పాతపట్నం (శ్రీకాకుళం): నాలుగేళ్ల వయసులో తప్పిపోయి అమ్మానాన్నలకు దూరమైంది. చిన్ననాటి జ్ఞాపకాలను పదిలపర్చుకుని.. పదమూడేళ్ల అనంతరం వారి జాడ తెలుసుకుంది. కన్నవారిని కలుసుకోబోతున్నాననే ఆనందం ఒకవైపు.. 13 ఏళ్లపాటు సొంత బిడ్డలా పెంచి.. చదువు చెప్పించిన తల్లి దూరమవుతోందనే బాధ మరోవైపు ఆమెను చుట్టుముట్టాయి. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం చీపురుపల్లి గ్రామానికి చెందిన కోడిపెంట్ల మాధవరావు, వరలక్ష్మి దంపతులు బతుకుదెరువు కోసం 14 ఏళ్ల క్రితం హైదరాబాద్ వెళ్లారు. ఆ దంపతులకు ముగ్గురు సంతానం. మాధవరావు, వరలక్ష్మి దంపతులు 2006 నవంబర్‌లో ముగ్గురు బిడ్డల్ని ఇంటివద్దే ఉంచి కూలి పనులకు వెళ్లారు. వారి కుమార్తె భవానీ తన అన్నయ్యలు సంతోష్, గోపీతో ఆడుకుంటూ తప్పిపోయింది. రోడ్డుపై బిక్కుబిక్కుమంటూ రోదిస్తున్న భవానీని జయరాణి (జయమ్మ) అనే మహిళ చేరదీసి ఆమె తల్లిదండ్రుల కోసం చుట్టుపక్కల వాకబు చేసింది.
ఫలితం లేకపోవడంతో అప్పట్లోనే సనత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసి.. భవానీ సంబంధీకులు వచ్చేవరకు ఆమెను తానే సాకేందుకు ముందుకొచ్చింది. భవానీని పెంచి ఇంటర్మీడియెట్ వరకు చదివించింది. భవానీకి ప్రస్తుతం 17 ఏళ్లు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన జయరాణి (జయమ్మ) గతంలో హైదరాబాద్‌లో ఉంటూ అక్కడి ఇళ్లల్లో పని చేస్తుండేది. కొంతకాలం క్రితం కుటుంబ సభ్యులు, భవానీతో కలిసి విజయవాడ వచ్చి ఇళ్లల్లో పని చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. తాను పని చేస్తున్న ఇంట్లోనే భవానీని కూడా పనిలో పెట్టాలనే ఉద్దేశంతో ఇంటి యజమాని వంశీ, భార్య కృష్ణకుమారి వద్దకు భవానీని తీసుకెళ్లింది. భవానీ వివరాలను ఇంటి యజమాని వంశీ ఆరా తీశారు. తాను చిన్నతనంలోనే తప్పిపోయానని తెలిపిన భవానీ తల్లిదండ్రుల పేర్లు, అన్నల పేర్లను, గుర్తున్న చిన్ననాటి సంగతులను చెప్పింది. ఆ వివరాలను, భవానీ ఫొటోను వంశీ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. శనివారం ఆ పోస్ట్‌ను చూసిన భవానీ అన్న.. వంశీకి వీడియో కాల్ చేశాడు.
అన్నయ్యను భవానీ గుర్తు పట్టింది. ఆ తరువాత ఆమె తల్లిదండ్రులు కూడా భవానీతో వీడియో కాల్ మాట్లాడారు. కుమార్తెను తీసుకెళ్లడానికి చీపురుపల్లి నుంచి తల్లిదండ్రులు మాధవరావు, వరలక్ష్మి, సోదరులు సంతోష్, గోపీ విజయవాడ బయలుదేరారు. ఇదిలావుంటే.. గతంలో హైదరాబాద్‌లో జీవనోపాధి పొందిన భవానీ తల్లిదండ్రులు ప్రస్తుతం చీపురుపల్లిలోనే ఉంటున్నారు. తమ బిడ్డ ఆచూకీ తెలిసి భవానీ తల్లిదండ్రులు ఆనంద డోలికల్లో తేలియాడుతున్నారు. ఇంత కాలం తల్లిగా మారి భవానీని కంటికి రెప్పలా చూసుకుంటూ చదువు చెప్పించిన జయమ్మకు రుణపడి ఉంటామని చెప్పారు. ఇన్నాళ్లకు భవానీ అమ్మా నాన్నలకు దగ్గరవుతుండటంతో చీపురుపల్లి గ్రామమంతా సంతోషం వ్యక్తం చేసింది.
కన్నవారిని కలిపిన ఫేస్‌బుక్
Published Sun, Dec 8 2019 4:33 AM | Last Updated on Sun, Dec 8 2019 11:58 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment