Etcherla Assembly constituency
-
కళా వెంకటరావు మెడకు చీపురుపల్లి గంట
అటు తిరిగి ఇటు తిరిగి కిమిడి కళా వెంకటరావు పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. చీపురుపల్లి నుంచి పోటీ చేయమని ఆయన్ను పార్టీ సూచించినట్లు సమాచారం. ఎచ్చెర్లలో పార్టీ శ్రేణులు కళాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు ఈ ప్రతిపాదన చేసినట్లు తెలిసింది. వాస్తవానికి ‘కళా’ను చీపురుపల్లి అసెంబ్లీకి పోటీ చేయాలని పార్టీ అధినేత మొదట్లోనే సూచించారు. కానీ ‘కళా’ అంగీకరించలేదు. విశాఖకు చెందిన గంటా శ్రీనివాసరావును చీపురుపల్లి పంపించి పోటీ చేయించాలని అనుకున్నారు. ఆయన కూడా అంగీకరించకపోవడంతో అక్కడ మంత్రి బొత్సపై పోటీకి సరైన అభ్యర్థి దొరకలేదు. దాంతో మళ్లీ కళా మెడలో గంట కట్టే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ విస్తృత బంధువర్గం, పరిచయాలు ఉన్న సీనియర్ నేత అయిన కళా అయితేనే బొత్సకు కొంత పోటీ ఇవ్వగలరన్నది చంద్రబాబు ఆలోచన. అదే సమయంలో ఎచ్చెర్లలో పంచాయితీని కూడా పరిష్కారం సాధించినట్లు అవుతుందని భావిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఎచ్చెర్లలో స్వపక్షంలోనే వ్యతిరేకతను ఎదుర్కొంటున్న టీడీపీ నేత కిమిడి కళా వెంకటరావును నియోజకవర్గం మార్చే యోచనలో చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక్కడ కాకుండా చీపురుపల్లి నియోజకవర్గంలో బరిలో దించితే ఎలా ఉంటుందనేదానిపై ఐవీఆర్ఎస్ సర్వే కూడా చేయించారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును చీపురుపల్లి నుంచి పోటీ చేయించాలని చూసినా ఆయన ససేమిరా అనడంతో ప్రత్యామ్నాయంగా కళా వెంకటరావుపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఐవీఆర్ఎస్ సర్వే ప్రకారం కళాను బరిలో దించుతారా? లేదంటే అక్కడా సానుకూలత లేదని పక్కన పెట్టేస్తారా? అంత రిస్క్ చేయడమెందుకని ఓడిపోయే సీట్లలో ఎవరు పోటీ చేస్తే ఏముందని ఎచ్చెర్లకే వదిలేస్తారా? అన్నది ప్రస్తుతం టీడీపీలోనే చర్చనీయాంశంగా మారింది. గ్రూపుల గోల..! ఎచ్చెర్లలో టీడీపీ బలహీనంగా ఉంది. గత ఐదేళ్లలో ఆ పార్టీ ఏమాత్రం బలపడలేదు. సరికదా గ్రూపులుగా తయారై టీడీపీ శ్రేణులు విడిపోయి మరింత పట్టుకోల్పోయారు. గత ఎన్నికల్లో ఓటమి పాలైన దగ్గరి నుంచి ఇక్కడ వర్గపోరు నడుస్తోంది. మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావు ఒకవైపు, ఏఎంసీ మాజీ చైర్మన్ కలిశెట్టి అప్పలనాయుడు మరోవైపు గ్రూపుగా తయారై రాజకీయాలు చేస్తున్నారు. గుడ్డిలో మెల్ల అన్నట్టుగా ఎవరికి వారు బల ప్రదర్శన చేసుకుంటున్నారు. ఎన్నాళ్లు