బొత్స పలాయన మంత్రం
శ్రీకాకుళం: తమ ఘనకార్యాలతో సొంత జిల్లాలో ‘రచ్చ రచ్చ’అయిన బొత్స సత్యనారాయణ కుటుంబం ప్రత్యామ్నాయ స్థానాల కోసం వెతుకులాట ప్రారంభించింది. విజయనగరం జిల్లాలో ప్రజాగ్రహం వ్యక్తమవుతుండటంతో పక్కనున్న శ్రీకాకుళం జిల్లాపై కన్నేసింది. ఈ జిల్లాలోని ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తన కుటుంబ సభ్యుల్లో ఒకరిని బరిలో నిలపాలని బొత్స నిర్ణయించారు. అందుకోసం సిట్టింగ్ ఎమ్మెల్యే మీసాల నీలకంఠం నాయుడుకు పొగ పెట్టేశారు. అనంతరం తామే ఎచ్చెర్ల నుంచి పోటీ చేస్తామని ఆ నియోజకవర్గ నేతలకు స్పష్టం చేశారు.
విజయనగరంలో సీన్ కాలిపోయింది...
విజయనగరం జిల్లాలో పదేళ్లుగా బొత్స కుటుంబం సాగిస్తున్న ఆగడాలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కొన్ని నెలల క్రితం సమైక్యాంధ్ర ఉద్యమం సందర్భంగా భారీ సంఖ్యలో విద్యార్థులు, మహిళలు బొత్స ఇంటిని ముట్టడించారు. జిల్లాను ఏలుతున్న బొత్స కుటుంబాన్ని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించారు. దాంతో తమ కుటుంబంపై ప్రజల్లో వెల్లువెత్తుతున్న ప్రజావ్యతిరేకత ఏమిటో బొత్సవారికి తెలిసొచ్చింది. రానున్న ఎన్నికల్లో జిల్లాలో పరాభవం తప్పదని బొత్స ఆనాడే నిర్ధారణకు వచ్చేశారు. ప్రస్తుతం బొత్స కుటుంబం నుంచి నలుగురు ప్రజాప్రతినిధులు ఉన్నారు. వచ్చే ఎన్నికల అనంతరం కనీసం ఒక్కరైనా చట్టసభ సభ్యుడిగా ఉండాలంటే ఏం చేయాలా? అని మథనపడుతున్న బొత్స కన్ను పొరుగున ఉన్న శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంపై పడింది.
‘మీసాల’కు పొగ
ఎచ్చెర్ల అసెంబ్లీ స్థానం విజయనగరం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. ప్రస్తుతం విజయనగరం ఎంపీగా బొత్స భార్య ఝాన్సీ ఉన్నారు. ఎచ్చెర్ల ఎమ్మెల్యేగా సీనియర్ నేత మీసాల నీలకంఠం ఉన్నారు. వాస్తవానికి బొత్స రాజకీయ వైభవానికి మీసాల ప్రధాన కారకుడు. ప్రస్తుతం బొత్స ప్రాతినిధ్యం వహిస్తున్న విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గాన్ని ఆయన 2004లో బొత్సకు త్యాగం చేశారు. ఆయన స్వచ్ఛంద అంగీకారంతోనే ఆ నియోజకవర్గాన్ని అప్పట్లో బొత్సకు కేటాయించారు. అనంతరం బొత్స రాష్ట్ర మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా ఎదిగారు.
తన రాజకీయ ఉన్నతికి కారకుడైన నీలకంఠం నాయుడుకే ఇప్పుడు బొత్స పొగ బెట్టారు. వ్యూహాత్మకంగా నీలకంఠానికి వ్యతిరేకంగా అసమ్మతిని ప్రోత్సహించారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో కథను క్లైమాక్స్‌కు తీసుకువచ్చారు. బొత్స మేనల్లుడు చిన్న శ్రీను ఎచ్చెర్ల నియోజకవర్గ నేతలను విజయనగరంలోని తన నివాసానికి బుధవారం పిలిపించుకున్నారు. నీలకంఠం అయితే ఎన్నికల్లో ఓడిపోతారనే వాదనను కూడగట్టారు. అనంతరం కాసేపటికే బొత్స సత్యనారాయణ అక్కడికి చేరుకున్నారు. అసలు విషయం చెప్పకుండా పథకం ప్రకారం బొత్స వారిని ఒప్పించారు. వారి సమక్షంలోనే ఎచ్చెర్ల ఎమ్మెల్యే నీలకంఠం నాయుడుకు ఫోన్ చేశారు. ‘మీపట్ల నేతలు, కార్యకర్తలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎంత ఖర్చు చేస్తారు?.. పరిస్థితి ఏమీ బాగా లేదు..’అని నిందాపూర్వకంగా మాట్లాడారు. దాంతో నీలకంఠం నాయుడు తీవ్ర మనస్థాపానికి గురైనట్లు తెలుస్తోంది. పరిస్థితి గ్రహించిన ఆయన బొత్స కుటుంబానికి దారిచ్చేశారు. ‘వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేయను. మీ ఇష్టం. ఎవరినైనా చూసుకోండి’అని చెప్పేశారు.
‘మేమే పోటీ చేస్తాం...’
అనంతరం బొత్స ఎచ్చెర్ల నియోజకవర్గ నేతలతో అసలు విషయం చెప్పారు. ‘మీలో ఎవరైనా ఎచ్చెర్ల నుంచి పోటీ చేస్తారా?’అని మొదట అడిగారు. చేయలేమని వారు చెప్పారు. అలా అయితే తమ కుటుంబం నుంచే ఒకరు పోటీ చేస్తారని బొత్స వెల్లడించారు. అదే విధంగా విజయనగరం ఎంపీగా కూడా తమ కుటుంబ సభ్యులే పోటీ చేస్తారు కాబట్టి అందరూ తమ మాటకు కట్టుబడాలన్నారు. కానీ ఎచ్చెర్ల ఎమ్మెల్యేగా ఎవరు పోటీ చేస్తారు?... విజయనగరం ఎంపీగా ఎవరు పోటీ చేస్తారనే విషయాన్ని మాత్రం వెల్లడించకుండా జాగ్రత్తపడ్డారు. ఎన్నికల నాటి పరిస్థితిని బట్టి ఎచ్చెర్ల నుంచి తానుగానీ, తన భార్య ఝాన్సీగానీ పోటీ చేయాలన్నది బొత్స వ్యూహంగా ఉంది. అంతవరకు తన మేనల్లుడు చిన్న శ్రీనుతో ఎచ్చెర్లలో పార్టీ వ్యవహారాలను నడిపించాలన్నది ఆయన ఆలోచన. అందుకే ఎచ్చెర్ల అభ్యర్థి ఎవరన్నది ముందే ప్రకటించకుండా జాగ్రత్త పడ్డారు.
బెడిసికొట్టిన పన్నాగం
ఎంత పక్కాగా కథ నడిపించినప్పటికీ బొత్సకు ఊహించని రీతిలో ఎదురుదెబ్బ తగిలింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఎచ్చెర్ల నియోజకవర్గానికి చెందిన మెజార్టీ నేతలు తాము కాంగ్రెస్‌లో కొనసాగలేమని తేల్చిచెప్పారు. వైఎస్‌ఆర్‌సీపీలో చేరాలనుకుంటున్న విషయాన్నీ స్పష్టం చేశారు. లావేరు మాజీ ఎంపీపీ దన్నాన రాజి నాయుడు తదితరులు తాము కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తామన్నారు. మాజీ జెడ్పీటీసీ సభ్యుడు, ఏఎంసీ చైర్మన్ తదితరులు కూడా తాము బొత్స తో కలసి పనిచేయలేమని చెప్పారు. ఎచ్చెర్ల నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు ఒకటి రెండు రోజుల్లో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించుకోవాలని భావిస్తున్నారు. దీంతో బొత్స కుటుంబీకులు ఇక్కడి నుంచి పోటీ చేసినా గెలిచే పరిస్థితి లేదని తెలుస్తోంది.