
మృతదేహం వద్ద విలపిస్తున్న కుటుంబ సభ్యులు
సాక్షి, చీపురుపల్లి(విజయనగరం) : బహిర్భూమికని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పట్టణంలోని శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయం సమీపంలోని తోటపల్లి కాలువలో మొండేటి లక్ష్మణ (30) అనే వ్యక్తి ప్రమాదవశాత్తూ జారిపడి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. ఈ మేరకు ఆయన భార్య దేవి ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం ఏఎస్‌ఐ రాజు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని లావేరు రోడ్‌కు చెందిన మొండేటి లక్ష్మణ బండిపై గాజులు విక్రయించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఏడాదిన్నర క్రితమే అదే ప్రాంతానికి చెందిన దేవితో వివాహం జరిగింది. సోమవారం సాయంత్రం బహిర్భూమికి వెళ్తానని చెప్పిన లక్ష్మణ చాలా సేపటి వరకు తిరిగి రాలేదు. అదే వీధికి చెందిన మరో వ్యక్తి వచ్చి తోటపల్లి కాలువ వద్ద పడి ఉన్నాడని చెప్పడంతో కుటుంబ సభ్యులు అంతా పరుగులు తీశారు. ప్రమాదవశాత్తూ జారి కాలువలో పడి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు, స్థానికులు చెబుతున్నారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్‌ఐ రాజు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment