
ఖాళీ బిందెలతో బాలకృష్ణను నిలదీస్తున్న ఎస్సీకాలనీ వాసులు
సాక్షి, హిందూపురం: అతిథి ఎమ్మెల్యేగా పేరుగాంచిన బాలకృష్ణకు ఎన్నికల ప్రచారంలో ఊహించని ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఉత్సాహంగా ప్రచారం నిర్వహించేందుకు వెళ్తున్న ఆయన్ను.. జనం అడుగడుగునా నిలదీస్తున్నారు. సమస్యలు చెబుతూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఐదేళ్లు ఎక్కడకు పోయావ్ అంటూ ప్రశ్నిస్తున్నారు. గురువారం బాలకృష్ణ చిలమత్తూరు మండలం టేకులోడు పంచాయతీలో ప్రచారం ముగించుకుని దేమకేతేపల్లి ఎస్సీ కాలనీకి రాగా.. మహిళలంతా ఖాళీ బిందెలతో స్వాగతం పలికారు. ఆయన కాన్వాయ్ ముందు అడ్డుగా నిలిచి ఆందోళన చేశారు. తమ కాలనీలో కొన్ని నెలలుగా తాగునీటి సమస్య ఉందనీ, పరిష్కారానికి అదనంగా మరో బోరు వేయించాలని పలు మార్లు ఫిర్యాదు చేసినా ఏ నాయకుడు పట్టించుకోలేదన్నారు.
మీకు చెప్పుకుందామంటే.. మీరెక్కడుంటారో కూడా తెలియదన్నారు. ట్యాంకర్ల ద్వారా ఉచితంగా సరఫరా చేసే నీళ్లు తాగి రోగాల బారిన పడుతున్నామని వాపోయారు. తమ సమస్యలు పరిష్కరించకుండా ఓట్లు అడిగేందుకు ఎలా వచ్చారని నిలదీశారు. పోలీసులు, నాయకులు సర్దిచెప్పడానికి ప్రయత్నించినా.. వారు వినకుండా నీళ్లు ఇవ్వాలని పట్టుబట్టారు. మహిళలంతా ఏకమై ప్రశ్నించే సరికి బిత్తరపోయిన బాలకృష్ణ.. వెంటనే పక్కనే ఉన్న స్థానిక నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యను తన దృష్టికి ఎందుకు తీసుకురాలేదంటూ ప్రశ్నించారు. నాయకులు ఏదో చెప్పేందుకు ప్రయత్నించగా మండిపడ్డారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉన్నందున.. నీటిని ట్యాంకర్ల ద్వారా అందించాలని అధికారులకు తెలియజేస్తామని సర్దిచెప్పి ముందుకు వెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment