సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ‘నువ్వెవడివి? నువ్వు ఎక్కడోడివి? నీకిక్కడేం పని? నువ్వు ఇన్‌చార్జివా? ఇన్‌చార్జి లేకుండా కార్యక్రమం ఏంటి? వేషాలు వేయకండి. తమాషా చేస్తున్నారా.. ఎక్కువ చేస్తే తరిమి తరిమి కొడతాం.’ ఇదీ శ్రీకాకుళం నియోజకవర్గ టీడీపీ నాయకుల భాష. శ్రీకాకుళం నగరంలోని టీడీపీలోని రెండు గ్రూపులు పాలకొండ రోడ్డుపై న్యూసెన్స్ చేశాయి.
ఇరువర్గాల నాయకులు, కార్యకర్తలు నడిరోడ్డుపైనే బాహాబాహీకి దిగారు. ఒకరినొకరు తోసుకుని నువ్వెంతంటే నువ్వెంత అని ఘర్షణ పడ్డారు. నియోజకవర్గ టికెట్ ఆశిస్తున్న గొండు శంకర్‌పై మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి అనుచరులు దాడికి దిగారు. బలవంతంగా తోసేసి అక్కడి నుంచి వెళ్లగొట్టారు. గంటకు పైగా ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేశారు.
ఐదేళ్లుగా వర్గపోరు..
శ్రీకాకుళం నియోజకవర్గ టీడీపీలో రెండు గ్రూపులు ఉన్నాయి. ఒక గ్రూపునకు మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి నాయకత్వం వహించగా, మరో గ్రూపునకు రూరల్ నాయకుడు గొండు శంకర్ నేతృత్వం వహిస్తున్నారు. వీరిద్దరి మధ్య ఐదేళ్లుగా వర్గపోరు నడుస్తోంది. పలుమార్లు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుని పోలీసు స్టేషన్‌ల వరకు వెళ్లారు. తాజాగా శ్రీకాకుళం కేంద్రంగా మరోసారి రోడ్డెక్కారు. రానున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇరువురు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. అధిష్టానం కూడా స్పష్టత ఇవ్వకుండా ఇద్దర్ని రెచ్చగొడుతోంది. టికెట్ తమకే అంటూ ఇద్దరూ ఆశతో కార్యక్రమాలు చేసుకుంటున్నారు.
నడిరోడ్డుపైనే వీరంగం..
ఈక్రమంలో బుధవారం ఉదయం శ్రీకాకుళం నగరంలోని రెల్లివీధిలో గొండు శంకర్ తన వర్గీయులతో కలిసి ఇంటింటికీ శంకరన్న కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. ఈ సమయంలో మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్‌ఛార్జి గుండ లక్ష్మీదేవి అనుచరులైన పట్టణ టీడీపీ అధ్యక్షుడు మాదారపు వెంకటే‹Ù, వార్డు ఇన్‌ఛార్జిలు కళ్యాణి వెంకటరావు, జలగడుగుల జగన్, కవ్వాడి సుశీల తదితరులు అక్కడికొచ్చి గొండు శంకర్‌ను అడ్డుకున్నారు.
అతను పట్టించుకోకుండా ముందుకెళ్లడంతో గుండ లక్ష్మీదేవీ వర్గీయులు రెచ్చిపోయారు. గొండు శంకర్‌ను అక్కడి నుంచి నెట్టేశారు. ఆయన అనుచరులను తోసేశారు. ఈ తోపులాట ప్రధాన రహదారిపైకి వచ్చేసింది. ఇరువర్గాలు ఘర్షణ పడ్డాయి. ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. ఇరు వర్గాల వీరంగంతో అక్కడున్న ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అధికారంలో లేనప్పుడు వీరింత అలజడి సృష్టిస్తున్నారంటే.. ఒకవేళ అధికారమిస్తే ఇంకెంత రెచ్చిపోతారోనని స్థానికులు చర్చించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment