‘సొమ్ము’ సిల్లెను బాబయో! | TDP Ticket Controversy In Srikakulam: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

‘సొమ్ము’ సిల్లెను బాబయో!

Published Wed, Jan 24 2024 6:04 AM | Last Updated on Sat, Feb 3 2024 9:33 PM

TDP Ticket Controversy In Srikakulam: Andhra Pradesh - Sakshi

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆడిన డబుల్‌ గేమ్‌కు కీలక నాయకులు బలయ్యారు. నిర్వీర్యమైన పార్టీ కోసం ఇన్నాళ్లూ డబ్బులు ఖర్చుపెట్టిన నేతలు ఇప్పుడు టికెట్‌ కోసం అర్రులు చాస్తున్నారు. అధిష్టానం పెడుతున్న కండిషన్లు, చేస్తున్న పైరవీలు చూసి ఖిన్నులవుతున్నారు. రొక్కమాడితేనే రాజకీయం, భారీగా ముట్టజెప్పినోడికే టికెట్లు అనే పరిస్థితి పార్టీలో నెలకొనడంతో తీవ్రంగా కలత చెందుతున్నారు. ప్రస్తుతానికి వారు నిశ్శబ్దంగా ఉన్నా.. టికెట్లు ఖరారు చేశాక పార్టీలో ముసలం తప్పదనే వాదన అంతర్గతంగా వ్యక్తమవుతోంది.  

గుండ, గొండుల్లో ఎవరికి!
శ్రీకాకుళం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, యువ నాయకుడు గొండు శంకర్‌ టీడీపీ టికెట్‌ ఆశిస్తున్నారు. ఇప్పటివరకు వీరిలో ఒకరిని చంద్రబాబు, మరొకరిని లోకేశ్‌ ప్రోత్సహించారు. ఇద్దరూ పార్టీ కోసం గట్టిగానే ఖర్చు పెట్టారు. అయితే ఇప్పుడు ఎక్కువ ఖర్చుపెట్టిన వారికే టికెట్‌ అంటూ లీకులు ఇస్తుండడంతో లక్ష్మీదేవి, శంకర్‌ ఖిన్నులవుతున్నారు.  

‘గోవిందా’.. వెంకటరమణ
పాతపట్నం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ, యువ నాయకుడు మామిడి గోవిందరావు టికెట్‌ రేసులో ఉన్నారు. వీరిలో కలమట వెంకటరమణను కింజరాపు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్‌నాయుడు ప్రోత్సహిస్తుండగా, మామిడి గోవిందరావును లోకేశ్‌ ప్రోత్సహిస్తున్నా­రు. వీరిలో మామిడి గోవిందరావుతో చాలా ఖర్చు పెట్టించారు. ఇప్పుడు టికెట్‌కు రేటుగట్టి బేరసారాలకు దిగడంతో ఆశావహులు బిత్తరపోతున్నారు.  

కలిశెట్టి ‘కళా’విహీనం
ఎచ్చెర్ల నియోజకవర్గంలో టీడీపీ పోలిట్‌ బ్యూరో సభ్యులు కళా వెంకటరావు, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ కలిశెట్టి అప్పలనాయుడి మధ్య టికెట్‌ పోరు నడుస్తోంది. 2019లో అధికారం కోల్పోయాక కొన్నాళ్లు కళా స్తబ్ధుగా ఉండిపోవడంతో కలిశెట్టి క్రియాశీలకం అయ్యారు. పార్టీ కోసం భారీగా ఖర్చుపెట్టారు. ఒక దశలో టికెట్‌కు హామీ కూడా లభించింది. ఇప్పుడు అధిష్టానం మాట మార్చడంతో  కలిశెట్టి అప్పలనాయుడు సందిగ్ధంలో పడ్డారు. 

‘బగ్గు’.. భగ్గు
నరసన్నపేట నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తిని ఒకవైపు ప్రోత్సహిసూ్తనే మరోవైపు మాజీ ఎమ్మెల్యే బగ్గు లక్ష్మణరావు కుమారుడు, డాక్టర్‌ బగ్గు శ్రీనివాసరావును చంద్రబాబు, లోకేశ్‌ తెరపైకి తెచ్చారు. తండ్రీకొడుకులు చెరోవైపున ఉండి గేమ్‌ ఆడారు. చివరకు ఇప్పుడు ఎంతైనా ఖర్చుపెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని బగ్గు శ్రీనివాస్‌వైపే మొగ్గు చూపిస్తుండడంతో బగ్గు రమణమూర్తి ఆందోళన చెందుతున్నారు. 

వద్దన్న వజ్జ.. తాతారావు టాటా..
పలాస నియోజకవర్గంలో గౌతు శిరీష, వజ్జ బాబూరావు, జుత్తు తాతారావులను టికెట్‌ ఆశ చూపి పెదబాబు, చినబాబు ప్రోత్సహించారు. అయితే ఇప్పుడు భారీగా డబ్బులు పెట్టాలి్సన వ్యవహారం కావడంతో వజ్జ బాబూరావు, జుత్తు తాతారావు వెనక్కి తగ్గినట్టు సమాచారం.   

ఆశ చూపిన తండ్రీకొడుకులు 
ఇన్నాళ్లూ ఒక్కో నియోజకవర్గంలో ఇద్దరు, ముగ్గురికి టికెట్ల ఆశ చూపిన టీడీపీ అధినేత బాబు, ఆయన తనయుడు లోకేశ్‌ ఇప్పుడు డబ్బుంటేనే తమ వద్దకు రావాలని కరాఖండీగా చెబుతున్నారు. పార్టీకెంత ఇస్తా­రు? ఎంత ఖర్చుపెడతారంటూ బేరసారాలు ఆడుతున్నా­రు. దీంతో విస్తుపోవడం నేతల వంతవుతోంది. ఇప్పటివరకు పార్టీ కోసం ఖర్చు పెట్టించి ఇప్పుడు ఇలా చేయడం న్యాయం కాదని కొందరు నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement