అంతా జంతర్‌మంతర్‌ | Mass copieng in iti exams | Sakshi
Sakshi News home page

అంతా జంతర్‌మంతర్‌

Published Tue, Aug 9 2016 9:31 PM | Last Updated on Mon, Sep 4 2017 8:34 AM

ఎస్‌.కోట ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో గుంపులుగా కూర్చుని పరీక్షలు రాస్తున్న విద్యార్థులు(సర్కిళ్లలో)

ఎస్‌.కోట ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో గుంపులుగా కూర్చుని పరీక్షలు రాస్తున్న విద్యార్థులు(సర్కిళ్లలో)

ఐటీఐ పరీక్షల్లో అన్నీ అక్రమాలే
ప్రశ్న పత్రాలు లేకుండానే కొన్ని చోట్ల పరీక్షలు
ఇన్విజిలేటర్లు డైరెక్షన్‌లో ఓఎంఆర్‌లో బబ్లింగ్‌
కొన్ని చోట్ల ప్రైవేటు వ్యక్తులే డిక్టేటింగ్‌
విజిలెన్స్‌ అధికారులైనా... పరీక్షల సూపరింటెండెంట్లైనా నామమాత్రమే
 
 
చీపురుపల్లి/గరివిడి/శృంగవరపుకోట: జిల్లాలో ఐటీఐ సెమిస్టర్‌ పరీక్షలు చాలా గందరగోళంగా ఉన్నాయి. ప్రైవేటు ఐటీఐల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో పరీక్షలైతే అంతా జంతర్‌మంతరే. ఏ కేంద్రంలో చూసినా అంతా వింతగా కనిపిస్తోంది. ప్రశ్నపత్రాలు లేకుండానే పరీక్షలు రాసేదొకచోట... ఇన్విజిలేటర్లే జవాబులు చెప్పేదొకచోట... ప్రైవేటు వ్యక్తులు లోపలికి వచ్చేసి పెత్తనం చేసేది మరోచోట... ఇలా అంతా అక్రమాలమయంగానే కనిపిస్తోంది. పరీక్షలను పర్యవేక్షించే పరిశీలకులు... సూపరింటెండెంట్లు... అంతా నామమాత్రమే తప్ప వారి విధులు కచ్చితంగా నిర్వర్తించలేకపోతున్నారంటే... వెనుక ఏం జరిగి ఉండొచ్చు? జిల్లాలోని ఐటీఐ పరీక్షల్లో మాస్‌కాపీయింగ్‌ చోటు చేసుకుంటోంది. మొన్నటికి మొన్న గజపతినగరం బాలాజీ పాలిటెక్నిక్‌ సెంటర్‌లో జరిగిన పరీక్షల్లో ఈ పరిస్థితి కనిపిస్తే... మంగళవారం గరివిడిలోని సరోజినీదేవి ఐటీఐలోనూ... శృంగవరపుకోట ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో మళ్లీ మాస్‌కాపీయింగ్‌కు పాల్పడుతూ సాక్షికి చిక్కారు. పరీక్ష కేంద్రాల ఏర్పాటునుంచీ... పరీక్షల్లో సాయం అందించేవరకూ... ప్రతీ అంశంలోనూ అనుమానాలకు తావిచ్చే రీతిలోనే నిర్వాహకులు వ్యవహరిస్తున్నారు. పరీక్ష పత్రాలు లేకుండానే పరీక్షరాయడం... గుంపులుగుంపులుగా కూర్చుని చక్కగా జవాబులు ఒకరికొకరు షేర్‌ చేసుకోవడం చూస్తుంటే అంతా గందరగోళంగా కనిపిస్తోంది. అందుకే విజిలెన్స్‌ తనిఖీకి వచ్చేవారుగానీ... పరీక్షల సూపరింటెండెంట్లుగానీ దీనిపై కనీసం ఎలాంటి చర్యలూ తీసుకుంటున్న దాఖలాలే కనిపించడం లేదు.
 
 
ప్రశ్నపత్రం లేకుండానే పరీక్షలు
గుర్లమండలానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు గరివిడిలో సరోజినీదేవి ఐటీఐ కళాశాల నిర్వహిస్తున్నారు. ఇక్కడ తమ విద్యార్థులతోపాటు చీపురుపల్లికి చెందిన విష్ణు ఐటీఐ, విజయనగరంలోని అంబేద్కర్‌ ఐటీఐ కళాశాలలకు చెందిన విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. మంగళవారం వర్క్‌షాపు అండ్‌ కాలుక్యులేషన్‌ సైన్స్‌ పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు 362 మంది హాజరవ్వాల్సి ఉండగా 318 మంది వచ్చారు. మంగళవారం మద్యాహ్నం 12.30 గంటలు అంటే మరో అరగంటలో పరీక్ష సమయం ముగిసిపోతోంది. అప్పటివరకూ గదిలో ఒకరిద్దరి దగ్గర తప్ప మిగిలిన వారి వద్ద ప్రశ్న పత్రాలు లేవు. అవి లేకుండానే విద్యార్థులు ఓఎమ్‌ఆర్‌ షీట్‌లో జవాబులు బబ్లింగ్‌ చేసేశారు. ఇక్కడ గుంపులు గుంపులుగా కూర్చుని పరీక్ష రాస్తున్నారు. చాలా మంది వద్ద కనీసం పరీక్ష రాసేందుకు అవసరమైన అట్టలు కూడా లేవు. జవాబులు ఇన్విజిలేటర్లుతో చెప్పిస్తుండగా విద్యార్థులు బబ్లింగ్‌ చేసుకుంటున్నట్టే అక్కడి పరిస్థితులు కనిపిస్తున్నాయి.
పట్టించుకోని విజిలెన్స్‌ అధికారి
అదే సమయంలో పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించేందుకు సాలూరు ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్‌ జి.వీర్రాజు విజిలెన్స్‌ అధికారిగా కళాశాలకు వచ్చారు. చాలా సమయం వరకు ఆఫీసు గదిలోనే ఉండిపోయారు. ఆయన వద్దకు సాక్షి వెళ్లి ప్రశ్న పత్రాలు లేని విషయాన్ని ప్రస్తావించగా ఆయన ఏమీ సమాధానం ఇవ్వలేదు. అక్కడున్న చీఫ్‌ సూపర్‌వైజరు బి.బుచ్చిబాబు సమాధానం చెప్పేందుకు ప్రయత్నించారు. తరువాత విజిలెన్స్‌ అధికారి వీర్రాజు పరీక్ష కేంద్రంలో పరిశీలించే సమయానికి విద్యార్థుల వద్ద ప్రశ్న పత్రాలు లేకపోయినా ఆయనేమీ పట్టించుకోలేదు.
 
 
ఒక్కో అభ్యర్థి నుంచి రూ.2 నుంచి రూ.3 వేలు.....
అయితే ఐటీఐ పరీక్ష రాసే అభ్యర్థులకు ఎలాంటి తలనొప్పి లేకుండా కనీసం ప్రశ్న పత్రాలు కూడా ఇవ్వకుండా మొత్తం జవాబులు అన్నీ చెప్పేందుకు ఒక్కో అభ్యర్థి నుంచి రూ.2 వేలు నుంచి రూ.3 వేలు వరకు వసూళ్లు జరిగినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ లెక్కన దాదాపు రూ.10 లక్షల వరకు కళాశాల యాజమాన్యాలకు ముట్టినట్లు లె లుస్తోంది. ఇందులో పైస్థాయినుంచి కింది స్థాయివరకూ వాటాలుంటాయన్న ప్రచారం జరుగుతోంది.పైగా ప్రశ్నపత్రాలు లేకపోవడానికి పరీక్ష కేంద్రం చీఫ్‌ సూపర్‌వైజరు బి.బుచ్చిబాబు మాట్లాడుతూ ప్రశ్న పత్రాలను ఉదయం 10.30 గంటలకు నెట్‌లో పెడతారని వాటిని డౌన్‌లోడ్‌ చేసుకోవడం ఆలస్యమయిందని చెప్పుకొచ్చారు.
 
 
శృంగవరపుకోటలో మహా మాస్‌కాపీయింగ్‌
ఇచ్చుకోవటం..తీసుకోవటం...ఇబ్బంది లేకుండా చూసి రాసుకోవటం ఇదీ ఐటీఐ పరీక్షల అబ్రివేషన్‌లా కనిపిస్తోంది. ఎస్‌.కోట ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలోని 17 గదుల్ని ఐటీఐ పరిక్ష కేంద్రాలకు కేటాయించారు. ఇక్కడ కొత్తవలస సూర్యనారాయణ ఐటీఐ, విశ్వభారతి ఐటీఐ, ఎస్‌.కోట ఉమాభారతి ఐటీఐ, భవానీ ఐటీఐలకు చెందిన విద్యార్థులు ఇక్కడ పరీక్ష రాస్తున్నారు. మైదానం వైపు ఉన్న భవనంలో ఒక ప్రైవేటు వ్యక్తి విద్యార్థులకు జవాబులు చెబుతూ మీడియా కంట పడ్డారు. ఆయన్ని ఎలా అనుమతించారని అడిగితే ఇన్విజిలేటర్‌ బదులివ్వలేదు. విద్యార్థులు ఐదారుగురు ఒకచోట గుంపుగా కూర్చుని పరీక్ష రాస్తున్నారు. మీడియా ప్రతినిధుల్ని చూసి తమ సీట్లలోకి పరుగులు తీశారు. దీనిపై డీఓ కె.రాజారావును ప్రశ్నిస్తే దూరంగా కూర్చోబెడతాం అంటూ సర్దుకున్నారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement