వెదుళ్లవలసలో ఘోరం
గరివిడి:అగ్ని సాక్షిగా ఒక్కటైన ఆ జంట అదే అగ్ని సాక్షిగా శాశ్వతంగా విడిపోయింది. అనుమానం, అపనమ్మకం, వ్యసనం రగిల్చిన జ్వాల చితిమంటగా మారి ఓ జీవితాన్ని బలి తీసుకుంది. కుటుంబాన్ని కకావికలం చేసింది. పెళ్లి నాడు చేసుకున్న బాసలను, పేగు తెంచుకు పుట్టిన పిల్లలను విస్మరించిన ఆ దంపతులు గొడవలు పడి చివరకు ప్రాణాలు తీసుకునే వరకు వచ్చారు. పిల్లలను అనాథలను చేశారు. కొన్నేళ్ల కిందట భర్త...భార్యపై హత్యాయత్నం చేస్తే, ఇప్పుడు భార్య... భర్తను సజీవదహనం చేసింది. గరివిడి మండలం వెదుళ్ల వలసలో మంగళవారం రాత్రి జరిగిన ఘటన లోకం పోకడ తెలియని,ముక్కుపచ్చలారని ఇద్దరు చిన్నారులను అనాథలను చేసింది.
గ్రామానికి చెందిన నెమ్మాది నాగరాజు (30), విజయ భార్యాభర్తలు. వీరికి నేష్మ, షణ్ముఖ అనే పిల్లలున్నారు. వీరి మధ్య గొడవల కారణంగా కొన్ని నెలలుగా వీరు నాన్నకు దూరంగా బతుకుతున్నారు. ఇప్పుడు అమ్మే నాన్నను కాల్చేయడంతో అటు నాన్న లేక, ఇటు అమ్మ పరారీ అవడంతో అనాథలుగా మిలిగిపోయారు. ఎందుకు నాన్న అమ్మనుకొట్టేవాడో, అమ్మ నాన్నను ఎందుకు కాల్చేసిందో తెలియని ఆ పసి మొగ్గలు బిక్కముఖం వేసుకుని, బేలచూపులతో భయంభయంగా ఉన్నారు. వారిని చూసిన గ్రామస్తులు వీరి భవిష్యత్ ఎంటని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.