అటు తిరిగి ఇటు తిరిగి కిమిడి కళా వెంకటరావు పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. చీపురుపల్లి నుంచి పోటీ చేయమని ఆయన్ను పార్టీ సూచించినట్లు సమాచారం. ఎచ్చెర్లలో పార్టీ శ్రేణులు కళాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు ఈ ప్రతిపాదన చేసినట్లు తెలిసింది. వాస్తవానికి ‘కళా’ను చీపురుపల్లి అసెంబ్లీకి పోటీ చేయాలని పార్టీ అధినేత మొదట్లోనే సూచించారు. కానీ ‘కళా’ అంగీకరించలేదు. విశాఖకు చెందిన గంటా శ్రీనివాసరావును చీపురుపల్లి పంపించి పోటీ చేయించాలని అనుకున్నారు. ఆయన కూడా అంగీకరించకపోవడంతో అక్కడ మంత్రి బొత్సపై పోటీకి సరైన అభ్యర్థి దొరకలేదు. దాంతో మళ్లీ కళా మెడలో గంట కట్టే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ విస్తృత బంధువర్గం, పరిచయాలు ఉన్న సీనియర్ నేత అయిన కళా అయితేనే బొత్సకు కొంత పోటీ ఇవ్వగలరన్నది చంద్రబాబు ఆలోచన. అదే సమయంలో ఎచ్చెర్లలో పంచాయితీని కూడా పరిష్కారం సాధించినట్లు అవుతుందని భావిస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఎచ్చెర్లలో స్వపక్షంలోనే వ్యతిరేకతను ఎదుర్కొంటున్న టీడీపీ నేత కిమిడి కళా వెంకటరావును నియోజకవర్గం మార్చే యోచనలో చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక్కడ కాకుండా చీపురుపల్లి నియోజకవర్గంలో బరిలో దించితే ఎలా ఉంటుందనేదానిపై ఐవీఆర్‌ఎస్ సర్వే కూడా చేయించారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును చీపురుపల్లి నుంచి పోటీ చేయించాలని చూసినా ఆయన ససేమిరా అనడంతో ప్రత్యామ్నాయంగా కళా వెంకటరావుపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఐవీఆర్‌ఎస్ సర్వే ప్రకారం కళాను బరిలో దించుతారా? లేదంటే అక్కడా సానుకూలత లేదని పక్కన పెట్టేస్తారా? అంత రిస్క్ చేయడమెందుకని ఓడిపోయే సీట్లలో ఎవరు పోటీ చేస్తే ఏముందని ఎచ్చెర్లకే వదిలేస్తారా? అన్నది ప్రస్తుతం టీడీపీలోనే చర్చనీయాంశంగా మారింది.
గ్రూపుల గోల..!
ఎచ్చెర్లలో టీడీపీ బలహీనంగా ఉంది. గత ఐదేళ్లలో ఆ పార్టీ ఏమాత్రం బలపడలేదు. సరికదా గ్రూపులుగా తయారై టీడీపీ శ్రేణులు విడిపోయి మరింత పట్టుకోల్పోయారు. గత ఎన్నికల్లో ఓటమి పాలైన దగ్గరి నుంచి ఇక్కడ వర్గపోరు నడుస్తోంది. మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావు ఒకవైపు, ఏఎంసీ మాజీ చైర్మన్ కలిశెట్టి అప్పలనాయుడు మరోవైపు గ్రూపుగా తయారై రాజకీయాలు చేస్తున్నారు. గుడ్డిలో మెల్ల అన్నట్టుగా ఎవరికి వారు బల ప్రదర్శన చేసుకుంటున్నారు. ఎన్నాళ్లు కళా వెంకటరావు పల్లకిమోస్తామని, ఈ సారి కలిశెట్టికి టికెట్ ఇవ్వాల్సిందేనని కొన్నాళ్లుగా టీడీపీలో ఓ గ్రూపు పట్టుబడుతూ వస్తోంది. చెప్పాలంటే కళా వెంకటరావుకు వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తోంది. చౌదరి బాబ్జీ తదితర నాయకులు సైతం కళా వెంకటరావుతో తాము వేగలేమని.. అణగదొక్కే రాజకీయాలు ఇంకెంత కాలమని స్వరం విన్పిస్తున్నారు. అనుకున్నట్టుగా చివరికొచ్చేసరికి కళాతో పోటీగా కలిశెట్టి రేసులో నిలబడ్డారు. ఇప్పుడు ఎవరికి టికెట్ ఇస్తారన్నదానిపై సస్పెన్స్ నెలకొంది.
రకరకాల సర్వేలు..
పొత్తులో భాగంగా బీజేపీకి ఇచ్చేస్తే సమస్యే లేదని ఒకవైపు ఆలోచిస్తుండగానే మరోవైపు కళా, కలిశెట్టిలో ఎవరి బెస్ట్ అన్నదానిపై ఐవీఆర్‌ఎస్‌తో పాటు రకరకాల సర్వేలను చంద్రబాబు చేయించారు. కొన్నింటిలో కలిశెట్టికి సానుకూలత రాగా, మరికొన్నింటిలో కళాకు అనుకూలంగా వచ్చినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో చీపురుపల్లి నియోజకవర్గం ఆ పార్టీకి గుదిబండగా తయారైంది. మంత్రి బొత్స సత్యనారాయణను ఢీకొట్టే నాయకత్వం అక్కడ లేకపోవడంతో చంద్రబాబు రకారకాల ఆలోచనలు చేస్తున్నారు. తరుచూ నియోజకవర్గాలు మార్చి ఎన్నికల్లో గట్టెక్కుతున్న గంటా శ్రీనివాసరావును అక్కడ బరిలో దించాలని చూసింది.
పార్టీకి సమస్యగా మారిన గంటాను ఈ రకంగానైనా వదిలించుకోవాలని చంద్రబాబు అండ్‌కో చూస్తోంది. దానిలో భాగంగా ఓడి పోయిన సీట్లలో గంటాను పోటీ చేయిస్తే పీడ విరగడయిపోతుందని భావించారు. కానీ, గంటా దాని కి ససేమిరా అంటున్నారు. బొత్సతో పోటీ చేయలేనని చెప్పేస్తున్నారు. ఓడిపోయి పరువు పోగొట్టుకోవడం కంటే పోటీ చేయకపోవడమే మంచిదన్న ఆలోచనకొచ్చి తన మనసులో మాటను అధిష్టానానికి చేప్పేశారు. కాకపోతే, పైరవీలు, లాబీయింగ్ చేసే గంటా తనదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో గంటా పోటీ చేసే సీటుపై ఆ పార్టీ అధిష్టానం పునరాలోచనలో పడింది.
ఈ క్రమంలో చీపురుపల్లి నుంచి కిమిడి కళా వెంకటరావును పోటీ చేయిస్తే ఎలా ఉంటుందనేదానిపై ఆలోచన చేస్తోంది. ఇప్పటికే ఐవీఆర్‌ఎస్ సర్వే కూడా చేయించింది. ఎచ్చెర్లలో ఎలాగూ కష్టం.. చీపురుపల్లిలో కనీసం పోటీ అయినా ఇచ్చి బొత్సతో ఢీకొనాలని చూస్తోంది. అందులో భాగంగానే చీపురుపల్లికి కళా వెంకటరావును పంపిస్తారని ఇప్పటికే ఎచ్చెర్ల నియోజకవర్గ టీడీపీ శ్రేణులకు సమాచారం వచ్చింది. బీజేపీకి ఎచ్చెర్ల ఇచ్చేస్తే.. సీనియర్‌కు కనీసం చీపురుపల్లిలోనైనా సీటు ఇచ్చి గౌరవం ఇచ్చామని చెప్పుకునేలా టీడీపీ అడుగులు వేస్తోంది. ఈ సమీకరణాలు చివరి వరకు నడుస్తాయా? లేదంటే ఆఖరి నిమిషంలో మారుతాయో తెలియదు గానీ ప్రస్తుతం చీపురుపల్లికి కళాను పంపించాలని చంద్రబాబు భావిస్తున్నట్టుగా సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment