Garividi
-
విహారయాత్రలో విషాదం
నెల్లిమర్ల రూరల్/చీపురుపల్లిరూరల్(గరివిడి): విహారయాత్రకు బయలుదేరిన విద్యారి్థనిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కాటేసింది. స్నేహితులు, కుటుంబ సభ్యుల్లో విషాదం నింపింది. నెల్లిమర్ల మండలం పెదతరిమి వద్ద శనివారం జరిగిన ఘటనపై పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. గరివిడి మండలం తాటిగూడకు చెందిన యడ్ల సుప్రియ(21) ఎస్డీఎస్ కళాశాలలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతోంది. ఇటీవలే పరీక్షలు పూర్తి కావడంతో తన స్నేహితులు కొంత మంది పూసపాటిరేగ మండలం గోవిందపురం బీచ్‌కు వెళ్లాలని నిర్ణయించారు. అందరూ ఇంటి వద్ద కళాశాలకు వెళ్లి వస్తామని చెప్పి ద్విచక్రవాహనాలపై గోవిందపురం బయలుదేరారు. సుప్రియ తన స్నేహితుడు రెడ్డి రవితేజతో పాటు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా నెల్లిమర్ల మండలం పినతరిమి గ్రామం వద్దకు చేరుకునేసరికి అక్కడున్న ప్రమాదకర మలుపు వద్ద వాహనం అదుపుతప్పి ప్రమాదం జరిగింది. పక్కనే పెద్దపెద్ద రాళ్లు ఉండడంతో సుప్రియ తలకు, మొఖానికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న ఎస్సై దామోదరరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం కేంద్రాస్పత్రికి తరలించారు. యువతితో పాటు ప్రయాణించిన యువకుడు రెడ్డి రవితేజపై మృతురాలి బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రియ మృతికి నువ్వే కారణమని, విహారయాత్రకు ఎందుకు తీసుకెళ్లావంటూ దాడి చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. తాటిగూడలో విషాదచాయలు విద్యార్థిని మృతితో తాటిగూడ గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. విద్యార్థిని తండ్రి వెంకటేశ్వర్లు తాపీమేస్త్రీ కాగా తల్లి గృహిణి. వీరికి కుమార్తె, కొడుకు. ఇద్దరి సంతానంలో కుమార్తె మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. -
పట్టణం నడిబొడ్డున దారుణ హత్య
గరివిడి: పట్టణ నడిబొడ్డున దారుణ హత్య జరిగింది. ఇనుప రాడ్లతో ఓ ఇంటి యజమానిని కొట్టి చంపడం సంచలనం రేపింది. శనివారం అర్ధరాత్రి ఈ హత్య జరిగినట్లు అనుమానిస్తున్నారు. స్థానికులు, పోలీసులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణానికి చెందిన తమ్మిన చినబాబు (55) భార్య విజయలక్ష్మి, కుమార్తెలు మౌనిక, సుష్మితతో కలిసి గరివిడిలో నివాసముంటున్నారు. శనివారం అర్దరాత్రి ఒంటి గంట సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో చినబాబు ఇంటి డాబాపైకి వెళ్లగా కొంతమంది దుండగులు వచ్చి ఇనుపరాడ్లతో చినబాబుపై దాడి చేశారు. దీంతో ఆయన పెద్దగా కేకలు వేయడంతో ఇంటిలో ఉన్న కుటుంబ సభ్యులు బయటకు రాగా వారిపై కూడా దుండగులు దాడి చేయడానికి ప్రయత్నించారు. వెంటనే వారు ఇంటిలోకి వెళ్లిపోయి తలుపులు వేసుకోగా... దుండగులు తలుపులు గట్టిగా కొట్టారు. ఎంతకీ తలుపులు రాకపోవడంతో వారంతా అక్కడ నుంచి పరారయ్యారు. అనంతరం కుటుంబ సభ్యులు డాబాపైకి వెళ్లి చూడగా చినబాబు విగతజీవిగా పడి ఉన్నాడు. ఇదిలా ఉంటే దుండగులే చినబాబు ఇంటి విద్యుత్ సరఫరాను నిలిపివేసి ఉంటారని అనుమా నం వ్యక్తం చేస్తున్నారు. వివరాలు సేకరించిన క్లూస్ టీమ్.. హత్య విషయం తెలుసుకున్న బొబ్బిలి డీఎస్పీ గౌతమీశాలి, సీఐ రాజులనాయుడు, ఎస్సై పి. నారాయణరావు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. క్లూస్‌టీమ్ సభ్యులు కూడా వచ్చి వివరాలు సేకరించారు. మృతుడి భార్య విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నా అల్లుడే చంపాడు : మృతుడి భార్య నా భర్తను అల్లుడు రమేష్పాండే చంపాడని మృతుడి భార్య విజయలక్ష్మి ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పెద్దమ్మాయి మౌనిక చదువు కోసం కాకినాడలో ఉన్నప్పుడు అక్కడే హోట్ల్లో పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన రమేష్‌పాండేతో పరిచయం అయిందన్నారు. ఆ పరిచయం ప్రేమగా మారడంతో రమేష్‌పాండేతో పెళ్లి చేశామని చెప్పింది. అయితే వివాహం జరిగిన అనంతరం తమ అల్లుడు నిత్యం కుమార్తెను వేధించేవాడని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో కుమార్తెను తమ దగ్గరకు తీసుకొచ్చామని.. అప్పటి నుంచి అల్లుడు తమను వేధిస్తున్నాడని తెలిపింది. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశామని చెప్పింది. అయితే కిరాయి రౌడీలతో వచ్చి హత్య చేస్తాడని ఊహించలేదని కన్నీరుమున్నీరుగా విలపించింది. -
గరివిడిలో వివాహిత ఆత్మహత్య
గరివిడి: మండలంలోని దేవాడ గ్రామానికి చెందిన పొలసపల్లి దేవి (22) అనే వివాహిత పురుగు మందు తాగి మృతి చెందింది. ఆమె తండ్రి దేబార్కి వీరస్వామి, పోలీసులు అందించిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. గుర్ల మండలంలోని నాగళ్లవలస గ్రామానికి చెందిన దేవికి గరివిడి మండలం దేవాడ గ్రామానికి చెందిన పోలసపల్లి మోహన్ (23)కు ఐదేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. అయితే దేవిని రెండేళ్లుగా అత్త, మామ, భర్త వేధిస్తుండేవారు. దీంతో మనస్తాపానికి గురైన దేవి ఆదివారం మధ్యాహ్నం పురుగుమందు తాగింది. వెంటనే కుటుంబ సభ్యులు గమనించి చీపురుపల్లి సీహెచ్‌సీకి తరలించగా మెరుగైన చికిత్సకోసం విజయనగరం మహారాజా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో మృతి చెందింది. ఎస్సై శ్రీని వాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అంతా జంతర్‌మంతర్
ఐటీఐ పరీక్షల్లో అన్నీ అక్రమాలే ప్రశ్న పత్రాలు లేకుండానే కొన్ని చోట్ల పరీక్షలు ఇన్విజిలేటర్లు డైరెక్షన్లో ఓఎంఆర్‌లో బబ్లింగ్ కొన్ని చోట్ల ప్రైవేటు వ్యక్తులే డిక్టేటింగ్ విజిలెన్స్ అధికారులైనా... పరీక్షల సూపరింటెండెంట్లైనా నామమాత్రమే చీపురుపల్లి/గరివిడి/శృంగవరపుకోట: జిల్లాలో ఐటీఐ సెమిస్టర్ పరీక్షలు చాలా గందరగోళంగా ఉన్నాయి. ప్రైవేటు ఐటీఐల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో పరీక్షలైతే అంతా జంతర్‌మంతరే. ఏ కేంద్రంలో చూసినా అంతా వింతగా కనిపిస్తోంది. ప్రశ్నపత్రాలు లేకుండానే పరీక్షలు రాసేదొకచోట... ఇన్విజిలేటర్లే జవాబులు చెప్పేదొకచోట... ప్రైవేటు వ్యక్తులు లోపలికి వచ్చేసి పెత్తనం చేసేది మరోచోట... ఇలా అంతా అక్రమాలమయంగానే కనిపిస్తోంది. పరీక్షలను పర్యవేక్షించే పరిశీలకులు... సూపరింటెండెంట్లు... అంతా నామమాత్రమే తప్ప వారి విధులు కచ్చితంగా నిర్వర్తించలేకపోతున్నారంటే... వెనుక ఏం జరిగి ఉండొచ్చు? జిల్లాలోని ఐటీఐ పరీక్షల్లో మాస్‌కాపీయింగ్ చోటు చేసుకుంటోంది. మొన్నటికి మొన్న గజపతినగరం బాలాజీ పాలిటెక్నిక్ సెంటర్లో జరిగిన పరీక్షల్లో ఈ పరిస్థితి కనిపిస్తే... మంగళవారం గరివిడిలోని సరోజినీదేవి ఐటీఐలోనూ... శృంగవరపుకోట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మళ్లీ మాస్‌కాపీయింగ్‌కు పాల్పడుతూ సాక్షికి చిక్కారు. పరీక్ష కేంద్రాల ఏర్పాటునుంచీ... పరీక్షల్లో సాయం అందించేవరకూ... ప్రతీ అంశంలోనూ అనుమానాలకు తావిచ్చే రీతిలోనే నిర్వాహకులు వ్యవహరిస్తున్నారు. పరీక్ష పత్రాలు లేకుండానే పరీక్షరాయడం... గుంపులుగుంపులుగా కూర్చుని చక్కగా జవాబులు ఒకరికొకరు షేర్ చేసుకోవడం చూస్తుంటే అంతా గందరగోళంగా కనిపిస్తోంది. అందుకే విజిలెన్స్ తనిఖీకి వచ్చేవారుగానీ... పరీక్షల సూపరింటెండెంట్లుగానీ దీనిపై కనీసం ఎలాంటి చర్యలూ తీసుకుంటున్న దాఖలాలే కనిపించడం లేదు. ప్రశ్నపత్రం లేకుండానే పరీక్షలు గుర్లమండలానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు గరివిడిలో సరోజినీదేవి ఐటీఐ కళాశాల నిర్వహిస్తున్నారు. ఇక్కడ తమ విద్యార్థులతోపాటు చీపురుపల్లికి చెందిన విష్ణు ఐటీఐ, విజయనగరంలోని అంబేద్కర్ ఐటీఐ కళాశాలలకు చెందిన విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. మంగళవారం వర్క్‌షాపు అండ్ కాలుక్యులేషన్ సైన్స్ పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు 362 మంది హాజరవ్వాల్సి ఉండగా 318 మంది వచ్చారు. మంగళవారం మద్యాహ్నం 12.30 గంటలు అంటే మరో అరగంటలో పరీక్ష సమయం ముగిసిపోతోంది. అప్పటివరకూ గదిలో ఒకరిద్దరి దగ్గర తప్ప మిగిలిన వారి వద్ద ప్రశ్న పత్రాలు లేవు. అవి లేకుండానే విద్యార్థులు ఓఎమ్ఆర్ షీట్లో జవాబులు బబ్లింగ్ చేసేశారు. ఇక్కడ గుంపులు గుంపులుగా కూర్చుని పరీక్ష రాస్తున్నారు. చాలా మంది వద్ద కనీసం పరీక్ష రాసేందుకు అవసరమైన అట్టలు కూడా లేవు. జవాబులు ఇన్విజిలేటర్లుతో చెప్పిస్తుండగా విద్యార్థులు బబ్లింగ్ చేసుకుంటున్నట్టే అక్కడి పరిస్థితులు కనిపిస్తున్నాయి. పట్టించుకోని విజిలెన్స్ అధికారి అదే సమయంలో పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించేందుకు సాలూరు ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ జి.వీర్రాజు విజిలెన్స్ అధికారిగా కళాశాలకు వచ్చారు. చాలా సమయం వరకు ఆఫీసు గదిలోనే ఉండిపోయారు. ఆయన వద్దకు సాక్షి వెళ్లి ప్రశ్న పత్రాలు లేని విషయాన్ని ప్రస్తావించగా ఆయన ఏమీ సమాధానం ఇవ్వలేదు. అక్కడున్న చీఫ్ సూపర్వైజరు బి.బుచ్చిబాబు సమాధానం చెప్పేందుకు ప్రయత్నించారు. తరువాత విజిలెన్స్ అధికారి వీర్రాజు పరీక్ష కేంద్రంలో పరిశీలించే సమయానికి విద్యార్థుల వద్ద ప్రశ్న పత్రాలు లేకపోయినా ఆయనేమీ పట్టించుకోలేదు. ఒక్కో అభ్యర్థి నుంచి రూ.2 నుంచి రూ.3 వేలు..... అయితే ఐటీఐ పరీక్ష రాసే అభ్యర్థులకు ఎలాంటి తలనొప్పి లేకుండా కనీసం ప్రశ్న పత్రాలు కూడా ఇవ్వకుండా మొత్తం జవాబులు అన్నీ చెప్పేందుకు ఒక్కో అభ్యర్థి నుంచి రూ.2 వేలు నుంచి రూ.3 వేలు వరకు వసూళ్లు జరిగినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ లెక్కన దాదాపు రూ.10 లక్షల వరకు కళాశాల యాజమాన్యాలకు ముట్టినట్లు లె లుస్తోంది. ఇందులో పైస్థాయినుంచి కింది స్థాయివరకూ వాటాలుంటాయన్న ప్రచారం జరుగుతోంది.పైగా ప్రశ్నపత్రాలు లేకపోవడానికి పరీక్ష కేంద్రం చీఫ్ సూపర్వైజరు బి.బుచ్చిబాబు మాట్లాడుతూ ప్రశ్న పత్రాలను ఉదయం 10.30 గంటలకు నెట్లో పెడతారని వాటిని డౌన్లోడ్ చేసుకోవడం ఆలస్యమయిందని చెప్పుకొచ్చారు. శృంగవరపుకోటలో మహా మాస్‌కాపీయింగ్ ఇచ్చుకోవటం..తీసుకోవటం...ఇబ్బంది లేకుండా చూసి రాసుకోవటం ఇదీ ఐటీఐ పరీక్షల అబ్రివేషన్లా కనిపిస్తోంది. ఎస్.కోట ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని 17 గదుల్ని ఐటీఐ పరిక్ష కేంద్రాలకు కేటాయించారు. ఇక్కడ కొత్తవలస సూర్యనారాయణ ఐటీఐ, విశ్వభారతి ఐటీఐ, ఎస్.కోట ఉమాభారతి ఐటీఐ, భవానీ ఐటీఐలకు చెందిన విద్యార్థులు ఇక్కడ పరీక్ష రాస్తున్నారు. మైదానం వైపు ఉన్న భవనంలో ఒక ప్రైవేటు వ్యక్తి విద్యార్థులకు జవాబులు చెబుతూ మీడియా కంట పడ్డారు. ఆయన్ని ఎలా అనుమతించారని అడిగితే ఇన్విజిలేటర్ బదులివ్వలేదు. విద్యార్థులు ఐదారుగురు ఒకచోట గుంపుగా కూర్చుని పరీక్ష రాస్తున్నారు. మీడియా ప్రతినిధుల్ని చూసి తమ సీట్లలోకి పరుగులు తీశారు. దీనిపై డీఓ కె.రాజారావును ప్రశ్నిస్తే దూరంగా కూర్చోబెడతాం అంటూ సర్దుకున్నారు. -
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వీఆర్వో
గరివిడి (విజయనగరం) : మాజీ సైనికోద్యోగి నుంచి లంచం తీసుకుంటూ వీఆర్వో ఒకరు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఈ ఘటన విజయనగరం జిల్లా గరివిడిలో సోమవారం చోటుచేసుకుంది. మండలంలోని ఏనుగువలస గ్రామానికి చెందిన వర్మ అనే మాజీ సైనికోద్యోగి తన భూమిని ఆన్లైన్లో నమోదు చేయటానికి వీఆర్వో వెంకటస్వామి చుట్టూ గత కొద్దిరోజులుగా తిరుగుతున్నారు. వీఆర్వో మాత్రం రూ.5 వేలు ఇస్తేనే పని పూర్తి చేస్తానని పట్టుబట్టాడు. దీంతో వర్మ ఏసీబీ అధికారులకు ఉప్పందించారు. వారి సూచనల మేరకు సోమవారం తహశీల్దార్ కార్యాలయంలో వీఆర్వోకు లంచం డబ్బు అందజేస్తుండగా అక్కడే ఉన్న ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వీఆర్వోను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
లారీ బ్రేకులు ఫెయిల్.. గరివిడిలో గందరగోళం
చీపురుపల్లి: వేగంగా వెళ్తున్న లారీ బ్రేకులు ఫెయిలవడంతో విజయనగరం జిల్లా గరివిడిలో గందరగోళం నెలకొంది. అనంతరం డ్రైవర్ చాకచక్యంతో పెను ప్రమాదం తప్పింది. విశాఖ నుంచి ట్రాన్స్‌పోర్టు లోడుతో రాజాం వెళ్తున్న సమయంలో స్థానిక సబ్‌స్టేషన్ వద్దకు రాగానే లారీ బ్రేకులు ఫెయిలయ్యాయి. దీంతో లారీ రోడ్డు పక్కన ఉన్న వారి పైకి దూసుకెళ్లింది. దీంతో స్థానికులు ఏం జరుగుతుందో తెలియక పరుగులు తీశారు. ఆ సమయంలో డ్రైవర్ సమయస్పూర్తిని ప్రదర్శించి లారీని రోడ్డు పక్కన ఉన్న దిమ్మపైకి ఎక్కించాడు. దీంతో లారీ అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
వాగులో గల్లంతై ఇద్దరు గొర్రెలకాపరులు మృతి
గరివిడి (విజయనగరం) : వాగు దాటుతుండగా ప్రమాదవశాత్తు ఇద్దరు గొర్రెల కాపరులు కొట్టుకుపోయారు. ఈ ఘటన విజయనగరం జిల్లా గరివిడి మండలం రేగటి గ్రామంలో సోమవారం సాయంత్రం జరిగింది. రేగటి గ్రామానికి చెందిన పైడితల్లి(60), త్రినాథ(25) అనే ఇద్దరు తమ గొర్రెలతో సోమవారం ఉదయం గడిగెడ్డ వాగు అవతలి వైపునకు వెళ్లారు. అయితే మధ్యాహ్నం ఎగువన వర్షాలు పడటంతో ఏరు ఉధృతంగా ప్రవహిస్తోంది. సాయంత్రం గొర్రెలతో తిరిగి వస్తుండగా ఏటిలో ఒక్కసారిగా వచ్చిన వరద తీవ్రతకు పైడితల్లి, త్రినాథ కొట్టుకుపోయి మృతి చెందారు. కాగా దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
వెదుళ్లవలసలో ఘోరం
గరివిడి:అగ్ని సాక్షిగా ఒక్కటైన ఆ జంట అదే అగ్ని సాక్షిగా శాశ్వతంగా విడిపోయింది. అనుమానం, అపనమ్మకం, వ్యసనం రగిల్చిన జ్వాల చితిమంటగా మారి ఓ జీవితాన్ని బలి తీసుకుంది. కుటుంబాన్ని కకావికలం చేసింది. పెళ్లి నాడు చేసుకున్న బాసలను, పేగు తెంచుకు పుట్టిన పిల్లలను విస్మరించిన ఆ దంపతులు గొడవలు పడి చివరకు ప్రాణాలు తీసుకునే వరకు వచ్చారు. పిల్లలను అనాథలను చేశారు. కొన్నేళ్ల కిందట భర్త...భార్యపై హత్యాయత్నం చేస్తే, ఇప్పుడు భార్య... భర్తను సజీవదహనం చేసింది. గరివిడి మండలం వెదుళ్ల వలసలో మంగళవారం రాత్రి జరిగిన ఘటన లోకం పోకడ తెలియని,ముక్కుపచ్చలారని ఇద్దరు చిన్నారులను అనాథలను చేసింది. గ్రామానికి చెందిన నెమ్మాది నాగరాజు (30), విజయ భార్యాభర్తలు. వీరికి నేష్మ, షణ్ముఖ అనే పిల్లలున్నారు. వీరి మధ్య గొడవల కారణంగా కొన్ని నెలలుగా వీరు నాన్నకు దూరంగా బతుకుతున్నారు. ఇప్పుడు అమ్మే నాన్నను కాల్చేయడంతో అటు నాన్న లేక, ఇటు అమ్మ పరారీ అవడంతో అనాథలుగా మిలిగిపోయారు. ఎందుకు నాన్న అమ్మనుకొట్టేవాడో, అమ్మ నాన్నను ఎందుకు కాల్చేసిందో తెలియని ఆ పసి మొగ్గలు బిక్కముఖం వేసుకుని, బేలచూపులతో భయంభయంగా ఉన్నారు. వారిని చూసిన గ్రామస్తులు వీరి భవిష్యత్ ఎంటని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. -
సంక్షేమ పథకాల అమలు జగన్‌కే సాధ్యం
గరివిడి, న్యూస్‌లైన్ : దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అమలు చేయగల సత్తా వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికే సాధ్యమని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ పెనుమత్స సాంబశివరాజు అన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వడం ఖాయమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వెదుళ్లవలస గ్రామంలో చీపురుపల్లి నియోజకవర్గం వైఎస్ఆర్ సీపీ సమన్వయకర్త ఎస్.సిమ్మినాయుడు సమక్షంలో టీడీపీకి చెం దిన 300 కుటుంబాల నుంచి సుమారు 800 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి గురువారం రాత్రి చేరారు. ఈ సందర్భంగా పెనుమత్స మాట్లాడుతూ ప్రజలు జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పారు. రాష్ట్రా న్ని సమైక్యంగా ఉంచేందుకు జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం కుమ్మక్కైందని ఆరోపించారు. సిమ్మినాయుడు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి చీపురుపల్లిపై ప్రత్యేక దృష్టి ఉందన్నారు. చీపురుపల్లి ఏఎంసీ మాజీ చైర్మన్ మీసాల వరహాలనాయుడు మాట్లాడుతూ భవిష్యత్ వైఎస్ఆర్ సీపీదేనని చెప్పారు. పార్టీలోకి చేరిన వారిలో మన్నెపురి చిట్టి, దాలినాయుడు, సూర్యనారాయణ, నెమ్మాది వెంకటరమణ, తాలాడ జగదీష్, గుడివాడ సుందరరావు తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో పార్టీ నేతలు తుమ్మగంటి సూరినాయుడు, వాకాడ శ్రీను, కర్రోతు రమణ రోబ్బి రమణ, కొమ్ము శంకరరావు, సీహెచ్ సత్యనారాయణ రెడ్డి, కెల్ల సూర్యనారాయణ, కోటగిరి కృష్ణమూర్తి, ఇప్పిలి నీలకంఠం, గవిడి సురేష్ పాల్గొన్నారు. -
పది వేల మందితో మహాగర్జన
గరివిడి, న్యూస్‌లైన్: గరివిడి పట్టణంలో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో సుమారు పది వేల మందితో జరిగిన మహా గర్జన విజయవంతమైంది. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఎలాంటి ఆందోళనుకైనా సిద్ధమేన్నారు. అవసరమైతే ప్రాణాలైన త్యాగం చేద్దామని చెప్పారు. రాష్ట్రం విడిపోతే తాగు, సాగునీటి సమస్యలతో పాటు ఉద్యోగాల సమస్యలు తలెత్తుతాయన్నారు. కొంతమంది రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని విభజించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రం విడిపోతే భావితరానికి తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. సోనియాగాంధీ దేశంలో ఇటలీ పరిపాలన కొనసాగిస్తోందని విమర్శించారు. కాగా అంతకముందు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పది వేల మందితో గరివిడి ప్రధాన రహదారిని దిగ్బంధించారు. స్థానిక పోలీస్‌స్టేషన్ నుంచి ఆర్ఓబీ వరకు ఆందోళనలో పాల్గొన్న ఉపాధ్యాయులు, విద్యార్థులు, సమైక్యవాదులు, వివిధ వేషధారణ, నృత్యాలతో నిరసన వ్యక్తం చేశారు. వ్యాపారులు దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేసి, ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ఎల్.రామకృష్ణారావు, ఉపాధ్యాయ సంఘ నేతలు ఎ.సత్యశ్రీనివాస్, కె.ఈశ్వరరావు జేఏసీ నాయకులు వై. సత్యం, బి. శ్రీదేవి, పంచాయతీ సర్పంచ్ బమ్మి డి కృష్ణమ్మ, మాజీ ఉప సర్పంచ్ బమ్మిడి అప్పలస్వామి, తదితరులు పాల్గొన్నారు. -
వివాహేతర సంబంధానికి అడ్డు అయ్యాడని భర్తనే చంపించింది!
గరివిడి , న్యూస్‌లైన్ : వివాహేతర సంబంధానికి అడ్డు అవుతున్నాడని అగ్ని సాక్షిగా మనువాడిన భర్తనే చంపించింది ఆ ఇల్లాలు. ప్రియునితో కలసి ఘాతుకానికి ఒడిగట్టింది. తీరా ఏమీ తెలియనట్లు భర్త మృతదేహం వద్దే భోరుమని రోదించి అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. చివరికి గుట్టు రట్టయింది. గత నెల 26న ఎం.దుగ్గివలస-గదబవలస గ్రామాల మధ్య వ్యక్తి మృతి చెందిన విషయం విదితమే. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. స్వల్ప కాలంలోనే ఈ కేసు మిస్టరీ వీడింది. అనుమానాస్పద మృతి కాదు.. హత్యగా పోలీసులు నిర్ధారించారు. నిందితులను చీపురుపల్లి సీఐ ఎస్.వాసుదేవ్ శనివారం గరివిడి పోలీసుస్టేష న్లో విలేకరుల ముందు ప్రవేశపెట్టారు. హత్యకు దారి తీసిన కారణాలను వెల్లడించారు. మృతుడు బుక్కిరి గొల్ల, భార్య గౌరితో కలసి కొన్ని సంవత్సరాలుగా చెన్నైలో ఉంటున్నాడు. కూలి పనుల కోసం ఇక్కడ నుంచి వలస వెళ్లి అక్కడ నివసిస్తున్నారు. వీరితో పాటు సమీప బంధువులైన రాజాం మండలం అమరం గ్రామానికి చెందిన బుక్కిరి ఆనంద్, దోసరి గ్రామానికి చెందిన దమరసింగి నరేష్‌లు కూడా చెన్నైకు వలస వెళ్లారు. బుక్కిరి ఆనంద్‌కు, మృతుడు భార్య గౌరికి కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ విషయాన్ని గుర్తించిన గొల్ల చాలాసార్లు భార్య గౌరిని మందలించాడు. దీంతో ఎలాగైనా గొల్ల అడ్డును తొలగించుకోవాలని ఆనంద్, గౌరి పథకం పన్నారు. చెన్నైలోనే అతనిని హత్య చేయాలని తొలుత భావించారు. అయితే ఈలోపు పంచాయతీ ఎన్నికలు రావడంతో అంతా కలసి స్వగ్రామానికి చేరుకున్నారు. ముందుగా పథకం ప్రకారం.. గత నెల 26న గొల్లకు ఆనంద్ రాజాం నుంచి ఫోన్ చేశాడు. సినిమాకు రావాల్సిందిగా కోరాడు. భార్య గౌరి కూడా గొల్లను సినిమాకి వెళ్లాలని ప్రోత్సహించింది. ఇవేమీ తెలియని గొల్ల.. రాజాం సినిమాకి వెళ్లాడు. ఆనంద్‌తోపాటు అతని బావ దమరసింగి నరే ష్ కూడా రాజాం చేరుకున్నారు. గొల్ల రాజాం వచ్చిన వెంటనే నరేష్‌తో అతనిని ఆనంద్ సినిమాకి పంపించాడు. వారి మేనత్తకు కూరగాయలు కొనాలని ఆనంద్ బజారుకు వెళ్లాడు. సినిమా అయిన వెంటనే ముగ్గురూ కలుసుకున్నారు. రాజాంలోనే వైన్‌షాప్‌నకు వెళ్లి పూటుగా మద్యం సేవించారు. అనంతరం క్రికెట్ బ్యాట్ కొనుగోలు చేశారు. అక్కడ నుంచి గొల్లను ఇంటి వద్ద దించేస్తామని ద్విచక్ర వాహనం ఎక్కించారు. గదబవలస-ఎం.దుగ్గివలస గ్రామాల మధ్య నిర్మానుష్యంగా ఉన్న కల్వర్టు వద్ద మూత్రం పోసేందుకని ద్విచక్ర వాహనాన్ని ఆపారు. కల్వర్టు పైన కూర్చొన్న గొల్లపై ఒక్కసారిగా ఇద్దరూ కలిసి క్రికె ట్ బ్యాట్‌తో దాడి చేశారు. తలభాగంపై బలంగా బాదారు. దీంతో గొల్ల కుప్పకూలిపోయాడు. సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. అనంతరం ఏమీ తెలియనట్లుగా ఇళ్లకు చేరుకున్నారు. ఇదంతా తెలిసి కూడా.. ఉదయాన్నే మృతుని భార్య గౌరి సంఘటన స్థలానికి చేరుకుని రోదించింది. తమకు ఎవరూ శత్రువులు లేరని, ఎలా చనిపోయాడో తెలియదంటూ అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. దర్యాప్తును వేగవంతం చేశారు. పోలీసులు దర్యాప్తు చురుగ్గా చేయడంతో.. నిందితులకు భయం పట్టుకుంది. దొరికిపోతామేమోనని ఆందోళనకు గురై.. అమరం వీఆర్ఒ ఎ.సాయిశంకర్ వద్ద లొంగిపోయారు. దీంతో నిందితులిద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు సీఐ తెలిపారు. హత్యకు సహకరించిన మృతుడు భార్య గౌరిపై కూడా చ ట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.