మేరకు ప్రతిపాదనలు పంపించాం. 30 శాతం అద్దె పెంచుతూ దుకాణాలను కేటాయించాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. ఆ ప్రకారం అద్దెలు పెంచుతూ దుకాణాలను కేటాయించాం. – డి. శ్రీనివాస్, మేజర్ పంచాయతీ అధికారి, చీపురుపల్లి -
కీచక ఉపాధ్యాయుడు.. తరగతి గదిలో విద్యార్థినిలపై..
సాక్షి, భువనేశ్వర్ : విద్యా బుద్దులు నేర్పించి భవిష్యత్‌లో సమాజానికి ఆదర్శంగా నిలిచే విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయుడు విద్యార్థినిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే, తరగతి గదిలో ఉంటూ ఎంతో మందికి ఆదర్శంగా నిలవాల్సిన ఉపాధ్యాయుడు బజారు మనిషిలా వ్యవహరిస్తే అలాంటి ఉపాధ్యాయులను ఏమనుకోవాలి. చీపురుపల్లిలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో సరిగ్గా అదే జరిగింది. ఆ పాఠశాలలో గణితం బోధిస్తున్న ఎ.రాంబాబు అనే ఉపాధ్యాయుడు తన దగ్గర చదువుతున్న విద్యార్థినిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వారిని భయాందోళనలకు గురి చేసేవాడు. లైంగిక వేధింపులు భరించలేని పదో తరగతి విద్యార్థిని నేరుగా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిందంటే ఆ ఉపాధ్యాయుడు కీచకపర్వం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదే విషయం గురువారం దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఆ దుమారానికి విద్యార్థిని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో తెరపడింది. ఈ సంఘటనకు సంబంధించి ఎస్ఐ ఐ.దుర్గాప్రసాద్ అందించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడుగా విధులు నిర్వహిస్తున్న ఎ.రాంబాబు విద్యార్థినిల పట్ల కొంత కాలంగా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. అభం శుభం తెలియని విద్యార్థినిల శరీరంపై చేతులు వేస్తూ వారిని తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నాడు. చాలా కాలంగా ఈ తంతు నడుస్తున్నప్పటికీ ఎట్టకేలకు పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని కుటుంబ సభ్యుల సహకారంతో శుక్రవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో ఉపాధ్యాయుడు రాంబాబుపై 354(ఎ), 509, సెక్షన్ 8, 12 ఆఫ్ ఫోక్సో చట్టాలు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. శుక్రవారం బాధిత విద్యార్థిని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం కీచక ఉపాధ్యాయుడి భాగోతం బట్టబయిలయ్యింది. కేసు నమోదు చేసాం... బాలుర ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు గణితం ఉపాధ్యాయుడు ఎ.రాంబాబుపై కేసు నమోదు చేసామని ఎస్ఐ ఐ.దుర్గాప్రసాద్ తెలిపారు. తరగతి గదిలో తమ శరీరంపై చేతులు వేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఫిర్యాదులో విద్యార్థిని పేర్కొన్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు 354(ఎ), 509, సెక్షన్ 8, సెక్షన్ 12 ఆఫ్ ఫోక్సో చట్టాలు క్రింద నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. -
అసలేం జరుగుతోంది..?
సాక్షి చీపురుపల్లి(విజయనగరం) : చీపురుపల్లి సీహెచ్‌సీలో వింత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. జిల్లా అధికారులకు, ఇక్కడి వైద్యులకు సమన్వయం లేకపోవడం ఒకెత్తయితే, అసలు ఆస్పత్రిలో పనిచేస్తున్న సిబ్బంది ఎవరు ఏపని చేయాలో కూడా తెలియని స్థితి నెలకొంది. ఈ విషయం డీసీహెచ్ఎస్ ఉష శ్రీ ఎదుటే తేటతెల్లం కావడంతో ఆమె సైతం వైద్యులు తీరుపై అవాక్కయ్యారు. ఈ నెల 30న రాత్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళా రోగిపై అక్కడ పని చేస్తున్న శానిటరీ సూపర్వైజర్ అసభ్యకరంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. ఆయనపై కేసు కూడా నమోదైంది. దీనిపై డీసీహెచ్ఎస్ ఉషశ్రీ దర్యాప్తుకు గురువారం సీహెచ్‌సీకి వచ్చారు. ఆమెకు వైద్యులు అసభ్యకరత ప్రవర్తన విషయం అంతటిని చెప్పకుండా దాచిపెట్టారు. అంతేకాదు ఇంత పెద్ద సంఘటన జరిగితే పోలీసులకు కూడా వైద్యులు ఫిర్యాదు చేయలేదు. మీడియాలో వచ్చిన వార్తలు చూసి రాష్ట్ర అధికారులు డీసీహెచ్ఎస్కు సమాచారం ఇచ్చారు. అంతా మాయ.. మరో వింత ఏంటంటే అసభ్య ప్రవర్తనకు పాల్పడిన వ్యక్తిని 4 రోజుల ముందే తొలగించినట్లు కాంట్రాక్టర్ తనకు చెప్పాడని డీసీహెచ్ఎస్కు చెబుతుంటే, లేదు ఆ శానిటరీ సూపర్వైజర్ ఇంకా విధుల్లోనే ఉన్నాడని డాక్టర్లు చెబుతున్నారు. లేదు నాలుగు రోజుల క్రితమే సదరు సూపర్వైజర్ ఎస్‌కోట నుంచి ఇక్కడికి బదిలీపై వచ్చాడని అశోక్ అనే మరో ఉద్యోగి డీసీహెచ్ఎస్కు చెప్పాడు. ఇదంతా చూస్తుంటే ఆస్పత్రిలో నిర్లక్ష్యం ఎలా రాజ్యమేలుతుందో అర్థం చేసుకోవచ్చని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇలాంటి సంఘటన జరిగినా ఉన్నతాధికారులకు ఇక్కడి నుంచి సమాచారం వెళ్లలేదంటే ఇంకా ఎంత పెద్ద విషయం చోటు చేసుకున్నా చెప్పరేమో అంటూ ప్రజలు నిట్టూరుస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి ఆస్పత్రిని గాడిలో పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని ప్రజలు బహిరంగంగానే అనుకుంటున్నారు. గాలికొదిలేస్తారా..? దర్యాప్తు చేసేందుకు గురువారం సీహెచ్‌సీకి వచ్చిన డీసీహెచ్ఎస్ ఉషశ్రీ అక్కడి పరిస్థితులు చూసి డాక్టర్లు, సిబ్బందిపై విరుచుకుపడ్డారు. చికిత్సకు వచ్చిన రోగికి అన్యాయం జరిగితే పోలీసులకు ఫిర్యాదు చేయరా..? ఉన్నతాధికారులకు విషయం చెప్పరా..? ఇది ప్రభుత్వ ఆస్పత్రి అనుకుంటున్నారా..? లేక ప్రైవేటు ఆస్పత్రి అనుకుంటున్నారా...? సెల్ఫోన్లు చూసుకునేందుకా ఇక్కడికి మీరు డ్యూటీకి వస్తుంది అంటూ సిబ్బందిపై ప్రశ్నల వర్షం కురిపించారు. లీగల్ విషయాలు పట్టించుకోకుండా ఆస్పత్రిని గాలికి వదిలేద్దామనుకుంటున్నారా..? అందరికి మెమోలు ఇస్తాను సమాధానం చెప్పండి అంటూ మండిపడ్డారు. అనంతరం సంబంధిత రోగి, ఆమె తల్లితో మాట్లాడి విషయాలు తెలుసుకున్నారు. ఆస్పత్రిలో ఇంత పెద్ద సంఘటన జరిగి రెండు రోజులు కావస్తున్నా సమాచారం ఇవ్వకపోవడంపై విచారం వ్యక్తం చేశారు. ఒక్కొక్కరు ఒక్కోలా.. దర్యాప్తు చేస్తున్న సమయంలో తాను ఇటీవలే బదిలీపై వచ్చానని, ఆ రోజు పాత ఆస్పత్రికి విధులను వేరొకరికి అప్పగించేందుకు వెళ్లానని ప్రధాన వైద్యాధికారి నారాయణరావు, తాను హాఫ్‌లో ఉన్నానని ఇంకో సీనియర్ డాక్టర్ మహేంద్రగిరి తెలిపారు. ఉన్నా లేకున్నా..? విషయం తెలుసుకుని అయినా ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత మీపై ఉందని డీసీహెచ్ఎస్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం పోలీసులకు అయినా చెప్పాలి కదా అని అడిగారు. ఈ విషయం ద్వారా మీకు ఎవరికీ బాధ్యత లేదని అర్థమైందని ఆమె వ్యాఖ్యానించారు. ఇకపై భద్రత ప్రమాణాలు పాటిస్తాం.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఇకపై భద్రత ప్రమాణాలు పాటిస్తాం. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, సెక్యూరిటీ గార్డులను నియమిస్తాం. చీపురుపల్లి సీహెచ్‌సీని 100 పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు పంపాం. అలా జరిగితే పోలీస్ అవుట్ పోస్టు కూడా ఏర్పడుతుంది. ఇంత పెద్ద సంఘటన ఆస్పత్రిలో జరిగితే సమాచారం ఇవ్వకపోడం, మీడియాలో వచ్చిన వార్తలను చూసి ఉన్నతాధికారులు తనను అడగడం విచారకరమైన విషయమన్నారు. ఆ శానిటరీ ఇన్స్పెక్టర్ విధుల్లో లేడని కాంట్రాక్టర్, ఉన్నాడని వైద్యులు చెబుతున్నారు. అంటే ఆస్పత్రిలో నిర్లక్ష్యం రాజ్యం ఏలుతోంది. అందరిపైనా చర్యలు ఉంటాయి. – ఉషశ్రీ, జిల్లా ఆస్పత్రుల సేవల సమన్వయ అధికారి, విజయనగరం. -
మహిళా రోగిపై అసభ్యకర ప్రవర్తన
సాక్షి, చీపురుపల్లి(విజయనగరం) : అసలే ఆమె మూగ.. ఆ పైన ఆరోగ్యం బాగో లేకపోవడంతో స్థానిక ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో చేరింది. అక్కడ వైద్యం తీసుకుంటున్న తరుణంలో ఆస్పత్రి పారిశుద్ధ్య నిర్వహణ బాధ్యతలు చూసుకోవాల్సిన శానిటరీ సూపర్వైజర్ కన్ను వార్డులో ఒంటరిగా ఉన్న ఆమెపై పడింది. దీంతో మూగ మహిళపై అసభ్యకర ప్రవర్తనకు దిగాడు. ఇంతలో పక్క వార్డులో ఉన్న మరో మహిళ వచ్చి గోల చేయడంతో అక్కడి నుంచి పలాయనం చిత్తగించాడు. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు శానిటరీ సూపర్వైజర్పై చీపురుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిందితుడిపై 364, 509 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సీఐ సీహెచ్ రాజులునాయుడు , ఎస్సై ఐ.దుర్గాప్రసాద్ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. డలంలోని పేరిపి గ్రామానికి చెందిన ఓ మూగ మహిళా రోగి వాంతులు, విరేచనాలతో బాధపడుతూ ఈ నెల 30న చీపురుపల్లి సీహెచ్‌సీలో చేరారు. దీంతో సిబ్బంది ఆమెకు వైద్యం అందిస్తున్నారు. అయితే మంగళవారం రాత్రి పై అంతస్తు వార్డులో ఉన్న మహిళా మూగ రోగి తల్లి మందులు తెచ్చుకునేందుకు ఫార్మసీకు వెళ్లింది. ఆ సమయంలో ఆ వార్డులోకి ప్రవేశించిన శానిటరీ సూపర్వైజర్ రామచంద్రరరావు అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో మహిళా రోగిపై అసభ్యకర ప్రవర్తనకు దిగాడు. దీంతో పక్కవార్డులో ఉన్న పోలమ్మ అనే మహిళ వచ్చి గోల చేసేసరికి వెళ్లిపోయాడు. ఆ తర్వాత అక్కడకు చేరుకున్న మూగ మహిళా రోగి తల్లి ఉప్పాడ ఎల్లమ్మకు మిగిలిన రోగులు వివరించారు. దీంతో బుధవారం ఉదయం ఎల్లమ్మ తన కుమార్తెకు జరిగిన అన్యాయం వివరిస్తూ శానిటరీ సూపర్వైజర్ రామచంద్రరావుపై చీపురుపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఎస్ఐ దుర్గాప్రసాద్ స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి అక్కడ బాధితురాలు నుంచి పలు వివరాలు రాబట్టి, మిగిలిన రోగులతో విచారణ జరిపిన అనంతరం 364, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
సీఎం సారూ.. మీకు రుణపడి ఉంటాం
సాక్షి, చీపురుపల్లి(విజయనగరం) : అసలే పేదరికం. ఆపై కేన్సర్‌తో సతమతం... ఆ కుటుంబం పడుతున్న వేదన అంతా ఇంతా కాదు. ఇక పెట్టుబడి పెట్టలేక మరణమే శరణ్యమనుకుంటున్న వేళ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వారిని ఆదుకున్నారు. సీఎం సహాయ నిధినుంచి పెద్ద మొత్తం కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు వారికి కొండంత బలం చేకూరింది. మళ్లీ బతికి మామూలుగా తిరుగాడుతామన్న నమ్మకం కలిగింది. ఇదీ చీపురుపల్లి పట్టణంలో ఓ కుటుంబం దీన గాథ. చీపురుపల్లి పట్టణం కొద్దగవిడి వీధికి చెందిన రవికుమార్ ఓ ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఆయన తండ్రి సీతారామమూర్తి ఆర్ఈసీఎస్లో ఉద్యోగ విరమణ చేయగా ఆయనకు పింఛన్ సౌకర్యం కూడా లేదు. ఈ పరిస్థితుల్లో దాదాపు ఎనిమిది నెలల క్రితం రవికుమార్ భార్య ఉషారాణికి బ్లడ్ కేన్సర్ మహమ్మారి సోకింది. ఆస్పత్రుల్లో చూపిస్తే బోన్‌మేరో ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాలనీ, అందుకు రూ.16 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. ఆ స్థాయిలో వైద్యం చేయించుకునే ఆర్థిక స్తోమత లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ అప్పులు చేసి విజయవాడ ఆస్పత్రిలో చికిత్స ప్రారంభించారు. గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం దరఖాస్తు చేసుకోగా కేవలం రూ.2 లక్షలు కేటాయిస్తున్నట్టు ప్రకటించినా ఆ నిధులు వచ్చేలోగానే ఎన్నికలు రావడం, గడువు ముగిసిపోవడంతో ఆ నిధులు వెనక్కి వెళ్లిపోయాయి. వైఎస్సార్సీపీ నేతల అండతో... రవికుమార్, ఆయన తండ్రి సీతారామ్మూర్తి జూన్ నెలాఖరున మండల వైఎస్సార్సీపీ నాయకులు వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, ఇప్పిలి అనంతంలను ఆశ్రయించారు. వారు జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వకర్త మజ్జి శ్రీనివాసరావు దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. ఆయన ఎలాంటి జాప్యం చేయకుండా రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణకు సమస్య వివరించారు. అంతే జూలై 1న అమరావతి చేరుకుని అక్కడ మంత్రి బొత్సను కలిసి, ఆయన లేఖతో బాటు బాధితురాలు ఉషారాణికి వైద్యులు ఇచ్చిన ధ్రువీకరణ పత్రాలతో పూర్తి నివేదిక అందించారు. జూలై 2న తేదీ సాయంత్రం సాక్షాత్తూ రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ ఆ ఫైల్‌ను ముఖ్యమంత్రి సహాయ నిధి కార్యాలయానికి సమర్పించారు. జూలై 4న బాధిత కుటుంబానికి రూ.5 లక్షలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఎంతో రుణపడి ఉంటాం.. నా భార్యకు కేన్సర్‌సోకి చికిత్స చేయించేందుకు నానా అవస్థలు పడుతున్నాం. మా నియోజకవర్గ వైఎస్సార్సీపీ నాయకులు, మంత్రి బొత్ససత్యనారాయణ చొరవ చూపడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రూ.5 లక్షలు మంజూరు చేశారు. ఇంత త్వరగా మా సమస్యపై ముఖ్యమంత్రి స్పందించడం చాలా గొప్ప విషయం. జగన్మోహన్రెడ్డి మాటల మనిషి కాదు చేతల మనిషి అని రుజువైంది. 48 గంటల్లో సహాయం అందించడం గతంలో ఎప్పుడూ వినలేదు. మాకు చాలా పెద్ద సహాయం ప్రభుత్వం నుంచి వచ్చింది. రూ.9 లక్షలు అవసరమని కోరగా అందులో యాభై శాతం కంటే ఎక్కువగా రూ.5 లక్షలు మంజూరు చేశారు. సిఎం జగన్మోహన్రెడ్డి చేసిన మేలు జీవితంలో మరిచిపోలేము. – రవికుమార్, ఉషారాణి దంపతులు -
హైటెక్ మార్ఫింగ్ మాయ!
సాక్షి, చీపురుపల్లి(విజయనగరం) : ప్రభుత్వం అందించే పథకాలు అడ్డదారిలోనైనా దక్కించుకోవడానికి కుతంత్రాలు చేస్తున్నారు. డబ్బులు ఇస్తే ఎంతటి అక్రమాన్నైనా చేసేసే ప్రబుద్ధులు ఇందుకు తోడ్పడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే పింఛన్‌కు అర్హత వయసు సరిపోకపోతే దానిని ఆధార్‌లో మార్చేసి అడ్డదారిలో డబ్బు సంపాదిస్తున్న వైనం తాజాగా బయటపడింది. చీపురుపల్లి పట్టణంలోని ఆంధ్రాబ్యాంక్‌లో కొంతకాలంగా ఆధార్ నమోదు కేంద్రం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేంద్రంలో డబ్బులిస్తే వయస్సు మార్చేస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. ఒక్కో వ్యక్తి నుంచి రూ.4 వేల నుంచి రూ.5 వేలు తీసుకుని పక్క జిల్లా శ్రీకాకుళం నుంచి కూడా లబ్ధిదారులను తీసుకొచ్చి ఇక్కడ వయస్సు మార్ఫింగ్ చేసేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారాన్ని శ్రీకాకుళం జిల్లా రాజాంకు చెందిన ఓ మీసేవా కేంద్ర మాజీ నిర్వాహకుడు బ్రోకర్ అవతారమెత్తినడిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఆధార్‌కార్డులో వయస్సు మార్చడానికి నాలుగైదు వేలు ఖర్చుచేస్తే ఆ తరువాత నెలకు రూ.2 వేలు దాటి పెన్షన్ వస్తుంది అంటూ లబ్ధిదారులను మభ్యపెట్టి 65 సంవత్సరాలు నిండని వారిని సైతం ఆధార్‌కార్డులో మార్చేస్తూ కొత్త కార్డులు సృష్టిస్తున్నారు. వెలుగు చూసిందిలా... శ్రీకాకుళం జిల్లాలోని వంగర మండలంలో గల సీతారాంపురం గ్రామానికి చెందిన పది మంది లబ్ధిదారులు శుక్రవారం ఇక్కడకు రావడంతో ఈ తతంగం బయటపడింది. వారిని ప్రశ్నించగా తాము ఆధార్‌కార్డు మార్చడానికి వచ్చామని బదులిచ్చారు. ఓ ఆటోలో వచ్చిన పది మందిని ఆంధ్రాబ్యాంకు ఎదురుగా ఉన్న అంబేడ్కర్‌కాలనీ సందులో ఉంచి ఇద్దరేసి ఒకసారిగా బ్యాంకులోకి వచ్చి తమ పనులు ముగించుకుని వెళుతుండటాన్ని గమనించిన విలేకరులు వారిని ఫొటోలు తీసేందుకు ప్రయత్నించగా చల్లగా జారుకున్నారు. రాజాం పట్టణంలో ఓ మీసేవ కేంద్ర మాజీ నిర్వాహకుడు బ్రోకర్‌గా అవతారమెత్తి ఈ తతంగాన్ని నడిపిస్తున్నట్లు సమాచారం. వీరిని తీసుకువచ్చిన ఆటోవాలా సత్యనారాయణ సాక్షితో మాట్లాడుతూ సీతారాంపురం నుంచి పది మందిని బేరం కుదర్చుకుని తీసుకొచ్చాననీ, రాజాంలో ఓ వ్యక్తికి వీరంతా డబ్బులిచ్చారనీ, తరువాత చీపురుపల్లి ఆంధ్రాబ్యాంకు దగ్గరకు తీసుకెళ్లమంటే తీసుకొచ్చాననీ తెలిపారు. ప్రూఫ్ లేకుంటే మార్చడం కుదరదు ప్రూఫ్ ఉంటే తప్ప వయస్సు మార్పిడి కుదరదు. రోజుకు 40 వరకు ఆధార్ నమోదు, మార్పిడులు వస్తాయి. అందులో అత్యధికంగా బయోమెట్రిక్, సెల్ నంబరు, అడ్రస్ మార్పులు వంటివి అధికంగా ఉంటాయి. ఒకటో రెండో వయస్సు మార్పిడి ఉంటే దానికి కచ్చితంగా ప్రూఫ్‌లు ఉంటేనే మారుతుంది. ప్రతీ దరఖాస్తును విచారించిన తరువాతే ఆధార్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇక్కడ ఎలాంటి వయస్సు మార్పిడి ప్రక్రియ జరగడం లేదు. – ఎ.ప్రసాద్, ఆంధ్రాబ్యాంక్ మేనేజర్, చీపురుపల్లి -
మంత్రికి ఘన స్వాగతం
సాక్షి, విజయనగరం : మంత్రి హోదాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తొలిసారిగా తన సొంత నియోజకవర్గం చీపురుపల్లిలో పర్యటించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేబినెట్లో రాష్ట్ర పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గురువారం చీపురుపల్లికి వచ్చారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ శ్రేణులు, అభిమానులు భారీ ర్యాలీతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం బొత్స సత్యనారాయణ దంపతులు చీపురుపుల్లిలోని కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్యక్రమాల నిమిత్తం మంత్రి ట్రాక్టర్లు పంపిణీ చేశారు. -
బహిర్భూమికని వెళ్లి పరలోకాలకు..
సాక్షి, చీపురుపల్లి(విజయనగరం) : బహిర్భూమికని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పట్టణంలోని శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయం సమీపంలోని తోటపల్లి కాలువలో మొండేటి లక్ష్మణ (30) అనే వ్యక్తి ప్రమాదవశాత్తూ జారిపడి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. ఈ మేరకు ఆయన భార్య దేవి ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం ఏఎస్ఐ రాజు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని లావేరు రోడ్‌కు చెందిన మొండేటి లక్ష్మణ బండిపై గాజులు విక్రయించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఏడాదిన్నర క్రితమే అదే ప్రాంతానికి చెందిన దేవితో వివాహం జరిగింది. సోమవారం సాయంత్రం బహిర్భూమికి వెళ్తానని చెప్పిన లక్ష్మణ చాలా సేపటి వరకు తిరిగి రాలేదు. అదే వీధికి చెందిన మరో వ్యక్తి వచ్చి తోటపల్లి కాలువ వద్ద పడి ఉన్నాడని చెప్పడంతో కుటుంబ సభ్యులు అంతా పరుగులు తీశారు. ప్రమాదవశాత్తూ జారి కాలువలో పడి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు, స్థానికులు చెబుతున్నారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్ఐ రాజు తెలిపారు. -
బాలకృష్ణ నీ యాక్షన్ సినిమాల్లో చూపించుకో..
సాక్షి, చీపురుపల్లి: సినీనటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బాలకృష్ణ తీరుపై వైఎస్సార్ సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం విజయనగరం జిల్లా పర్యటనకు వచ్చిన బాలకృష్ణ చీపురుపల్లిలో ఓ అభిమానిపై చెయ్యి చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై బొత్స స్పందిస్తూ.. ఖబడ్దార్ .. బాలకృష్ణా అంటూ హెచ్చరించారు. సోమవారం చీపురుపల్లిలోని జి.అగ్రహారంలో సోమవారం నిర్వహించిన ఎన్నికల సభలో బొత్స మాట్లాడారు. టీడీపీ కార్యకర్త అయినా..చీపురుపల్లికి చెందిన ఓ కుర్రాడిని కొట్టే అధికారం బాలకృష్ణకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. బాధిత యువకుడు ఏ పార్టీకి చెందిన వాడో మాకు అనవసరం కానీ చీపురుపల్లి ప్రాంతానికి చెందిన వ్యక్తిపై ఈగ వాలినా ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ‘మీరు సినిమా నటులైతే మీ యాక్షన్లు సినిమాల్లో చూపించుకోవాలి తప్ప వీధుల్లోకి వచ్చి మా కుర్రాళ్లను కొడతామంటే ఎవ్వరూ చూస్తూ ఊరుకోరన్న సంగతి గుర్తుంచుకోండి’ అని బాలకృష్ణను ఉద్దేశించి బొత్స అన్నారు. యువకుడికి బాలకృష్ణ భేషరతుగా క్షమాపణ చెప్పాలని లేదంటే భవిష్యత్‌లో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. వీధుల్లోకి వచ్చి ఇష్టానుసారంగా వ్యక్తిత్వ విలువలు కోల్పోయి కొడతామంటే ప్రజలు చూస్తూ ఊరుకోరన్నారు. ప్రజాస్వామ్యంలో విలువలు, వ్యక్తిత్వం ముఖ్యమని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య విలువలు లేని ఇలాంటి వ్యక్తులను దగ్గరకు చేర్చితే వ్యవస్థకు నష్టమని వ్యాఖ్యానించారు. కాగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న బాలకృష్ణ ...అభిమానులు, పార్టీ కార్యకర్తలతో దురుసుగా ప్రవర్తిస్తున్న విషయం తెలిసిందే. గొంతు కోస్తా, అంతు చూస్తా... అంటూ బెదిరింపులకు పాల్పడటమే కాకుండా...చేయి చేసుకోవడంతో ఆయన తీరుపై సొంతపార్టీ నేతలే విమర్శలు గుప్పిస్తున్నారు. -
బాలయ్య బిత్తిరిపర్వం.. మరో కార్యకర్తకు షాక్..
సాక్షి, విజయనగరం: సీఎం చంద్రబాబునాయుడు బావమరిది, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ బిత్తిరిచర్యల పర్వం కొనసాగుతోంది. కారణం ఏమిటో తెలియదు కానీ.. ఎన్నికల ప్రచారంలో బాలకృష్ణ తనదైన శైలిలో రెచ్చిపోతున్నారు. అభిమానంతో బాలయ్యను దగ్గరగా చూసేందుకు ప్రజలు వచ్చినా.. పార్టీ కార్యకర్తలు వచ్చినా ఆయన ఊరుకోవడం లేదు. అయితే.. నోటికి పనిచెప్పి.. ‘ఏయ్ నీ సంగతి చెబుతా.. పీక కోస్తా.. నాకొడకా..’ అంటూ బెదిరింపులు.. లేకపోతే.. చేతికి పనిచెప్పి.. చెంప చెళ్లుమనిపించడాలు.. ఇలా బాలకృష్ణ ఎన్నికల ప్రచారం సాగుతోంది. తాజాగా విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బాలకృష్ణ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఆయనను తమ కెమెరాలో బంధించేందుకు ప్రయత్నించిన ఓ కార్యకర్తపై చేయి చేసుకున్నారు. ఎన్నికల ప్రచార రథంలో వెళుతున్న బాలకృష్ణను తమ సెల్ఫోన్లలో వీడియో తీసేందుకు టీడీపీ కార్యకర్తలు ఉత్సాహం చూపించారు. ఇలా ఓ కార్యకర్త బాలకృష్ణ వాహనానికి సమీపంగా వచ్చి తన సెల్ఫోన్లో వీడియో తీస్తుండగా అతన్ని బాలకృష్ణ గద్దించారు. ఈలోపు మరో వ్యక్తి కూడా బాలయ్యను సెల్ఫోన్లో చిత్రీకరించేందుకు ప్రయత్నించగా.. బాలయ్య ఆవేశంగా అతని ఫోన్ లాక్కునేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘ఏయ్ నీ సంగతి చెబుతా.. పీక కోస్తా.. నాకొడకా.. ఏసీపాడదొబ్బుతా..’ అని అనంతపురం జిల్లా హిందూపురం ఎన్నికల ప్రచారంలో ఇటీవల కార్యకర్తలపై బాలయ్య ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అదేవిధంగా విశాఖ జిల్లాలోనూ ఆయన తన అభిమానులపై ప్రతాపాన్ని చూపారు. విశాఖ జిల్లా భీమునిపట్నంలో గంటస్తంభం వద్ద శనివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో బాలయ్య ప్రసంగిస్తుండగా కొందరు అభిమానులు ‘జై బాలయ్య’ అంటూ నినాదాలు చేశారు. దీంతో బాలకృష్ణ ఒక్కసారిగా తన అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఏయ్..మాట్లాడకు’ అని ఓ అభిమానిపై రెండుసార్లు మండిపడ్డారు. ఆ తరువాత తన ప్రసంగాన్ని కొనసాగించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని చెప్పే ప్రయత్నంలో అదే పనిగా మాటల్లో తడబడ్డారు. దీంతో సభకు వచ్చిన అభిమానులు, కార్యకర్తలు బాలయ్య ప్రసంగం తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బాలయ్యకు విగ్ కష్టాలు బాలకృష్ణ మరో రెండేళ్లలో షష్టిపూర్తి చేసుకోనున్నారు. కానీ సినిమా హీరో...ఆ ఇమేజ్ మ్యానేజ్ చేసేందుకు నిత్యం విగ్గులోనే కనిపిస్తారు. తనదగ్గరికి ఎవరైనా వచ్చినా..పూలమాల వేసేందుకు గుంపులుగా జనం వచ్చినా విగ్గు జారిపోతుందని భయపడుతుంటారు. అందుకే అనుమతిలేనిదే ఎవరినీ దగ్గరకు రానివ్వరు. ఎవరైనా దగ్గరగా వచ్చినా తాకకూడదు..కాదు కూడదని తాకితే తనదైన శైలిలో వారికి బహుమానం ఇస్తారు. ఎవరైనా సరే సినిమాలో హీరోలా అలా దూరం చేసి నమస్కారం పెట్టి పోవాలి. అదీ బాలయ్య స్టైల్. కానీ జనం ఇవేవీ తెలియక మా ఎమ్మెల్యే నంటూ దగ్గరకు వెళ్లి ఆయన హస్తముద్ర వేయించుకుంటుంటారు. చదవండి: బాలయ్య..నరుకుతా.. చంపుతా.. బాంబులేస్తా -
బాలయ్య బిత్తిరిపర్వం.. మరో కార్యకర్తకు షాక్..
-
ప్రకాశం జిల్లా చీపురుపల్లిలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం
-
చారిత్రక లోగిలి.. చీపురుపల్లి
సాక్షి ప్రతినిధి, చీపురుపల్లి : విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గానికి రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత ఉంది. రాష్ట్ర రాజకీయాలకు ఇది కేంద్ర బిందువుగా ఉంటోంది. 80 శాతం తూర్పుకాపు సామాజిక వర్గం ఉన్న ఏకైక నియోజకవర్గంగా గుర్తింపు తెచ్చుకుంది. 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక.. స్థానిక ఎమ్మెల్యేగా బొత్స సత్యనారాయణ ఉన్న సమయంలో చీపురుపల్లి నియోజకవర్గంపై వైఎస్ ఎంతో మక్కువ చూపించేవారు. అందుకే.. 2004 నుంచి 2009 వరకు అభివృద్ధి విషయంలో నియోజకవర్గం పరుగులు తీసింది. మహానేత వైఎస్ మరణానంతరం స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పీసీసీ అ«ధ్యక్షునిగా కూడా పని చేశారు. దీంతో నియోజకవర్గం పేరు మరింతగా మార్మోగింది. 1952లో నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు 14 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అపార అనుభవం రాష్ట్ర రాజకీయాల్లో బొత్స సత్యనారాయణ ప్రత్యేక స్థానాన్ని పదిల పర్చుకున్నారు. మహారాజా కళాశాలలో 1978–80లో విద్యార్థి సంఘ నాయకునిగా ప్రస్థానం ఆరంభించిన బొత్స 1992–95లో డీసీసీబీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. తిరిగి 1995–99 వరకు డీసీసీబీ చైర్మన్ పదవి చేపట్టారు. అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ తరఫున డీసీసీబీకి ఎన్నికైనది ఆయనొక్కరే. 1996, 1998 సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా పోటీచేసి ఓటమి చెందినా 1999లో ఎంపీగా గెలుపొందారు. 2004, 2009 ఎన్నికల్లో చీపురుపల్లి ఎమ్మెల్యేగా గెలిచారు. 2004 నుంచి వైఎస్ కేబినేట్లో మంత్రిగా పనిచేశారు. అనంతరం రోశయ్య, కిరణ్‌కుమార్ కేబినేట్‌లోనూ పనిచేశారు. 2012లో మూడేళ్లపాటు పీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా అన్నివిధాలుగా అండగా నిలుస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి ఉన్న తూర్పు కాపులకు బొత్స ఇప్పటికీ అండగా ఉంటున్నారు. వారసుడిగా వచ్చిన నాగార్జున సానుకూలాంశాలు మాజీ మంత్రి, చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి మృణాళిని రాజకీయ వారసునిగా నాగార్జున ఈ ఎన్నికల్లో రంగప్రవేశం చేశారు. ఆయన లాస్ ఏంజిల్స్‌లోని యూనివర్సిటీ ఆఫ్ సథరన్ కాలిఫోర్నియాలో మాస్టర్ ఆఫ్ సైన్స్ చదువుకున్నారు. శాన్ఫ్రాన్సిస్కోలో ఐదేళ్లపాటు సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేశారు. 2014లో ఆయన తల్లి మృణాళిని ఎమ్మెల్యేగా గెలుపొందడంతో 2016లో ఉద్యోగాన్ని వదిలిపెట్టి వచ్చేశారు. కొన్నాళ్లకు జనని ఫౌండేషన్ సంస్థను స్థాపించి విద్యార్థుల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతికూలతలు జనని సంస్థ పేరుతో ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు వెళ్లి అనధికార పరిశీలనలు చేశారు. ప్రభుత్వ సిబ్బందిపై పెత్తనం చెలాయించేవారు. అధికారిక కార్యక్రమాల్లో సైతం మృణాళిని తన కుమారుడిని వేదికలపై కూర్చోబెట్టడం ద్వారా సొంత పార్టీలోనే వ్యతిరేకత మూటగట్టుకున్నారు. ముఖ్యంగా గ్రామీణ సహకార విద్యుత్ సంఘం(ఆర్ఈసీఎస్)లో భారీ అవినీతి, ఉద్యోగాలు అమ్ముకోవడం వంటి ఆరోపణలతో మృణాళిని ప్రతిష్ట మసకబారింది. దీంతో ఆమె అభ్యర్థిత్వాన్ని సొంత పార్టీవారే తీవ్రంగా వ్యతిరేకించారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆమె కుమారుడు నాగార్జునకు టీడీపీ అధిష్టానం సీటు కట్టబెట్టింది. బాబు మర్చిపోయిన హామీలు చంద్రబాబు ఈ నియోజకవర్గానికి ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. చీపురుపల్లిని రెవిన్యూ డివిజన్‌గా మారుస్తానని మాట తప్పారు. మెరక మూడిదాం మండలానికి ప్రభుత్వ జూనియర్ కళాశాల, గుర్ల మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికీ అతీగతీ లేదు. ఇదే మండలంలో 30 పడకల ఆసుపత్రి నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికీ పనులు మొదలు కాలేదు. చీపురుపల్లి పర్యటనకు వచ్చినపుడు ఇక్కడ వెటర్నరీ కళాశాల నిర్మిస్తామన్నారు. తరగతులు నేటికీ ప్రారంభం కాలేదు. తోటపల్లి పిల్ల కాలువలు పూర్తి చేస్తామని విస్మరించారు. మొత్తం ఓటర్లు 1,90,187 పురుషులు 96,113 మహిళలు 94,062 ఇతరులు 12 – బోణం గణేష్, సాక్షి ప్రతినిధి, విజయనగరం -
చరిత్ర లోగిలి....చీపురుపల్లి....
సాక్షి, చీపురుపల్లి: జిల్లాలో ఎన్నో నియోజకవర్గాలు ఉన్నప్పటికీ చీపురుపల్లి నియోజకవర్గానికి రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత ఉంది. జిల్లాలో జరిగే రాజకీయాలకు చీపురుపల్లి కేంద్ర బిందువుగా ఉంటోంది. ఎంతో కాలంగా ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ తాజా పరిస్థితుల్లో సైతం జిల్లాలో చీపురుపల్లి కోసం అత్యధికంగా చర్చ జరుగుతోంది. 80 శాతం తూర్పుకాపు సామాజిక వర్గం ఉన్న ఏకైక నియోజకవర్గంగా కూడా చెప్పుకోవచ్చు. 2004లో వైఎస్.రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక నియోజకవర్గంపై ఎంతో మక్కువ చూపించేవారు. ఆయనకు ఎంతో సన్నిహితుడైన బొత్స సత్యనారాయణ ఎమ్మెల్యే కావడంతో నియోజకవర్గ అభివృద్ధికి మహానేత ఎంతో సహాయ సహకారాలు అందించేవారు. అందులో భాగంగానే 2004 నుంచి 2009 వరకు నియోజకవర్గం అభివృద్ధి విషయంలో పరుగులు తీసింది. దీంతో పులివెందుల, కుప్పం నియోజకవర్గాల సరసన చీపురుపల్లి కూడా చేరిందని అప్పట్లో చెప్పుకునేవారు. మహానేత వైఎస్సార్ మరణానంతరం స్థానిక ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కూడా పని చేశారు. దీంతో నియోజకవర్గం పేరు మరింత మార్మోగిపోయింది. 1952లో నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇంతవరకు 14 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 2019లో 15వ సారి ఎన్నికలు జరుగుతున్నాయి. -
ఎలా ఖాళీ చేయిస్తారో చూస్తాం..
చీపురుపల్లి: చీపురుపల్లి పట్టణ శివారున శ్రీకాకుళానికి వెళ్లే రహదారిలో సర్వే నంబర్ 65లో గెడ్డవాగు ఉంది. కొందరు వ్యక్తులు ఆ వాగును పూడ్చేసి ఆక్రమించుకుని, చిన్న షెడ్డులు వేసేసి వ్యాపారాలు చేసుకుంటున్నారు. దీనిపై ఫిర్యాదులు అందడంతో రెవెన్యూ అధికారులు వారికి ఆరేడు నోటీసులు జారీ చేశారు. వారు స్పందించకపోవడంతో ఖాళీ చేయించేందుకు శనివారం అక్కడికి అధికారులు చేరుకున్నారు. వెంటనే ఖాళీ చేయాలని, లేకుంటే కఠిన చర్యలు ఉంటాయని నానా హడావుడి చేశారు. జెడ్పీటీసీ రంగ ప్రవేశంతో.. విషయం తెలుసుకున్న చీపురుపల్లి జెడ్పీటీసీ, అధికార పార్టీ నేత మీసాల వరహాలనాయుడు అక్కడికి చేరుకున్నారు. మండల వ్యాప్తంగా అన్ని చోట్ల ఆక్రమణలు జరిగాయి. వాటిని వదిలేసి ఇక్కడ పేదలు వేసుకున్న చిన్న వర్క్‌షాపులను తొలగించేందుకు వచ్చారా..? అవి మీకు కనిపించడం లేదా..? అని అధికారులను నిలదీశారు. ఒక దశలో మీరెలా ఖాళీ చేయిస్తారో చూస్తాం అంటూ హెచ్చరికలు జారీ చేశారు. పేదలకు సాయపడని అధికారులు ఎందుకు అని హుకుం జారీ చేశారు. అంతే అప్పటివరకు నానా హడావుడి చేసిన అధికారులు చప్పగా మారిపోయారు. చేతులు కట్టుకుని జెడ్పీటీసీ చెప్పినదానికి తలలు ఊపారు. అధికార పార్టీ నేత కావడంతో.. వరహాల నాయుడు అధికార పార్టీ నేత కావడంతో మళ్లీ ఎమ్మెల్యే, మంత్రి దృష్టికి తీసుకెళితే ఇబ్బందులు వస్తాయని తలచిన అధికారులు కిమ్మనకుండా ఉండిపోయారు. తహసీల్దార్ ముక్తేశ్వరరావు ఆదేశాలతో ఖాళీ చేయించేందుకు స్థానిక వీఆర్ఓ, ఆర్ఐ వసంత, ఇరిగేషన్ ఏఈ పవన్‌కుమార్, డీటీ కెఎస్ఎన్.మూర్తి తదితరులు వెళ్లారు. వారు చర్యలు ప్రారంభిస్తుండగా జెడ్పీటీసీ అక్కడి చేరుకుని సోమవారం వరకు సమయం కావాలని లేకుంటే ఖాళీ చేయమని బదులిచ్చారు. ఒకానొక సమయంలో రెవెన్యూ అధికారులు, విలేకర్లపై అసహనం వ్యక్తం చేశారు. అయితే డీటీ మూర్తి మూర్తి మాట్లాడుతూ సాయంత్రం వరకు సమయం ఇస్తున్నామని అప్పటికే ఖాళీ చేయాలని, తన చేతిలో ఏమీ లేదని స్పష్టం చేశారు. తర్వాత అధికారులు జెడ్పీటీసీ వేర్వేరుగా మాట్లాడుకుని, సాయంత్రానికి ఆక్రమణదారులే స్వచ్ఛందంగా ఖాళీ చేస్తారని హామీ ఇవ్వడంతో అధికారులు వెనుతిరిగారు. -
ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య
► రైలుకింద పడి బలవన్మరణం గరివిడి(చీపురుపల్లి): ఆ తల్లికి ఏ కష్టం వచ్చిందోగానీ ఇద్దరు బిడ్డలతో కలిసి రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. శుక్రవారం సాయంత్రం 4గంటలకు గాంధీధామ్ నుంచి పూరీ వైపు వెళ్లే స్పెషల్‌రైలు గరివిడి స్టేషన్లోకి ప్రవేశిస్తున్న సమయంలో ఓ గుర్తు తెలియని మహిళ ఐదేళ్లు, మూడేళ్లు వయసుగల ఇద్దరు కుమార్తెలతో అకస్మాత్తుగా రైలుకిందకు దూకింది. రెప్పపాటు కాలంలో వారి శరీరాలు నుజ్జునుజ్జు అయ్యాయి. వారు ఎవరో ఎక్కడినుంచి వచ్చారో తెలియదనీ స్టేషన్‌మాస్టర్ తెలిపారు. శ్రీకాకుళం సీఆర్పీఎఫ్, విజయనగరం ఆర్పీఎఫ్కు సమాచారం అందించామనీ, వారు వచ్చి దర్యాప్తు చేసిన తరువాత వారెక్కడినుంచి వచ్చారో తెలుస్తుందని తెలిపారు. -
గూడ్స్‌కు తృటిలో తప్పిన ప్రమాదం
విజయనగరం: విజయనగరం జిల్లా చీపురుపల్లి వద్ద శుక్రవారం ఉదయం గూడ్స్ రైలుకు తృటిలో ప్రమాదం తప్పింది. కుర్దా నుంచి విశాఖకు వస్తున్న గూడ్స్ రైలు వీల్ యాక్సిల్ నుంచి మంటలు చెలరేగడంతో లోకో పైలట్ గమనించి చీపురుపల్లి వద్ద రైలును నిలిపివేశాడు. ఈ విషయం తెలుసుకున్న విశాఖపట్టణం డీఆర్ఎం చంద్రలేఖ ముఖర్జీ ఘటనాస్ధలికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించటంతోనే పెను ప్రమాదం తప్పిందని ఆమె తెలిపారు. మరమ్మత్తుల అనంతరం రైలు తిరిగి మధ్యాహ్నం బయలుదేరుతుందని అధికారులు వెల్లడించారు. -
కారు-ఆటో ఢీ, ఒకరు దుర్మరణం
శ్రీకాకుళం: ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా.. 11 మందికి తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా చీపురుపల్లిలో సోమవారం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ఆటోను ఢీ కొట్టింది. ప్రమాదంలో ఆటోలో ఉన్న ఓ వ్యక్తి మృతి చెందగా మరో 11మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా.. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.