పిచ్చి కాకపొతే.. పోయిపోయి మైక్ టైసన్‌తో పోరాడాలని ఎవరనుకుంటారు.. హుస్సేన్ బోల్ట్‌తో పరుగెత్తాలని ఎందుకనుకుంటారు. షార్క్‌తో సెల్ఫీ దిగాలని ఎందుకనుకుంటారు. అలాగే రాజకీయంగా చూస్తే కొన్ని కొన్ని నియోజకవర్గాల జోలికి పోకూడదని కూడా అనుకుంటారు.. వాటిల్లో చీపురుపల్లి ఒకటి. ఇక్కణ్ణుంచి వైయస్సార్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మంత్రి బొత్స ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈపాలి ఆయన్ను ఎలాగైనా ఓడించాలని చంద్రబాబు కూడా శతథా ప్రయత్నిస్తున్నారు.
వాస్తవానికి ఇక్కడ 2014 లో గెలిచిన కిమిడి మృణాళిని అప్పటి టీడీపీ ప్రభుత్వంలో కొన్నాళ్ళు మంత్రిగా చేసారు అయితే ఆ తరువాత 2019 లో ఆవిడకు బదులుగా కొడుకు నాగార్జునను రంగంలోకి దించారు కానీ సత్తిబాబు ఎత్తులు... అనుభవం... వీటిముందు నాగార్జున నిలవలేదు. ఓడిపోయారు.. ఈసారి కూడా మళ్ళీ అక్కడ పోటీ చేసేందుకు నాగార్జున ప్రయత్నాలు చేస్తున్నారు.. స్థానికంగానే ఉంటూ పదిమందినీ కలుస్తూ గతంలో ఓడిపోయినా సానుభూతి మిక్స్ చేసి గెలుద్దాం అని ఆశిస్తున్నారు. అయితే ఈ తరుణంలో విశాఖకు చెందిన గంటా శ్రీనివాసుని చీపురుపల్లిలో దించుతారని లీకులొచ్చాయి.
ఒక్కో ఎన్నికకు ఒక్కో నియోజకవర్గం మారే గంటా ఈసారి ఏకంగా జిల్లా క్రాస్ చేసేసి విజయనగరం వచ్చి బొత్స మీద పోటీ చేస్తారని అన్నారు.. గంటా కూడా తక్కువైనోడు కాదు.. పక్కా గెలుపు అనిపిస్తేనే నియోజకవర్గం మారతాడు తప్ప ఇలా సింహానికి ఎదురెళ్లే రకం కాదు. సేఫ్ గేమ్ ఆడతాడు తప్ప ప్రయోగాలు చేసేందుకు ఏమాత్రం సిద్ధపడని రకం అయన. అలాంటి వ్యక్తి బొత్సకు ఎదురెళ్లి ఓటమిని కొనితెచ్చుకోవాలాలని ఎందుకు అనుకుంటాడు. అందుకే నేను రానుగాకరాను అనేశాడు... దీంతో రెండో కృష్ణుడు ఎవరబ్బా అని చూస్తే సీనియర్ నాయకుడు కిమిడి కళా వెంకట్రావు కనిపించారు.. ఆయన్ను పెద్దాయన మీరైతేనే బొత్సను ఓడిస్తారు.. చీపురుపల్లి వెళ్ళండి అన్నారట చంద్రబాబు.. దీనికి ఆ పెద్దాయన...' బాబుగారు నాకు టిక్కెట్ ఇవ్వకుంటే మానేయండి అంతేకానీ బొత్సకు ఎదురుగా పోటీ చేయమని చెప్పకండి.. ఎందుకంటే ఈ వయసులో నేను చికెన్ షాప్ ముందు తొడగొట్టలేను సారీ అని తప్పుకున్నట్లు చెబుతున్నారు.
అలా ఇలా కాదని ఇంకో కాపు అభ్యర్థిని తెరముందుకు తెచ్చిన చంద్రబాబు ఆమెను సైతం చీపురుపల్లి వెళ్లాలని కోరారట. 2014 లో విజయనగరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మీసాల గీతకు చీపురుపల్లి టిక్కెట్ ఇస్తాను... వెళ్లి బొత్స మీద పోటీ చేయండి అన్నారట.. గంటా, కళా వంటి పెద్దలే పారిపోతుంటే నేనెళ్ళి ఎందుకు ఓటమిని మోయాలి అంటూ ఆబ్బె.. నాకు వద్దండి... అది తప్ప ఇంకేదైనా ఇవ్వండి అని గీత కూడా చంద్రబాబు దగ్గర కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు చీపురుపల్లికి టీడీపీ అభ్యర్థి దొరకడం లేదట.. ఖర్చులు మొత్తం పార్టీ తరఫున పెట్టుకుంటాం.. పోటీ చేయండి అంటున్నా ఎవరూ రావడం లేదని టీడీపీ వర్గాలు బావురుమంటున్నాయి.
::: సిమ్మాదిరప్పన్న
Comments
Please login to add a commentAdd a comment