వివాహేతర సంబంధానికి అడ్డు అయ్యాడని భర్తనే చంపించింది!
Published Sun, Aug 4 2013 6:07 AM | Last Updated on Fri, Sep 1 2017 9:38 PM
గరివిడి , న్యూస్‌లైన్ : వివాహేతర సంబంధానికి అడ్డు అవుతున్నాడని అగ్ని సాక్షిగా మనువాడిన భర్తనే చంపించింది ఆ ఇల్లాలు. ప్రియునితో కలసి ఘాతుకానికి ఒడిగట్టింది. తీరా ఏమీ తెలియనట్లు భర్త మృతదేహం వద్దే భోరుమని రోదించి అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. చివరికి గుట్టు రట్టయింది. గత నెల 26న ఎం.దుగ్గివలస-గదబవలస గ్రామాల మధ్య వ్యక్తి మృతి చెందిన విషయం విదితమే. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. స్వల్ప కాలంలోనే ఈ కేసు మిస్టరీ వీడింది. అనుమానాస్పద మృతి కాదు.. హత్యగా పోలీసులు నిర్ధారించారు. నిందితులను చీపురుపల్లి సీఐ ఎస్.వాసుదేవ్ శనివారం గరివిడి పోలీసుస్టేష న్‌లో విలేకరుల ముందు ప్రవేశపెట్టారు. హత్యకు దారి తీసిన కారణాలను వెల్లడించారు. మృతుడు బుక్కిరి గొల్ల, భార్య గౌరితో కలసి కొన్ని సంవత్సరాలుగా చెన్నైలో ఉంటున్నాడు.
కూలి పనుల కోసం ఇక్కడ నుంచి వలస వెళ్లి అక్కడ నివసిస్తున్నారు. వీరితో పాటు సమీప బంధువులైన రాజాం మండలం అమరం గ్రామానికి చెందిన బుక్కిరి ఆనంద్, దోసరి గ్రామానికి చెందిన దమరసింగి నరేష్‌లు కూడా చెన్నైకు వలస వెళ్లారు. బుక్కిరి ఆనంద్‌కు, మృతుడు భార్య గౌరికి కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ విషయాన్ని గుర్తించిన గొల్ల చాలాసార్లు భార్య గౌరిని మందలించాడు. దీంతో ఎలాగైనా గొల్ల అడ్డును తొలగించుకోవాలని ఆనంద్, గౌరి పథకం పన్నారు. చెన్నైలోనే అతనిని హత్య చేయాలని తొలుత భావించారు. అయితే ఈలోపు పంచాయతీ ఎన్నికలు రావడంతో అంతా కలసి స్వగ్రామానికి చేరుకున్నారు. ముందుగా పథకం ప్రకారం.. గత నెల 26న గొల్లకు ఆనంద్ రాజాం నుంచి ఫోన్ చేశాడు. సినిమాకు రావాల్సిందిగా కోరాడు. భార్య గౌరి కూడా గొల్లను సినిమాకి వెళ్లాలని ప్రోత్సహించింది. ఇవేమీ తెలియని గొల్ల.. రాజాం సినిమాకి వెళ్లాడు. ఆనంద్‌తోపాటు అతని బావ దమరసింగి నరే ష్ కూడా రాజాం చేరుకున్నారు. గొల్ల రాజాం వచ్చిన వెంటనే నరేష్‌తో అతనిని ఆనంద్ సినిమాకి పంపించాడు. వారి మేనత్తకు కూరగాయలు కొనాలని ఆనంద్ బజారుకు వెళ్లాడు.
సినిమా అయిన వెంటనే ముగ్గురూ కలుసుకున్నారు. రాజాంలోనే వైన్‌షాప్‌నకు వెళ్లి పూటుగా మద్యం సేవించారు. అనంతరం క్రికెట్ బ్యాట్ కొనుగోలు చేశారు. అక్కడ నుంచి గొల్లను ఇంటి వద్ద దించేస్తామని ద్విచక్ర వాహనం ఎక్కించారు. గదబవలస-ఎం.దుగ్గివలస గ్రామాల మధ్య నిర్మానుష్యంగా ఉన్న కల్వర్టు వద్ద మూత్రం పోసేందుకని ద్విచక్ర వాహనాన్ని ఆపారు. కల్వర్టు పైన కూర్చొన్న గొల్లపై ఒక్కసారిగా ఇద్దరూ కలిసి క్రికె ట్ బ్యాట్‌తో దాడి చేశారు. తలభాగంపై బలంగా బాదారు. దీంతో గొల్ల కుప్పకూలిపోయాడు. సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. అనంతరం ఏమీ తెలియనట్లుగా ఇళ్లకు చేరుకున్నారు. ఇదంతా తెలిసి కూడా.. ఉదయాన్నే మృతుని భార్య గౌరి సంఘటన స్థలానికి చేరుకుని రోదించింది. తమకు ఎవరూ శత్రువులు లేరని, ఎలా చనిపోయాడో తెలియదంటూ అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. దర్యాప్తును వేగవంతం చేశారు. పోలీసులు దర్యాప్తు చురుగ్గా చేయడంతో.. నిందితులకు భయం పట్టుకుంది. దొరికిపోతామేమోనని ఆందోళనకు గురై.. అమరం వీఆర్‌ఒ ఎ.సాయిశంకర్ వద్ద లొంగిపోయారు. దీంతో నిందితులిద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు సీఐ తెలిపారు. హత్యకు సహకరించిన మృతుడు భార్య గౌరిపై కూడా చ ట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Advertisement
Advertisement