పిసిసి అధ్యక్షులు, మాజీ అధ్యక్షుల ఓటమి
హైదరాబాద్: ఈ సార్వత్రిక ఎన్నికలలో దేశవ్యాప్తంగానే కాకుండా, రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఘోరపరాజయం చవిచూడవలసి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చి అక్కడ లబ్దిపొందుదామని చూసింది. అక్కడ కూడా చావుదెబ్బతింది. ఆంధ్రప్రదేశ్లో అయితే చావు దెబ్బతింది. అటు తెలంగాణలో ఇటు ఏపిలో పిసిసి అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు, మాజీ మంత్రులు ఓడిపోయారు. పిసిసి మాజీ అధ్యక్షులు డి.శ్రీనివాస్, బొత్స సత్యనారాయణ, తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి అందరూ కట్టగట్టుకొని ఓటమిని చవిచూశారు. రఘువీరా రెడ్డిది దయనీయ స్థితి. ఆయన మూడవ స్థానానికి పరిమితమయ్యారు.
నిజామాబాద్ రూరల్ శాసనసభ స్థానంలో పీసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ డి శ్రీనివాస్ తన సమీప టీఆర్ఎస్ అభ్యర్థి బాజీరెడ్డి గోవర్థన్పై 20 వేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య వరంగల్ జిల్లా జనగామ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక్కడ టిఆర్ఎస్ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి విజయం సాధించారు.
మరో పిసిసి మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చీపురుపల్లి నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థి కిమిడి మృణాళిని చేతిలో ఓడిపోయారు. ఏపి పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి అనంతపురం జిల్లా పెనుకొండలో పోటీ చేసి ఓడిపోయారు. ఇక్కడ టిడిపి అభ్యర్థి పార్ధసారధి విజయం సాధించారు. రఘువీరా రెడ్డి మూడవ స్థానానికి వెళ్లారు.