సాక్షి, విజయనగరం: సీఎం చంద్రబాబునాయుడు బావమరిది, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ బిత్తిరిచర్యల పర్వం కొనసాగుతోంది. కారణం ఏమిటో తెలియదు కానీ.. ఎన్నికల ప్రచారంలో బాలకృష్ణ తనదైన శైలిలో రెచ్చిపోతున్నారు. అభిమానంతో బాలయ్యను దగ్గరగా చూసేందుకు ప్రజలు వచ్చినా.. పార్టీ కార్యకర్తలు వచ్చినా ఆయన ఊరుకోవడం లేదు. అయితే.. నోటికి పనిచెప్పి.. ‘ఏయ్ నీ సంగతి చెబుతా.. పీక కోస్తా.. నాకొడకా..’ అంటూ బెదిరింపులు.. లేకపోతే.. చేతికి పనిచెప్పి.. చెంప చెళ్లుమనిపించడాలు.. ఇలా బాలకృష్ణ ఎన్నికల ప్రచారం సాగుతోంది.
తాజాగా విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బాలకృష్ణ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఆయనను తమ కెమెరాలో బంధించేందుకు ప్రయత్నించిన ఓ కార్యకర్తపై చేయి చేసుకున్నారు. ఎన్నికల ప్రచార రథంలో వెళుతున్న బాలకృష్ణను తమ సెల్‌ఫోన్‌లలో వీడియో తీసేందుకు టీడీపీ కార్యకర్తలు ఉత్సాహం చూపించారు. ఇలా ఓ కార్యకర్త బాలకృష్ణ వాహనానికి సమీపంగా వచ్చి తన సెల్‌ఫోన్‌లో వీడియో తీస్తుండగా అతన్ని బాలకృష్ణ గద్దించారు. ఈలోపు మరో వ్యక్తి కూడా బాలయ్యను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించేందుకు ప్రయత్నించగా.. బాలయ్య ఆవేశంగా అతని ఫోన్ లాక్కునేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘ఏయ్ నీ సంగతి చెబుతా.. పీక కోస్తా.. నాకొడకా.. ఏసీపాడదొబ్బుతా..’ అని అనంతపురం జిల్లా హిందూపురం ఎన్నికల ప్రచారంలో ఇటీవల కార్యకర్తలపై బాలయ్య ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అదేవిధంగా విశాఖ జిల్లాలోనూ ఆయన తన అభిమానులపై ప్రతాపాన్ని చూపారు. విశాఖ జిల్లా భీమునిపట్నంలో గంటస్తంభం వద్ద శనివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో బాలయ్య ప్రసంగిస్తుండగా కొందరు అభిమానులు ‘జై బాలయ్య’ అంటూ నినాదాలు చేశారు. దీంతో బాలకృష్ణ ఒక్కసారిగా తన అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఏయ్..మాట్లాడకు’ అని ఓ అభిమానిపై రెండుసార్లు మండిపడ్డారు. ఆ తరువాత తన ప్రసంగాన్ని కొనసాగించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని చెప్పే ప్రయత్నంలో అదే పనిగా మాటల్లో తడబడ్డారు. దీంతో సభకు వచ్చిన అభిమానులు, కార్యకర్తలు బాలయ్య ప్రసంగం తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
బాలయ్యకు విగ్ కష్టాలు
బాలకృష్ణ మరో రెండేళ్లలో షష్టిపూర్తి చేసుకోనున్నారు. కానీ సినిమా హీరో...ఆ ఇమేజ్ మ్యానేజ్ చేసేందుకు నిత్యం విగ్గులోనే కనిపిస్తారు. తనదగ్గరికి ఎవరైనా వచ్చినా..పూలమాల వేసేందుకు గుంపులుగా జనం వచ్చినా విగ్గు జారిపోతుందని భయపడుతుంటారు. అందుకే అనుమతిలేనిదే ఎవరినీ దగ్గరకు రానివ్వరు. ఎవరైనా దగ్గరగా వచ్చినా తాకకూడదు..కాదు కూడదని తాకితే తనదైన శైలిలో వారికి బహుమానం ఇస్తారు. ఎవరైనా సరే సినిమాలో హీరోలా అలా దూరం చేసి నమస్కారం పెట్టి పోవాలి. అదీ బాలయ్య స్టైల్. కానీ జనం ఇవేవీ తెలియక మా ఎమ్మెల్యే నంటూ దగ్గరకు వెళ్లి ఆయన హస్తముద్ర వేయించుకుంటుంటారు.
Comments
Please login to add a commentAdd a comment