శ్రీకాకుళం సీటును బీజేపీకి కేటాయించినట్టుగా సంకేతాలు
రోడ్డెక్కిన గుండ లక్ష్మీదేవి అనుచరులు
ఎంపీ రామ్మోహన్ నాయుడు ఇంటి బయట ధర్నా, అర్ధనగ్న ప్రదర్శన
భావోద్వేగానికి గురైన లక్ష్మీదేవి
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: శ్రీకాకుళం టీడీపీలో కమలం ప్రమేయం కల్లోలం రేపుతోంది. జిల్లా కేంద్రం అసెంబ్లీ సీటు బీజేపీకి కేటాయిస్తున్నారనే సంకేతాలతో మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి వర్గం ఆందోళనకు దిగింది. లక్ష్మీదేవి అనుచరులు తీవ్ర ఆవేదనకులోనై ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు ఇంటిని ముట్టడించారు. అనంతరం ఆయన నివాసంలోకి వెళ్లేందుకు యత్నించారు. ఈ క్రమంలో వాచ్‌మెన్‌పై దాడి చేశారు. ఎంపీ లేరని తెలుసుకుని ఇంటి బయట బైఠాయించి, అర్ధనగ్న ప్రదర్శన చేశారు. కింజరాపు రామ్మోహన్‌నాయుడు, అచ్చెన్నాయుడు ఆడుతున్న డ్రామాలో తాము బలైపోతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు.
శ్రీకాకుళం టిక్కెట్ కోసం గుండ లక్ష్మీదేవి, గొండు శంకర్ పోటీ పడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికీ ఈ రెండు వర్గాలు గొడవ పడుతున్నాయి. నువ్వెంత అంటే నువ్వెంత అని బాహాబాహీకి సైతం దిగాయి. ఇందులో గొండు శంకర్‌ను కింజరాపు ఫ్యామిలీ ప్రోత్సహిస్తోందని గుండ లక్ష్మీదేవి వర్గం తరుచూ ఆవేదన వ్యక్తం చేస్తోంది. అయినప్పటికీ సీటు వస్తుందన్న ఉద్దేశంతో లక్ష్మీదేవి పనిచేస్తూ వస్తున్నారు. ఆమెకు పోటీగా గొండు శంకర్ కూడా తగ్గేది లేదంటూ కాలు దువ్వుతున్నారు. లక్ష్మీదేవికే టిక్కెట్ అని ఒకవైపు, యూత్ కోటాలో శంకర్‌కు అని మరోవైపు ఆశలు కల్పించి చంద్రబాబు పబ్బం గడిపారు. చివరికి వచ్చేసరికి శ్రీకాకుళం సీటును బీజేపీకి కేటాయిస్తున్నారని సంకేతాలు పంపించారు. బీజేపీతో ఒప్పందం కూడా జరిగిపోయిందని, ఆ పార్టీ తరఫున రాయలసీమకు చెందిన సురేంద్రకుమార్ పోటీ చేస్తారని తొలుత, తర్వాత పైడి వేణుగోపాల్ పోటీ చేస్తారని తెరపైకి తెచ్చారు.
డ్రామానా.. చంద్రబాబు ఎత్తుగడా..!
సీటు బీజేపీకి కేటాయించేశారా? లేదంటే టీడీపీలో ఉన్న ఆశావహుల అభిప్రాయం తెలుసుకోవడానికి చంద్రబాబు అండ్‌కో డ్రామాలాడిందో తెలియదు గానీ శుక్రవారం సాయంత్రం అయ్యేసరికి గుండ లక్ష్మీదేవి వర్గం రోడ్డెక్కింది. టికెట్ కోసం తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు. అధిష్టానంతో టచ్‌లో ఉండే ఎంపీ రామ్మోహన్‌నాయుడు వద్ద తేల్చుకోవాలని భావించారు. ఆమేరకు ఆమె వర్గీయులంతా 80అడుగుల రోడ్డులో ఉన్న ఎంపీ రామ్మోహన్‌నాయుడు నివాసాన్ని ముట్టడించారు. తమకు అన్యాయం చేస్తున్నదంతా కింజరాపు ఫ్యామిలీ అన్నట్టుగా ఆందోళనకు దిగారు నిమిషాల్లోనే ఇంటిలోకి వెళ్లేందుకు యత్నించారు. అడ్డుకున్న వాచ్‌మెన్‌పై దాడి చేశారు.
మొత్తానికి లోపలికి వెళ్లేసరికి ఎంపీ లేకపోవడంతో కార్యాలయం అసిస్టెంట్‌తో మాట్లాడారు. ఎంపీ ఇక్కడ లేరని చెప్పడంతో ఫోన్‌లోనే ఎంపీతో మాట్లాడారు. మీ ఆవేదన అర్థమైందని, రెండో జాబితాలో లక్ష్మీదేవి పేరు లేకపోవడం బాధాకరంగా ఉందని, తన వంతుగా ప్రయత్నిస్తానని ఫోన్‌లోనే ఎంపీ రక్తి కట్టించారు. అయినప్పటికీ శాంతించలేదు. ఇదంతా ఎంపీ రామ్మోహన్‌నాయుడు, అచ్చెన్నాయుడు ఆడుతున్న డ్రామా అని బయటికొచ్చి బైఠాయించారు. అక్కడే అర్ధనగ్న ప్రదర్శన చేశారు. టైర్లు కూడా కాల్చుదామని వెంట పట్టుకుని వచ్చారు. ఎంత చేసినా ఫలితం కనిపించకపోవడంతో ఆందోళనకారులంతా గుండ లక్ష్మీదేవి ఇంటికి వెళ్లి సమావేశమయ్యారు.
ఎంపీ ఇంటి దగ్గర జరిగిన ఎపిసోడ్‌ను అప్పల సూర్యనారాయణ, లక్ష్మీదేవి దంపతులకు వివరించారు. ఎంపీ చెప్పిన విషయాలను తెలియజేశారు. ఈ క్రమంలో కొందరు జోక్యం చేసుకుని అదంతా డ్రామాయేనని, రెండు జాబితాల్లోనూ పేరు లేదనే విషయం ఎంపీకీ తెలియదా... బాబాయ్, అబ్బాయ్ కలిసి తమను తొక్కేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం లోగా లక్ష్మీదేవి పేరు రాకపోతే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని, ఆత్మహత్యలకు సైతం సిద్ధపడతామంటూ హెచ్చ రించారు. ఈ సందర్భంగా అప్పల సూర్యనారాయణ మాట్లాడుతూ అనాదిగా తమను తొక్కేస్తున్నారని, గత ఏడాదికి పైగా వర్గపోరు నడుస్తోందని చెప్పినా, అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు.
సీనియర్‌నైన తనకు అన్యాయం చేస్తున్నారని బాధపడ్డారు. వ్యక్తిగతంగా ఇష్టంలేకపోయినా అచ్చెన్నాయుడ్ని లక్ష్మీదే వి కలిసి మొర పెట్టుకున్నా పట్టించుకోలేదన్నారు. ఈ సందర్భంగా లక్ష్మీదేవి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. కంటతడి కూడా పెట్టారు. మొత్తానికి టీడీపీలో ప్రస్తుతం జరుగుతున్నది డ్రామానా? చంద్రబాబు వేసిన ఎత్తుగడా అన్నది త్వరలోనే తేలనుంది.
Comments
Please login to add a commentAdd a comment