కళా వెంకటరావు పల్లకిమోస్తామని, ఈ సారి కలిశెట్టికి టికెట్ ఇవ్వాల్సిందేనని కొన్నాళ్లుగా టీడీపీలో ఓ గ్రూపు పట్టుబడుతూ వస్తోంది. చెప్పాలంటే కళా వెంకటరావుకు వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తోంది. చౌదరి బాబ్జీ తదితర నాయకులు సైతం కళా వెంకటరావుతో తాము వేగలేమని.. అణగదొక్కే రాజకీయాలు ఇంకెంత కాలమని స్వరం విన్పిస్తున్నారు. అనుకున్నట్టుగా చివరికొచ్చేసరికి కళాతో పోటీగా కలిశెట్టి రేసులో నిలబడ్డారు. ఇప్పుడు ఎవరికి టికెట్ ఇస్తారన్నదానిపై సస్పెన్స్ నెలకొంది. రకరకాల సర్వేలు.. పొత్తులో భాగంగా బీజేపీకి ఇచ్చేస్తే సమస్యే లేదని ఒకవైపు ఆలోచిస్తుండగానే మరోవైపు కళా, కలిశెట్టిలో ఎవరి బెస్ట్ అన్నదానిపై ఐవీఆర్ఎస్తో పాటు రకరకాల సర్వేలను చంద్రబాబు చేయించారు. కొన్నింటిలో కలిశెట్టికి సానుకూలత రాగా, మరికొన్నింటిలో కళాకు అనుకూలంగా వచ్చినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో చీపురుపల్లి నియోజకవర్గం ఆ పార్టీకి గుదిబండగా తయారైంది. మంత్రి బొత్స సత్యనారాయణను ఢీకొట్టే నాయకత్వం అక్కడ లేకపోవడంతో చంద్రబాబు రకారకాల ఆలోచనలు చేస్తున్నారు. తరుచూ నియోజకవర్గాలు మార్చి ఎన్నికల్లో గట్టెక్కుతున్న గంటా శ్రీనివాసరావును అక్కడ బరిలో దించాలని చూసింది. పార్టీకి సమస్యగా మారిన గంటాను ఈ రకంగానైనా వదిలించుకోవాలని చంద్రబాబు అండ్‌కో చూస్తోంది. దానిలో భాగంగా ఓడి పోయిన సీట్లలో గంటాను పోటీ చేయిస్తే పీడ విరగడయిపోతుందని భావించారు. కానీ, గంటా దాని కి ససేమిరా అంటున్నారు. బొత్సతో పోటీ చేయలేనని చెప్పేస్తున్నారు. ఓడిపోయి పరువు పోగొట్టుకోవడం కంటే పోటీ చేయకపోవడమే మంచిదన్న ఆలోచనకొచ్చి తన మనసులో మాటను అధిష్టానానికి చేప్పేశారు. కాకపోతే, పైరవీలు, లాబీయింగ్ చేసే గంటా తనదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో గంటా పోటీ చేసే సీటుపై ఆ పార్టీ అధిష్టానం పునరాలోచనలో పడింది. ఈ క్రమంలో చీపురుపల్లి నుంచి కిమిడి కళా వెంకటరావును పోటీ చేయిస్తే ఎలా ఉంటుందనేదానిపై ఆలోచన చేస్తోంది. ఇప్పటికే ఐవీఆర్ఎస్ సర్వే కూడా చేయించింది. ఎచ్చెర్లలో ఎలాగూ కష్టం.. చీపురుపల్లిలో కనీసం పోటీ అయినా ఇచ్చి బొత్సతో ఢీకొనాలని చూస్తోంది. అందులో భాగంగానే చీపురుపల్లికి కళా వెంకటరావును పంపిస్తారని ఇప్పటికే ఎచ్చెర్ల నియోజకవర్గ టీడీపీ శ్రేణులకు సమాచారం వచ్చింది. బీజేపీకి ఎచ్చెర్ల ఇచ్చేస్తే.. సీనియర్‌కు కనీసం చీపురుపల్లిలోనైనా సీటు ఇచ్చి గౌరవం ఇచ్చామని చెప్పుకునేలా టీడీపీ అడుగులు వేస్తోంది. ఈ సమీకరణాలు చివరి వరకు నడుస్తాయా? లేదంటే ఆఖరి నిమిషంలో మారుతాయో తెలియదు గానీ ప్రస్తుతం చీపురుపల్లికి కళాను పంపించాలని చంద్రబాబు భావిస్తున్నట్టుగా సమాచారం. -
సాక్షి విలేకరి ‘గురిజా’ మృతిపై వాస్తవాలు నిగ్గుతేల్చాలి
రణస్థలం: శ్రీకాకుళం జిల్లా లావేరు సాక్షి విలేకరి గురిజా దామోదరరావు మృతి బాధాకరమని ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్ అన్నారు. రణస్థలంలోని ఓ ప్రైవేటు కల్యాణ మండపంలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. తన పెదనాన్న గొర్లె శ్రీరాములునాయుడుకు, దామోదరరావు తండ్రి తవిటయ్యతో మంచి అనుబంధం ఉందని, దామోదర్ కుటుంబ సభ్యులతో తనకు ఎలాంటి విభేదాల్లేవని చెప్పారు. విపక్షాలు దీనిపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని ఆరోపించారు. వాస్తవాలు తెలీకుండా టీడీపీ నేతలు కళా వెంకటరావు, చంద్రబాబు స్పందించిన తీరు శవాలపై రాజకీయం చేసేలా ఉందని విమర్శించారు. దీనిపై పోలీసులు లోతైన విచారణ జరిపి నిజా నిజాలు నిగ్గు తేల్చాలని కోరారు. ఈ ఘటనపై ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశానని, దామోదర్ నాలుగు నెలలు ఎవరితో ఎక్కువ మాట్లాడారో కాల్స్ పరిశీలిస్తే వాస్తవాలు బయటపడతాయన్నారు. దామోదర్ కుటుంబ సభ్యులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఎచ్చెర్ల ఎంపీపీ మొదలవలస చిరంజీవి మాట్లాడుతూ కళా వెంకటరావు రాజకీయ లబ్ధి కోసమే దామోదర్ మృతిని రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ఎనిమిదేళ్ల కిందట కళా వెంకటరావు తన తమ్ముడినే చంపేశాడని కుటుంబ సభ్యులే కేసు పెట్టారని, ఆయన మంత్రిగా ఉన్నప్పుడు వేధించారంటూ వంగర ఎస్ఐ, కళాతో పాటు ఆయన పీఏపైనా కేసు పెట్టారని గుర్తు చేశారు. టీడీపీ నేతలు వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు లావేటిపాలెం వైఎస్సార్సీపీ నేతలు, మృతుడి బంధువులైన లావేరు ఎంపీటీసీ ఇనపకుర్తి సతీష్, ఇనపకుర్తి చంద్రశేఖర్, సగరం విశ్వనాథం మాట్లాడుతూ దామోదర్ ఎనిమిది నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని తెలిపారు. టీడీపీ నేత జగ్గన్న దొరకు దామోదర్ రూ.10 లక్షలు అప్పు ఇచ్చాడని, ఆ డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో ఇబ్బంది పడుతున్నట్లు దామోదర్ చెప్పాడని పేర్కొన్నారు. వాస్తవాలకు విరుద్ధంగా ఎమ్మెల్యే కిరణ్‌కుమార్, లంకలపల్లి గోపిపై ఆరోపణలు చేస్తున్నారని, సూసైడ్ లెటర్ కూడా టీడీపీ వాళ్లు పెట్టించి ఉంటారని ఆరోపించారు. -
బొత్స పలాయన మంత్రం
శ్రీకాకుళం: తమ ఘనకార్యాలతో సొంత జిల్లాలో ‘రచ్చ రచ్చ’అయిన బొత్స సత్యనారాయణ కుటుంబం ప్రత్యామ్నాయ స్థానాల కోసం వెతుకులాట ప్రారంభించింది. విజయనగరం జిల్లాలో ప్రజాగ్రహం వ్యక్తమవుతుండటంతో పక్కనున్న శ్రీకాకుళం జిల్లాపై కన్నేసింది. ఈ జిల్లాలోని ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తన కుటుంబ సభ్యుల్లో ఒకరిని బరిలో నిలపాలని బొత్స నిర్ణయించారు. అందుకోసం సిట్టింగ్ ఎమ్మెల్యే మీసాల నీలకంఠం నాయుడుకు పొగ పెట్టేశారు. అనంతరం తామే ఎచ్చెర్ల నుంచి పోటీ చేస్తామని ఆ నియోజకవర్గ నేతలకు స్పష్టం చేశారు. విజయనగరంలో సీన్ కాలిపోయింది... విజయనగరం జిల్లాలో పదేళ్లుగా బొత్స కుటుంబం సాగిస్తున్న ఆగడాలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కొన్ని నెలల క్రితం సమైక్యాంధ్ర ఉద్యమం సందర్భంగా భారీ సంఖ్యలో విద్యార్థులు, మహిళలు బొత్స ఇంటిని ముట్టడించారు. జిల్లాను ఏలుతున్న బొత్స కుటుంబాన్ని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించారు. దాంతో తమ కుటుంబంపై ప్రజల్లో వెల్లువెత్తుతున్న ప్రజావ్యతిరేకత ఏమిటో బొత్సవారికి తెలిసొచ్చింది. రానున్న ఎన్నికల్లో జిల్లాలో పరాభవం తప్పదని బొత్స ఆనాడే నిర్ధారణకు వచ్చేశారు. ప్రస్తుతం బొత్స కుటుంబం నుంచి నలుగురు ప్రజాప్రతినిధులు ఉన్నారు. వచ్చే ఎన్నికల అనంతరం కనీసం ఒక్కరైనా చట్టసభ సభ్యుడిగా ఉండాలంటే ఏం చేయాలా? అని మథనపడుతున్న బొత్స కన్ను పొరుగున ఉన్న శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంపై పడింది. ‘మీసాల’కు పొగ ఎచ్చెర్ల అసెంబ్లీ స్థానం విజయనగరం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. ప్రస్తుతం విజయనగరం ఎంపీగా బొత్స భార్య ఝాన్సీ ఉన్నారు. ఎచ్చెర్ల ఎమ్మెల్యేగా సీనియర్ నేత మీసాల నీలకంఠం ఉన్నారు. వాస్తవానికి బొత్స రాజకీయ వైభవానికి మీసాల ప్రధాన కారకుడు. ప్రస్తుతం బొత్స ప్రాతినిధ్యం వహిస్తున్న విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గాన్ని ఆయన 2004లో బొత్సకు త్యాగం చేశారు. ఆయన స్వచ్ఛంద అంగీకారంతోనే ఆ నియోజకవర్గాన్ని అప్పట్లో బొత్సకు కేటాయించారు. అనంతరం బొత్స రాష్ట్ర మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా ఎదిగారు. తన రాజకీయ ఉన్నతికి కారకుడైన నీలకంఠం నాయుడుకే ఇప్పుడు బొత్స పొగ బెట్టారు. వ్యూహాత్మకంగా నీలకంఠానికి వ్యతిరేకంగా అసమ్మతిని ప్రోత్సహించారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో కథను క్లైమాక్స్‌కు తీసుకువచ్చారు. బొత్స మేనల్లుడు చిన్న శ్రీను ఎచ్చెర్ల నియోజకవర్గ నేతలను విజయనగరంలోని తన నివాసానికి బుధవారం పిలిపించుకున్నారు. నీలకంఠం అయితే ఎన్నికల్లో ఓడిపోతారనే వాదనను కూడగట్టారు. అనంతరం కాసేపటికే బొత్స సత్యనారాయణ అక్కడికి చేరుకున్నారు. అసలు విషయం చెప్పకుండా పథకం ప్రకారం బొత్స వారిని ఒప్పించారు. వారి సమక్షంలోనే ఎచ్చెర్ల ఎమ్మెల్యే నీలకంఠం నాయుడుకు ఫోన్ చేశారు. ‘మీపట్ల నేతలు, కార్యకర్తలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎంత ఖర్చు చేస్తారు?.. పరిస్థితి ఏమీ బాగా లేదు..’అని నిందాపూర్వకంగా మాట్లాడారు. దాంతో నీలకంఠం నాయుడు తీవ్ర మనస్థాపానికి గురైనట్లు తెలుస్తోంది. పరిస్థితి గ్రహించిన ఆయన బొత్స కుటుంబానికి దారిచ్చేశారు. ‘వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేయను. మీ ఇష్టం. ఎవరినైనా చూసుకోండి’అని చెప్పేశారు. ‘మేమే పోటీ చేస్తాం...’ అనంతరం బొత్స ఎచ్చెర్ల నియోజకవర్గ నేతలతో అసలు విషయం చెప్పారు. ‘మీలో ఎవరైనా ఎచ్చెర్ల నుంచి పోటీ చేస్తారా?’అని మొదట అడిగారు. చేయలేమని వారు చెప్పారు. అలా అయితే తమ కుటుంబం నుంచే ఒకరు పోటీ చేస్తారని బొత్స వెల్లడించారు. అదే విధంగా విజయనగరం ఎంపీగా కూడా తమ కుటుంబ సభ్యులే పోటీ చేస్తారు కాబట్టి అందరూ తమ మాటకు కట్టుబడాలన్నారు. కానీ ఎచ్చెర్ల ఎమ్మెల్యేగా ఎవరు పోటీ చేస్తారు?... విజయనగరం ఎంపీగా ఎవరు పోటీ చేస్తారనే విషయాన్ని మాత్రం వెల్లడించకుండా జాగ్రత్తపడ్డారు. ఎన్నికల నాటి పరిస్థితిని బట్టి ఎచ్చెర్ల నుంచి తానుగానీ, తన భార్య ఝాన్సీగానీ పోటీ చేయాలన్నది బొత్స వ్యూహంగా ఉంది. అంతవరకు తన మేనల్లుడు చిన్న శ్రీనుతో ఎచ్చెర్లలో పార్టీ వ్యవహారాలను నడిపించాలన్నది ఆయన ఆలోచన. అందుకే ఎచ్చెర్ల అభ్యర్థి ఎవరన్నది ముందే ప్రకటించకుండా జాగ్రత్త పడ్డారు. బెడిసికొట్టిన పన్నాగం ఎంత పక్కాగా కథ నడిపించినప్పటికీ బొత్సకు ఊహించని రీతిలో ఎదురుదెబ్బ తగిలింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఎచ్చెర్ల నియోజకవర్గానికి చెందిన మెజార్టీ నేతలు తాము కాంగ్రెస్‌లో కొనసాగలేమని తేల్చిచెప్పారు. వైఎస్ఆర్సీపీలో చేరాలనుకుంటున్న విషయాన్నీ స్పష్టం చేశారు. లావేరు మాజీ ఎంపీపీ దన్నాన రాజి నాయుడు తదితరులు తాము కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తామన్నారు. మాజీ జెడ్పీటీసీ సభ్యుడు, ఏఎంసీ చైర్మన్ తదితరులు కూడా తాము బొత్స తో కలసి పనిచేయలేమని చెప్పారు. ఎచ్చెర్ల నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు ఒకటి రెండు రోజుల్లో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించుకోవాలని భావిస్తున్నారు. దీంతో బొత్స కుటుంబీకులు ఇక్కడి నుంచి పోటీ చేసినా గెలిచే పరిస్థితి లేదని తెలుస్తోంది.